Home Blog Page 8637

రంగంలోకి హరికృష్ణ కుమార్తె, టిడిపి వ్యూహం ఫలిస్తుందా?

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పట్టుకోల్పోయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే పార్టీ అధిష్టానం మాత్రం పట్టువదలకుండా హుజూర్‌నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో ఇప్పటికీ బలమైన రాజకీయ పార్టీగా నిలవగలమని చాటి చెప్పడమే లక్ష్యంగా తెలుగుదేశం వ్యూహరచన చేస్తోంది.

ఇందులో భాగంగా నందమూరి కుటుంబాన్ని టీడీపీ అభ్యర్థి కిరణ్మయికి మద్దతుగా రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. అక్టోబర్ 16 నుంచి హరికృష్ణ కుమార్తె సుహాసిని మూడు రోజుల పాటు కిరణ్మయికి మద్దతుగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. అభ్యర్థి మహిళ కావడం వలన సుహాసినితో ప్రచారం చేయిస్తే అక్కడున్న మహిళల ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కూడా హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలిసింది. అక్టోబర్ 17 లేదా 19 తేదీలలో బాలకృష్ణ ప్రచారంలో పాల్గొంటారన్న ప్రచారం జరుగుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సుహాసిని కూకట్‌పల్లి స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో నందమూరి బాలకృష్ణ స్వయంగా సుహాసిని తరుపున ప్రచారం నిర్వహించినా గాని ఫలితం దక్కలేదు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం వేసిన ఎత్తులు ఏవీకూడా పనిచేయలేదు. మరి ఈసారి ఏవిధమైన నమ్మకంతో హరికృష్ణ కుమార్తెను మళ్ళి తెరపైకి తీసుకొస్తున్నారో పార్టీ అధిష్టానికే తెలియాలి!

పవన్ అభిమానులకు పండగ! నెక్స్ట్ సినిమాకు పవన్ ఓకే

పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే అభిమానులు కోకొల్లలు. స్వయంగా అన్నయ్య చిరంజీవి తనకున్న అనుభవంతో పవన్ కళ్యాణ్ కి ఒక ఫంక్షన్ లో అభిమానుల ముందు పర్సనల్ సలహాగా సినిమాలలో నటించడం ఆపవద్దని అన్నారు. అన్నయ్య సలహాని గౌరవిస్తూ పవన్ రెండు సినిమాలలో నటించినా గాని తరవాత పుల్ స్టాప్ పెట్టేసారు. మళ్ళి ఇన్నాళ్లకు పవన్ మళ్ళి నటిచడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది . రాజకీయాలలో బాగా బిజీ అయిన పవన్ అసలు సినిమాలలో నటిస్తాడా? లేదా? అనే సందేహాలున్న అభిమానులకు ఇది ఒక పండుగలాంటి వార్తే మరి …

విషయమేమిటంటే… విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు రీసెంట్‌గా ఓ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ పవర్ స్టార్ కి నచ్చిందంట. ఇంతకూ… ప‌వ‌న్‌ని త‌న క‌థ‌తో మెప్పించిన దర్శ‌కుడెవ‌రో కాదు.. జాగ‌ర్ల‌మూడి క్రిష్‌. గ‌మ్యం, వేదం, కృష్ణ‌మ్ వందే జ‌గ‌ద్గుర‌మ్, కంచె వంటి డిఫ‌రెంట్ సినిమాల‌ను క్రిష్ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అన్నీ అనుకున‌ట్లు కుదిరితే ప‌వ‌న్‌, క్రిష్ సినిమా తెర‌కెక్కే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని టాక్‌.

సైరా నరసింహారెడ్డి సినిమా చరిత్రాత్మకం

సైరా నరసింహారెడ్డి గురించి తెలిసిన వాళ్ళు బహు అరుదనే చెప్పాలి. వీర పాండ్య కట్టబొమ్మన్ గురించి, అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వాళ్ళు ఎలా లేరో నరసింహారెడ్డి గురించి తెలిసిన వాళ్ళు అలానే లేరు. మరి ఇలా చరిత్ర మరుగునపడిన వాస్తవాలు ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ముందుగా ఇంతటి ధీరుడి చరిత్రను అందరిముందుకు తీసుకొచ్చినందుకు చిత్ర నిర్మాతకు, దర్శకునికి, కధని రసవత్తరంగా చెప్పిన పరుచూరి బ్రదర్స్ కి , అందరికన్నా ఎక్కువగా ఈ సినిమాని అన్నీ తానై ప్రోత్సహించిన చిరంజీవికి అభినందనలు. చిరంజీవి అనగానే స్టెప్పులు, హాస్యం ప్రధానపాత్ర పోషిస్తాయి. అటువంటిది ఓ చారిత్రాత్మక సినిమా ని ఇంత పెద్దఎత్తున తలపెట్టటం గొప్ప సాహసమేనని చెప్పాలి. ఓ తెలుగువాడు భారత స్వాతంత్రపోరాటంలో ఇంతటి చరిత్ర సృష్టించాడని తెలియటం మనందరికీ గర్వకారణం.

