గత రెండురోజుల్నుంచీ టీవీల్లో పవన్ కళ్యాణ్ , రామ్ గోపాల్ వర్మ వివాదం చిలికి చిలికి గాలి వానలాగా తయారయ్యింది. వివాదానికి రామ్ గోపాల్ వర్మ విడుదలచేసిన ట్రైలర్ భూమిక అయ్యింది. ప్రతిగా నూతన్ నాయుడు కూడా పరాన్నజీవి ట్రైలర్ ని విడుదల చేయటం తో టీవీల్లో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. టి ఆర్ పి లు లేకుండా సతమతమవుతున్న టీవీ లకి ఈ లాక్ డౌన్ పీరియడ్ లో మంచి మసాలా నే దొరికింది. వివాదం సంగతి దేవుడెరుగు టీవీ లకి ఇది పండగే. రెండు సినిమాలు 25వ తేదీ విడుదల కావటం కూడా ఈ వివాదం ఇంకొన్నాళ్ళు కొనసాగుతుందనేది అందరికీ తెలిసిందే. టీవీ ఓనర్లు మాత్రం దీనితో మనసులో పవన్ కళ్యాణ్ కి , రామ్ గోపాల్ వర్మకి దండాలు పెట్టివుంటారు. ఇంకొన్నాళ్ళు ఈ టీవీ లకి టి ఆర్ పి లకు దిగులు లేదు. ఎవరు ఎక్కువ మసాలా వండితే వాళ్లకు రేటింగులు పెరుగుతాయి. అందుకే వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సరే ఇక అసలు విషయానికి వద్దాం.
ఈ గొడవ మొదలయ్యింది కొంతమంది పవన్ ఫ్యాన్స్ రామ్ గోపాల్ వర్మ ఎంఎల్ఎ కాలనీ లోని ఆఫీస్ లోకి చొరబడటంతో. పవన్ కళ్యాణ్ అభిమానులకి పవర్ స్టార్ పేరుతో డైరెక్టుగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీయటం , దాని ట్రైలర్ విడుదల చేయటంతో కోపం కట్టలు తెంచుకుంది. ఇది సహజం. తెలుగు సినిమా నటుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు విలక్షణం. ఆయనంటే ప్రాణమిస్తారు. అందునా ఇప్పటికే అమ్మరాజ్యం సినిమా లో పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరుపై అభిమానులకు రామ్ గోపాల్ వర్మ మీద ఎక్కడలేని కోపం వుంది. కాబట్టి తమ అభిమాన ఆరాధ్యదైవం పై రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమా ఎలా ఉండబోతుందో ముందే ఒక అంచనాకి రావటం, దానికి తగ్గట్టుగా ట్రైలర్ విడుదల కావటం కలగలిపి పట్టలేని కోపంతో రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై కి వెళ్ళారని అర్ధమవుతుంది. అంతకుమించి వీళ్ళ ఆవేశం ఏదో ఆలోచించి రామ్ గోపాల్ వర్మ ని ఏదో చేద్దామనే కుట్ర కోణం వుందని అనుకోలేము.
సినిమా నటుల అభిమానుల్లో ఇవి సహజమే. కాకపోతే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా నటుడే కాదు, ఒక రాజకీయ పార్టీ స్థాపకుడు. సినిమా నటుడి అభిమానులు చేసే చర్యలకి రాజకీయ పార్టీ కార్యకర్తల చర్యలకి తేడా వుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిధి విస్తృతం. రాజకీయ నాయకుడు అందరి, అన్ని వర్గాల వాడు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు అర్ధం చేసుకోవాలి. ఒకసారి రాజకీయ కోణం ప్రవేశించిన తర్వాత పరిణామాలు వేరుగా వుంటాయి. అభిమానులు చేసే ఏ పనైనా అది రాజకీయంగా తన అభిమాన హీరో కి నష్టం కలిగించేదిగా వుండకూడదు. ఇక రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓ విపరీత మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఇది మాట్లాడొచ్చు, మాట్లాడకూడదు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని వుండదు. నా ఇష్టం, నా స్వేచ్చ నాది, నాకు సమాజం తో సంబంధం లేదు అనే మనస్తత్వం తో ప్రవర్తించే వ్యక్తి. అదే పవన్ కళ్యాణ్ ఓ బాధ్యత గల రాజకీయ నాయకుడు. ఈ తేడా అర్ధం చేసుకుంటే సమస్య సగం పరిష్కారం అవుతుంది.
రామ్ గోపాల్ వర్మ ప్రజాస్వామ్యం ప్రసాదించిన స్వేచ్చను బాధ్యతారాహిత్యంగా వాడుకుంటున్నాడు. అయినా తనపై ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆచి తూచి అడుగువేయాలి. ఆవేశం తో జరిగేదేముంది. అభిమానులు ఆఫీస్ కెళ్ళి గొడవ పెట్టుకుంటే సినిమా విడుదల కాకుండా ఆగదు కదా. అటువంటప్పుడు దీనివలన వచ్చే ప్రయోజనం లేకపోగా పవన్ రాజకీయంగా జవాబిచ్చుకోవాల్సి వుంటుంది. ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టి ఆర్, అమ్మ రాజ్యం లాంటి రాజకీయ ఫిక్షన్ సినిమాలు తీసివున్నాడు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. ఈరోజు ఈ సినిమా ఆపమని చెప్పటానికి ఈ వ్యవస్థలో కష్టమే. అయినా న్యాయపరమైన అవకాశాలు ఏమైనా ఉంటాయేమో చూడటం తప్పించి ప్రత్యక్షంగా ఇటువంటి పనులు చేయటం వలన అతనికి లేనిపోని ప్రచారం ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నిటికీ సిద్ధంగా వుండాలి. ఇవ్వాళ సినిమా వచ్చింది, రేపు ఇంకో సమస్య రావచ్చు. ఇటువంటి సమయంలో ఆవేశం కన్నా ఆలోచనే ముఖ్యం. ఒక్కోసారి అవకాశం వచ్చేదాకా ఎదురుచూడక తప్పదు. పవన్ కళ్యాణ్ అభిమానులకి సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేస్తే హుందాగా వుంటుంది. రాజకీయంగా కూడా లబ్ది చేకూరుతుంది. కానిపక్షంలో తనే ఇటువంటివి ప్రోత్సహించాడని ప్రత్యర్ధులు ప్రచారం చేసే అవకాశముంది. ఆ అవకాశం వాళ్ళ కివ్వొద్దని, ప్రత్యర్ధుల ట్రాప్ లో పడొద్దని, రాజకీయకోణం లో ఆలోచించమని సలహా ఇస్తున్నాము.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Pawan kalyan dont fall into trap of rivals
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com