Bengaluru Shocking Viral Video : ఈ ఘటన రాజకీయంగా అక్కడ అధికార పార్టీని ఇబ్బంది పెట్టింది. దీనికి సమాధానం చెప్పుకోలేక అక్కడ నాయకులు నీళ్లు నములుతున్నారు. కప్ సాధించిన ఆనందం మేనేజ్మెంట్ కు లేదు. నాటి నుంచి నేటి వరకు మేనేజ్మెంట్ నుంచి ఉలుకు పలుకు లేదు. ఇక ప్లేయర్లు ఇప్పటికీ అదే విషాదంలో ఉన్నారు. ట్రోఫీ సాధించిన ఆనందాన్ని కనీసం పంచుకోలేకపోతున్నారు. ప్రభుత్వాల తరఫునుంచి పరిహారాల మాట వస్తున్నప్పటికీ.. ప్రజల నుంచి వాటికి ఆమోదం లభించడం లేదు. పైగా మేమే తిరిగి అంతకంటే ఎక్కువ పరిహారం ఇస్తాం.. పోయిన వారి ప్రాణాలు తిరిగి తెస్తారా అంటూ బాధతో కూడిన తిరుగు సమాధానం చెబుతున్నారు. వాస్తవానికి ఇలాంటి పరిణామాలు గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో చోటు చేసుకోలేదు. ఈ ప్రమాదానికి కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ.. దాదాపు పదికి మించి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన తర్వాత ఎలాంటి సాకులు చెప్పినప్పటికీ ఉపయోగం ఉండడం లేదు.
ఈ మహా ఘోరం జరిగిన తర్వాత ఆ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా విషాదంతాలుకు చాయాల నుంచి బయటపడలేదు. ఇప్పటికీ అక్కడ స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కొందరు వ్యాపారులైతే షాపులు ఇంకా తీయడం లేదు. ఆ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన వారంతా ఆ షాక్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ” చూస్తుండగానే జనం భారీగా వచ్చారు. గేట్లు తీయకపోవడంతో గోడలు ఎక్కి అందులోకి దునకడానికి ప్రయత్నించారు. అది ఒక రకంగా వారికి ఇబ్బందికరంగా మారింది. పోలీసులు లాఠీలతో బెదిరించడంతో చాలామంది భయపడ్డారు. పరుగులు తీయడానికి ప్రయత్నించి కింద పడిపోయారు. కొంతమందికి శ్వాస సరిగ్గా ఆడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇంత దారుణం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇంతటి ప్రమాదం ఎప్పుడూ చోటు చేసుకోలేదని” ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఇక మొన్నటి దారుణంలో చాలామంది పాదరక్షలు అక్కడే వదిలిపెట్టి పోయారు. అలా వదిలి వెళ్ళిన పాదరక్షలు గుట్టలుగా పేరుకుపోయాయి. వాటిని తొలగించడానికి బెంగళూరు నగర పారిశుధ్య సిబ్బందికి నానా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ట్రాలీలకు ట్రాలీల చెప్పులను డంపింగ్ యార్డ్ లకు తరలిస్తున్నారు. ఆ చెప్పులు మొత్తం స్టేడియం వద్దకు వచ్చి.. ఆ తొక్కిసలాటలో గాయపడిన, మరణించిన వారివై ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. గుట్టలుగా చెప్పులు పేరుకుపోయాయి అంటే.. వాటిని తొలగించడానికి సిబ్బందికి ఇంత సమయం పడుతోందంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక రాజధాని పోలీసులు స్టేడియంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే చాలా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించి.. కేసు దర్యాప్తుకు సంబంధించి ఒక అంచనాకు వచ్చారు. మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి పోలీసులు నివేదిక అందించనున్నారు. అయితే ఇప్పటికే అక్కడ చెప్పులు, శాండల్స్, షూ లు మొత్తంగా 150 బ్యాగులు నిండిపోయాయని.. అక్కడ మొత్తం రక్తపు మరకలు ఉన్నాయని పారిశుధ్య సిబ్బంది అంటున్నారు. అది మొత్తంగా ఒక యుద్ధక్షేత్రం లాగా ఉందని వాపోతున్నారు.