ఇక సినిమా సంగతి చెప్పాల్సివస్తే ఇది అన్ని కోణాల్లో అద్భుతమైనదిగా చెప్పాలి. రాయలసీమ పాలెగాళ్ళ ను గురించి, అప్పటి సామాజిక పరిస్థితులు, అంశాలగురించి, అన్నింటికన్నా ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ దౌష్ట్యాల గురించి తెలుసుకోవాలనుంటే ఈ సినిమా ఉపయోగపడుతుంది. బ్రిటిష్ వాళ్ళు కుట్రలు, కుతంత్రాలు, నీచపు ఎత్తుగడలతో భారతదేశ ప్రజల్ని ఎలా లోబర్చుకుందీ తెలిపే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా వున్నాయి. అల్లూరి సీతారామరాజు పోరాటం మన్యపు గిరిజనుల్ని సంఘటిత పరిస్తే నరసింహారెడ్డి సీమ ప్రజానీకాన్ని సంఘటితపరిచాడు. బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొనటానికి పాలెగాళ్లను ఐక్యపరచటమే కాకుండా అప్పట్లోనే ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళను కూడా జతపరిచి ఉద్యమం నిర్మించటం గొప్పవిషయం.

సినిమా సహజసిద్ధంగా అప్పటికాలపు కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. చిరంజీవి చారిత్రక పాత్రలో అద్భుతంగా నటించాడు. సినిమా మొత్తం అన్నీ తానై నడిపించాడు. కొంతమంది విమర్శకులు సినిమా మొత్తం తనపాత్రనే ప్రధానంగా చూపించారని చెప్పటంలో అర్ధంలేదు. ఆ కధలో నరసింహారెడ్డి నే అన్నే తానై నాయకత్వం వహించాడు కాబట్టి అలా చూపించకపోతేనే తప్పయివుండేది. సినిమా చూసినంతసేపు ప్రేక్షకులకు బ్రిటిష్ వాళ్ళ మీద కోపంతోపాటు దేశభక్తితోరగిలిపోయారని చెప్పొచ్చు. నరసింహారెడ్డి సాహసాలు, తెగువ, చొరవ ప్రతిఒక్క భారతీయుడికి ఆదర్శం కావాలి. ఈ సినిమా వలన నరసింహా రెడ్డి చరిత్ర తెలియటంతో పాటు , భారతీయుల్లో ఇంకొక్కసారి జాతీయభావాలు రగిలినాయని చెప్పొచ్చు. ఈ పాత్రలో చిరంజీవి నరసింహారెడ్డి ఎలావుంటాడో తెలియదుకానీ చిరంజీవిలాగా ఉంటాడని అనుకునేటట్లు చేశాడు. సినిమాకోసం మెగాస్టార్ హోదాను పక్కనపెట్టి ఎంతో శ్రమ పడ్డాడని , నరసింహారెడ్డి సాహసాన్ని, ఆవేశాన్ని చక్కగా ప్రదర్శించాడని ఘంటాపధంగా చెప్పొచ్చు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని పుస్తకంగా తీసుకొస్తే కొద్దిమందే చదువుతారు. అదే సినిమా తీస్తే ఎన్నో లక్షలమంది చూడటమే కాకుండా దానితో ఉత్తేజితమవుతారు. ఇందులో మిగతా పాత్రధారుల గురించి చెప్పాల్సివస్తే తమన్నా, నయనతార, అనుష్కా పాత్రలు చిన్నవైనా మరుపురానివి. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటించటం సినిమాకే ఓ మణిపూస. అవుకురాజు పాత్ర ని చాలా బాగా తీర్చిదిద్దటమే కాకుండా ఆ పాత్రలో సుదీప్ అద్భుతంగా చేసాడు. జగపతిబాబు చక్కగా మెప్పించాడు. ప్రతికోణంలోనూ ఈ సినిమా అప్పటి చరిత్రను చక్కగా ప్రతిబంబించింది. ఈ అనుభూతిని చెప్పేదానికన్నా చూస్తేనే వందశాతం అనుభవించగలరనిపిస్తుంది. మొత్తం మీద ఈ చారిత్రక సినిమా చరిత్రాత్మకమే.

‘క్రిస్మస్‌’ పండుగ అర్థం-పరమార్థం

పస్కా, క్రిస్మస్‌, ఈస్టర్.. ఈ మూడు పండుగలు క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగలు అందులో క్రిస్మస్ అతి పెద్ద పండుగ. “క్రిస్మస్‌” అంటే క్రీస్తును ఆరాధించడం, “పస్కా” అంటే మరణాన్ని ధాటి జీవంలోకి ప్రవేశించుట అని అర్థం, “ఈస్టర్” అంటే మరణాన్ని జయించి తిరిగిలేచుట అని అర్థం. ఈ విధంగా క్రిస్మస్‌ రోజున యేసుక్రీస్తును ఆరాధించిన వాళ్ళు, “పస్కా” రోజున మరణంపై జయాన్ని పొందుకొని “ఈస్టర్” రోజున తిరిగిలేచే బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఆ నమ్మకంతోనే యేసుక్రీస్తును వారి జీవితాంతం ఆరాధిస్తుంటారు. క్రిస్మస్ రోజు యేసు క్రీస్తు జన్మించగా, పస్కా రోజు సిలువలో మరణించాడు, ఈస్టర్ రోజున మరణాన్నీజయించి తిరిగిలేచాడు. పుట్టుక, మరణం అని రెండు రోజులు ఉండటం సహజం కానీ యేసుక్రీస్తుకి మరణాన్ని గెలిచి తిరిగిలేచిన చరిత్ర కూడా ఉండటం గమనార్హం.

ప్రజలను పాపాల నుంచి రక్షించటానికి సాక్షాత్తు రక్షకుడే అంటే దేవుడే సాధారణ మనిషిగా భూమిపై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ. పాపుల్ని రక్షించటానికి భూమిమీద సామాన్య మనిషిగా జన్మించి రోజు క్రిస్మస్. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ను క్రైస్తవులు జరుపుకుంటారు. లోక రక్షకుడిగా అవతరించిన యేసుక్రీస్తు పుట్టుక క్రిస్మస్‌ పండుగను ప్రపంచంలోని దాదాపు 280 కోట్ల మంది ప్రజలు జరుపుకుంటారు. క్రిస్మస్‌ వేడుకలను వెలుగులతో చర్చిలను సుందరంగా తీరిదిద్దారు. విద్యుత్‌ కాంతులతో చర్చిలన్నీ వెలిగిపోతుంటాయి. బెలూన్స్‌, స్టార్స్‌, క్రిస్మస్‌ ట్రీ, బెల్స్‌ తదితర అలంకరణలతో చర్చిలు, కైస్త్రవుల గృహాలు కళకళలాడిపోతుంటాయి.

క్రిస్మస్‌ పండుగ పరామార్థం…

క్రిస్మస్‌ అంటే క్రీస్తును ఆరాధించడం అని అర్థం. క్రైస్ట్‌ అంటే అభిషిక్తుడు (క్రీస్తు), మస్‌ అంటే ఆరాధన. అభిషిక్తుడిని ఆరాధించడం. క్రిస్టియానిటీ అంటే ఒక మతంగా కాకుండా జీవన విధానంగా భావించి, లోక రక్షకుడు క్రీస్తు నడిచిన మార్గంగా భావించి అనేకమంది క్రైస్తవేతరులు కూడా జరుపుకుంటారు. ఈ విధంగా మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి మనిషి క్రీస్తును ఆరాధించటమే క్రిస్మస్‌ పండుగ పరమార్థం

క్రీస్తు పుట్టుక…

క్రీస్తు పుట్టుక సాధారణమైన అంశం కాదు. క్రీస్తు జననానికి 600 సంవత్సరాల ముందే ఆయన పుట్టుక గూర్చి జ్ఞానులు తెలిపారు. క్రీస్తు జననం వల్ల రెండు అపూర్వ ఘట్టాలు ఆవిష్కరించాయి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా గుర్తింపులోకి వచ్చాయి. మరియమ్మకు దైవ దూత దర్శనమిచ్చి ఆమె గర్బమున క్రీస్తు జన్మిస్తాడని చెప్పిన ప్రకారంగా క్రీస్తు జననం జరిగింది. లోకాధిపతి అయిన క్రీస్తు పశువుల పాకలో జననం ఓ విశేషం…
క్రీస్తు జననం బెత్లెహెం దేశంలోని పశువుల పా కలో జరిగింది. ఆయన జనన సమాచారం తొలుత గొ ర్రె కాపరులకు అందుతుంది. యేసుక్రీస్తును తొలి సా రిగా దర్శించిన వారు గొల్లలుగా బైబిల్‌ చెబుతుంది.

తూర్పున దర్శనమించ్చిన నక్షత్రం…

క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులు తమ ఇళ్లపై ’స్టార్‌’ను ఏర్పాటు చేస్తారు. క్రీస్తు పుట్టుక కు నక్షత్రాన్ని సూచికగా పరిగణిస్తారు. బెత్లెహెం దేశంలో తూర్పున భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానులు గుర్తిస్తారు. 2019 సంవత్సరాల క్రితం క్రీస్తు జన్మించిన రోజున నక్షత్ర వెలుగు ఆధారంగా యేసు జన్మించిన పశువుల పాక వద్దకు చేరుకుంటారు. బాలయేసును ప్రార్ధించారు.

మనదేశంలో పండగలే పండగలు

పండగల సీజన్ వినాయక చవితితో మొదలయ్యింది శ్రీరామనవమి వరకు కొనసాగుతుంది. ఈ సీజన్లో ప్రజలు పనికన్నా పండగలపేరుతో కాలక్షేపానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. మిగతాదేశాల్లో లాగ పండగంటే ఒకరోజో , రెండు రోజులో కాదు ఏకంగా వారం రోజులు, పదిహేనురోజులు కూడా చేసుకుంటారు. ఇన్నిరోజులు ప్రజలకి టైం ఎలా దొరుకుతుందనేదే ప్రశ్న. ప్రతి కాలనీలో, అపార్టుమెంటుల్లో , ఊళ్లలో అయితే ప్రతి బజారులో ఒక కమిటీ ఏర్పడి కార్యక్రమాల్ని నడుపుతారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు భారతదేశంలో ఇన్ని పండగలను ఎలా నిర్వహిస్తున్నారో చూసి నేర్చుకోవాలి. ఆ మధ్య దీనిపై ఒక సినిమాలో కూడా ఇదే చూపించారు. ఎందుకు చెప్పాల్సివస్తుందంటే ఇన్ని రోజులు సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరిట వినోదానికి కేటాయిస్తున్న దేశం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు.

ఇది దేశానికి మంచిదా కాదా అంటే చెప్పలేము. ముందుగా దీనిలోని సానుకూల అంశాలు చూద్దాం. ప్రజలు అందరూ కలిసి మెలిసి సామూహిక కార్యక్రమాలు చేయటం సమిష్టితత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ కార్యక్రమాల్లో తలా ఒక పని చేయటం, ఆప్యాయంగా పలకరించుకోవటం , బంధువులు, స్నేహితులు ఇంటికి రావటం , ఊళ్లలోనయితే ఈ పండుగల సందర్భంగా అందరూ పట్టణాలనుంచి వచ్చి కొద్ది రోజులు సరదాగా గడపటం,అంతరించిపోతున్న కళలకు ప్రాణంపోసి ఈ పండగల సందర్భంగా ప్రదర్శించటం ఇవన్నీ సానుకూల అంశాలే. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆ కొద్దిరోజులూ ఆనందంగా గడపటం. ఇప్పుడు ప్రభుత్వాలు చెప్పే ‘ హ్యాపీనెస్ ఇండెక్స్ ‘ ఈ పండగల వాతావరణంలో ఉఛ్చ దశకు వెళుతుంది. ముఖ్యంగా పేద ప్రజలు ఖర్చులేకుండా వినోదాన్ని పొందగలుగుతారు. ఇంతవరకు ఈ పండగల వాతావరణం సమాజానికి, వ్యక్తులకి చాలా మంచి చేస్తుందనే చెప్పాలి.

అదేసమయంలో కొన్ని ప్రతికూల అంశాలు కూడా చూద్దాం. సమాజం ఆర్ధిక ప్రగతి సాధించాలి అంటే ఉత్పత్తి వృద్ధి చేయాలి. ఆ కోణంలో చూస్తే ఈ వాతావరణం ప్రతికూల అంశమేనని చెప్పాలి. ఉదాహరణకు మన తెలుగు సమాజాన్నే తీసుకుందాం. ఒకనాడు అతితక్కువ పండగలకే ఎక్కువ సమయం కేటాయించేవాళ్లు . ముఖ్యంగా దసరా పండగే అతి పెద్ద పండగగా జరుపుకునే వాళ్ళు. మిగతావి ప్రాంతాలను బట్టి ప్రాధాన్యాలు ఉండేవి. ఇప్పుడు వినాయక చవితి వారం రోజులకి పైగానే జరుపుతున్నారు. దసరా ఒకనాడు కేవలం మూడురోజులే ప్రధానంగా జరుపుకునే వాళ్ళు. నవరాత్రులు వున్నా అందరు ప్రజలూ పూర్తిగా పండగజరుపుకునేవాళ్ళు కాదు. అలాగే శ్రీరామనవమి ఆంధ్రాలో కనీసం వారం రోజులు పందిళ్లు వేసి జరుపుతారు. తెలంగాణాలో బతకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకోవటం ఇటీవల ప్రాచుర్యం పొందింది. ఇలా చెప్పుకుంటూపోతే ఫులుస్టాప్ కనబడటంలేదు. శివరాత్రి జాగారం, కార్తీక సోమవారం, శ్రావణ శుక్రవారం ఇలా ఒకటేమిటి దీనికి మన ఓపిక . ఒకనాడు ఇన్నిరోజులు జరుపుకునే వెసులుబాటు ప్రజలకు ఉండేది. మరి ఇప్పుడో. ఆధునిక సమాజంలో ఈ ఉత్సవాలను పెంచుకుంటూపోతే ఆ మేరకు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందనే స్పృహ వున్నట్లులేదు.

దీనికి తోడు ఉద్యోగస్తులకైతే ఏ దేశంలో లేనన్ని సెలవులు ఈ దేశంలో వున్నాయి. అన్ని మతాల పండగలకి అందరికీ సెలవులిస్తాం. మనది సెక్యులర్,ఉదారవాద సమాజమని గొప్పగా చెప్పుకోవాలికదా మరి. అదీ కొన్నిరాష్ట్రల్లోనయితే మరీ ఉదారంగా ఏకంగా సంవత్సరానికి 30కి పైగా సెలవులిస్తారు. ఇదికాక మళ్ళా క్యాజ్యువల్ సెలవులు, ప్రివిలేజ్ సెలవులు, సిక్ సెలవులు యధాతధం. ఈరోజుకి అర్ధంకాని విషయం రంజాన్ కి , క్రిస్మస్ కి హిందువులకి ; రామనవమికి , మిగతా హిందూ పండగలకి ఇతర మతస్తులకు ఎందుకు సెలవిస్తారో అర్ధంకాదు. అదేదో ఒక్కో మతంలోవున్న అతిపెద్ద పండగకి కాదు అన్ని మతస్థులకు అన్ని పండగలకి సెలవులిస్తారు. ఇందులో లాజిక్ ఏంటో ఇప్పటికీ అర్ధంకాదు. ఈ టాపిక్ మాట్లాడితే ఉదోగస్తుల దృష్టిలో ఉద్యోగవ్యతిరేకిగా ముద్రపడతాం అని ఎవ్వరూ మాట్లాడారు. ఉత్పత్తి పెరగలేదని ప్రభుత్వాన్ని విమర్శించే మనం మన వైపునుంచి ఉత్పత్తి పెంచటానికి ఏమీ చేయలేమా? ఆర్ధిక విధానాలు , ప్రభుత్వ విధానాలు కొంచెంసేపు పక్కనపెడదాం. ఇన్ని సెలవులు ఉంటే ఉత్పత్తికి ప్రతిబంధకం కాదా? సంవత్సరానికి ఇన్ని సెలవులని నిర్ణయించుకొని ఆ సెలవులను ఎవరికివారు వాళ్ళ మత పండగలకు వాడుకోవచ్చుకదా. అంతకుమించి సెలవు కావాలంటే తమ వ్యక్తిగత సెలవులనుంచి మినహాయించేటట్లు చేయొచ్చు. ఇన్ని సెలవులు బదులు వారానికి ఐదురోజులు పనిదినాలు పెడితే అటు ప్రభుత్వానికి , ఇటు ఉద్యోగస్తులకు మేలు జరుగుతుంది. కాబట్టి సెలవుల్లో సంస్కరణలు రావాల్సివుంది. వారంలో ఐదురోజులు అన్ని కార్యాలయాలు,పరిశ్రమలు, షాపులు తెరచివుంచే పద్ధతుల్లో సెలవుల సంస్కరణలు తీసుకురావాలి.

చివరిగా చెప్పొచ్చేదేంటంటే పండగలు జరుపుకోవటం సమాజంలో సానుకూల పరిణామం. సమిష్టితత్వాన్ని, సంతోషాన్ని పంచిపెడుతుంది. అదేసమయంలో ఆధునిక సమాజంలో ఉత్పత్తి కోణం నుంచికూడా దృష్టిసారించి వ్యవస్థీకరించాల్సిన అవసరం వుంది. ప్రజల ఉత్సాహాన్ని పెంపొందిస్తూనే ఉత్పత్తి కి అవరోధాల్ని తొలగించాల్సిన అవసరం ఎంతయినాఉంది. దీనిపై ప్రజల్లో అవగాహన , చైతన్యం కలిగించి అందుకు అనుకూలంగా సంస్కరణలు చేపడితే దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది.

రోజాపై హైపర్ ఆది అసభ్యకర వ్యాఖ్యలు

జబర్దస్త్ కామెడీ షోలో బోలెడంత ప్రజాదరణ హైపర్ ఆది స్కిట్లకు వస్తుంది. స్కిట్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రాసలు, పంచ్ డైలాగ్స్ , కొంటె మాటలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. గురువారం ప్రసారమైన జబర్దస్త్ షోలో భాగంగా హైపర్ ఆది తన స్థాయికి మించి అతి చేశాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ పాత్రతో హైపర్ ఆది తెర ముందుకు వచ్చాడు. స్కిట్‌లో భాగంగా.. తన భార్యగా నటించిన బిగ్‌బాస్ ఫేమ్ రోహిణి, మరదలిగా శాంతి స్వరూప్ నటించాడు. అయితే, రాఘవేంద్రరావు నన్ను చూసుంటే నా బొడ్డు మీద ఏ పండుతో కొట్టేవారో తెలుసా అని శాంతి స్వరూప్ అనగా, పండులతో, పువ్వులతో కొట్టడానికి నువ్వేమన్నా రోజా గారివా అంటూ ఆది వ్యాఖ్యానించాడు.

ఆది అలా అనడంతో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అతడేంటి ఇలా అంటున్నాడని ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. వెంటనే.. ఆమె అందగత్తె కాబట్టి రాఘవేంద్రరావు అలా చేశారంటూ ఆది తన స్కిట్‌ను కొనసాగించాడు. అయితే, హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్జి హోదాలో ఉన్న వ్యక్తిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తావా? అంటూ మండిపడ్డారు. మంచి హోదాలో ఉన్న వ్యక్తి గురించి అలా ఎలా వ్యాఖ్యానిస్తాడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

‘మన ప్లేట్లో మన బిర్యాని’ అర్థం ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ఏపీ రాజధాని మార్పుపై అమరావతి రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. అయితే రాజధాని మార్చడం వెనుక గల కారణాలను పరిశీలించినట్లయితే సీఎం జగన్ అధికారంలోకి రాకముందు నుంచే ఈ రాజధాని మార్పు ఆలోచన ఉందని,అందుకే జగన్ తమ పార్టీ అంతర్గత సమావేశంలో లో “మన ప్లేట్లో మన బిర్యాని తిందాం” అంటూ ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే ప్రకటించారు,అందులో భాగంగానే ఎన్నికలకు ఏడాది ముందు నుంచే భూములు కొనుగోలు చేశాం అని విశాఖ ఎంపి సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

అయితే తెరవెనుక విశాఖ లో భారీ భూములు కొనుగోలు చేసి ఇన్సైడ్ ట్రేడింగ్ లో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద విజయ్ సాయి రెడ్డి వేల ఎకరాలు కొన్నారని ప్రచారం జరుగుతోంది.. దానికి తగ్గట్టుగానే ఆయన ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయాన్ని సీఎం జగన్ కంటే ముందే ప్రకటించారు. “పరిపాలన వికేంద్రీకరణ” అంటున్నా తెరవెనుక ఇలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ నడుస్తున్నట్లు తెలుస్తుంది.

ఏది ఏమైనప్పటికీ పరిపాలన వికేంద్రీకరనో లేక స్వార్థ రాజకీయాల వల్లనో ప్రజలు మోసపోతూనే ఉన్నారు. రాజధాని వస్తే తమ బ్రతుకులు మారతాయని సాగు చేసి పండించుకునే భూమిని, పచ్చటి పొలాలను రాజధాని కోసం గత ప్రభుత్వానికి ఇస్తే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం “పరిపాలన వికేంద్రీకరణ” అంటూ రాజధానిని మారుస్తూ, “మీ భూములు తిరిగి ఇచ్చేస్తాం..” అంటూ.. ఉదరగొట్టే మాటలు మాట్లాడటం ఎంతవరకు సబబో వైసీపీ నేతలకే తెలియాలి..

బీజేపీ లక్ష్మణ్ నదుల అనుసంధానానికి వ్యతిరేకమా?

డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు. మంచి విద్యావేత్త. ఏ విషయంపై నయినా సమగ్రంగా అధ్యయనం చేసి మాట్లాడతాడు. మరి ఏమయిందో ఏమోగానీ ఈ రోజు తాను మాట్లాడిన ధోరణి చూస్తే ఫక్తు ఓట్లకోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఓ ప్రాంతీయపార్టీ నాయకుడుగా మాట్లాడాడు. అధ్యక్షుడుగా పనిచేసేదేమో ఒక జాతీయపార్టీ అందునా దేశీయ భావాలు మెండుగా ఉన్నాయని చెప్పుకునే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకిలా మాట్లాడని ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ అసలు విషయమేంటి?

రేపు కెసిఆర్ ప్రధాని మోడీని ఉదయం 11గంటలకు కలవబోతున్నాడు. ప్రధానితో మాట్లాడే చర్చనీయాంశాల్లో నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి కృష్ణా నదికి నీళ్లు తరలించటానికి అయ్యే ఖర్చు కేంద్రం భరించమని కోరవచ్చని వార్తలు వెలువడ్డాయి. ఇటీవలే కెసిఆర్-జగన్ భేటీలో గోదావరి నుంచి శ్రీశైలంకు నీళ్లు తరలించే విషయంలో స్థూలమైన అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో ప్రధానిని కలిసి సహాయం చేయమని అడగబోతున్నట్లు తెలుస్తుంది. దానిపై స్పందిస్తూ తెలంగాణ నుంచి నీళ్లను ఆంధ్రకు తరలించటంపై అభ్యంతరం వ్యక్తంచేశాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి కమీషన్ల కోసం ఒక లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పాడు. ఆంధ్రాలో ఇప్పటికే ఎక్కువ ప్రాజెక్టులు కట్టారని అంతకుముందు కెసిఆర్ చెప్పాడని ఇప్పుడు ఎందుకు నీళ్లు తరలిస్తున్నాడని తెలంగాణ సెంటిమెంటుని రెచ్చగొడుతూ మాట్లాడాడు. డాక్టర్ లక్ష్మణ్ లాంటి వ్యక్తి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఆశ్చర్యంగా వుంది. కెసిఆర్ ని వ్యతిరేకించే క్రమంలో ఏ ఆయుధం దొరికినా యుద్ధం చేయాలని అనుకోవటంతోనే ఇటువంటి ప్రాంతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టటంగా చూడాల్సివుంది. ప్రాంతీయ అభిమానం ఉండటం వేరు, దురభిమానంగా మారటం వేరు. ఆంధ్ర-తెలంగాణ విద్వేషాలు ఇప్పుడిప్పుడే తగ్గి సామరస్యం నెలకుంటున్న తరుణంలో ఒక జాతీయపార్టీకి చెందిన నాయకుడు ఇలా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం ఆశ్చర్యంగా వుంది. ఇంతకీ అసలు తన మాట్లాడినదాంట్లో నిజమెంతో పరిశీలిద్దాం.

గోదావరి నుంచి అధికభాగం నీళ్లు సముద్రం పాలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణాలో ఇప్పుడు మొదలైన అన్ని ప్రాజెక్టులు పూర్తయినా ఇంకా ఎంతో నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుందనేది వాస్తవం. రెడీగా లెక్కలు లేకపోవటంతో ఇక్కడ ఇవ్వటంలేదుగానీ దీనిపై వివాదమేదీ లేదు. మిగులు నీళ్లు సమృద్ధిగా గోదావరిలో ఉన్నాయనేది అందరూ ఒప్పుకుంటున్న నిజం. అటువంటప్పుడు తెలంగాణ ప్రయోజనం ఎక్కడ దెబ్బతింటుందో డాక్టర్ లక్ష్మణ్ సోదాహరణంగా వివరించివుంటే బాగుండేది. వాస్తవాలతో సంబంధంలేని వాదన చేయటం కేవలం సెంటిమెంటు ని రెచ్చగొట్టి సొమ్ముచేసుకోవాలనే తాపత్రయంగా కనిపిస్తుంది తప్పితే వేరే మరేది లేదు. మరి బీజేపీ దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం జరగాలని కోరుకుంటుంటే ఇటువంటి వాదనలు ముందుకు తెస్తే వాళ్ళ జాతీయ విధానానికి వ్యతిరేకం కాదా? బీజేపీ నాయకులు దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా వుంది.

చివరగా ఇంకో విషయం చర్చించాల్సి వుంది. కేవలం ఎగువ రాష్ట్రాలు నీళ్లపై ఇటువంటి వాదనలు లేవనెత్తితే కరువుప్రాంతాలైన తమిళనాడు లాంటి రాష్ట్రాలకు నీళ్లు ఎలా దక్కుతాయి. దేశభక్తి అంటే ఉపన్యాసాల్లో చూపించటంకాదు ఆచరణలో విశాల దృక్పధంతో ఆలోచించినప్పుడే అది నిజమైన దేశభక్తికి కొలమానంగా ఉంటుంది. మరి బీజేపీ నాయకులు ఇలా రెచ్చిగొట్టే ప్రకటనలు చేయటం ఏవిధమైన దేశభక్తో ప్రజలకు వివరించాల్సిన అవసరం వుంది. ఇదేదో తెరాసనో, జగన్ పార్టీనో సమర్ధించటానికి లేవనెత్తినట్లు ఎవరైనా భావిస్తే పొరపాటు. కేవలం బీజేపీ నాయకుని ప్రెస్ మీట్ చూసి స్పందిస్తునట్లుగానే భావించాలి. ఇప్పటికైనా డాక్టర్ లక్ష్మణ్ తన వాదనలోని పొరపాటుధోరణిని సరిదిద్దుకుంటాడని ఆశిద్దాం.

ఉండవల్లి గారి కాశ్మీర్ లొల్లి

ఈ రోజు నేను యూట్యూబు లో అరుణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ విన్నాను. ముందుగా ఒక విషయం చెప్పాలి, నేను అరుణ్ కుమార్ గారిని అభిమానిస్తాను . ఎందుకంటే, ఈరోజుల్లో అవినీతిలేని నాయకులు మచ్చుకైనా కనిపించరు . అరుణ్ కుమార్ గారు ఏవిషయాన్నైనా ముక్కు సూటిగా మాట్లాతారని నేను నమ్ముతున్నాను. అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఫ్రీగా తన అభిప్రాయాలను వెళ్లబుచ్చుతున్నారు . కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా, ఆ పార్టీకి సానుభూతి పరుడుగా ఉండటంలో తప్పులేదు.

నాకు అర్ధం కానీ విషయం ఒకటి అరుణ్ కుమార్ గారు ప్రస్తావించారు. తెలుగు ప్రజలకు వారు కొంత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అనుకుంటున్నాను. కాశ్మిర్ విషయం మాట్లాడుతూ 2 నెలల నుండి వాళ్ళను నిర్బంధంలో ఉంచి ‘అంతా బాగుంది’ అని అన్ని భాషలలో భారతదేశంలో ఉన్న ప్రజలందరికి హ్యూస్టన్, అమెరికా నుండి బాకా కొట్టారు, మోడీ గారు అన్నారు . నాకు అదికూడా తప్పు అని అనిపించలేదు. ఎవరి అభిప్రాయాలు వారివి. కాశ్మిర్ లో 70 సంవత్సరాలనుండి మనం అనుసరిస్తున్న విధానం సమ్మతమేనా? కానప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి? అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ లైన్ దాటి వెళ్లటంలేదు అని తెలుస్తుంది.

ఆ తర్వాత POK గురించి ప్రస్తావించారు. సమస్యల్లా ఇక్కడే ఉంది . మోడీ గారు POK కూడా మనదే అంటారేమో అన్నారు. మొన్న ఆర్టికల్ 370 గురించి పార్లమెంటులో చర్చించి నప్పుడు, TMC MP కుడా ఇదే చెప్పారు. కాశ్మీర్ సమస్య పాకిస్తాన్ తో చర్చించ కుండా ఎలా నిర్ణయం తీసుకుంటాం అని. నాకు అర్ధమవుతున్నది, అరుణ్ కుమార్ గారు ఇంకా మిగతా కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో కాశ్మీర్ పాకిస్తానుకు చెందినది , మనం దానిని అక్రమంగా ఆక్రమించుకున్నాం అని. అరుణ్ కుమార్ గారికి ఒక సవాల్. మీరు కాశ్మీర్ విషయంలో మీ అభిప్రాయాన్ని స్పష్టం గా తెలుగు ప్రజలకు చెప్పాలి. డిబేట్ చేయటానికి మాకేం అభ్యంతరం లేదు. కాశ్మీర్ (POK తో కలుపుకొని) మనది కాదా? అన్ని సంస్థానాలులాగా కాకుండా దీనిని మనం ఆక్రమించుకున్నామా? POK లో కొంత భాగాన్ని చైనాకు ఇవ్వటానికి పాకిస్తానుకు అధికారం ఉందా? కొన్ని దశాబ్దాల క్రితమే POK లో పాకిస్తాన్ షియా తెగను అంతంచేసి వాళ్లస్థానంలో సున్నీలను తీసుకురావటం వాళ్ళ అంతర్గత సమస్యా? ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి మీరు స్పందిస్తానంటే.

సిపిఐ ఇంత పచ్చి అవకాశవాద పార్టీయా ?

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో రాజకీయాలు రంజుగా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజక వర్గం కావటంతో దానిపై అందరికీ ఆసక్తి పెరిగింది. కాంగ్రెస్ తో పాటుగా తెరాస , బీజేపీ కూడా ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అర్ధమవుతుంది. సిపిఎం పోటీకి దిగినా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. పోటీలోవున్నా అది పెద్దగా ప్రభావం చూపించి ఉండేది కాదు. ఇక సిపిఐ పోటీ చేయకపోయినా ఎవరికి మద్దత్తు ఇస్తుందనే విషయంలో ఆసక్తి ఏర్పడింది. చివరకు తెరాస కు మద్దత్తు ఇస్తున్నట్లు ఇప్పుడే వార్తలు వచ్చాయి. తేజస కాంగ్రెస్ కి మద్దత్తు ప్రకటించే అవకాశాలు వున్నాయి.

బీజేపీ ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ బలహీనపడే అవకాశాలు ఎక్కువ. దానికి కారణం ఇంతకుముందు ఈ నియోజక వర్గం బీజేపీ కి బలమైనది కాకపోవటం. రెండోది కాంగ్రెస్ స్వతహాగా బలంగా ఉండటం తెరాస అన్ని వనరులు వుపయోగించి సర్వశక్తులు ఒడ్డటం వలన పోటీ ఈ రెండిటి మధ్య సమీకరించబడటం. అయినా బీజేపీ ఇటీవల బలపడిన రీత్యా తన బలాన్ని ఇక్కడ కూడా ప్రదర్శించాలని అనుకుంటుంది. అందుకే అభ్యర్థి ని సెలెక్ట్ చేయటంలో కొంత చాకచక్యాన్ని ప్రదర్శించి బీసీ అభ్యర్థిని నిలబెట్టింది. కాంగ్రెస్, తెరాస అభ్యర్థులిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం వలన తన అభ్యర్థి బలమైన అభ్యర్థిగా బరిలో ఉంటాడని భావిస్తుంది. కానీ రెండు శక్తులు బలంగా వున్నప్పుడు కొత్తగా మూడో శక్తి ఎదగటం చాలా కష్టం. అదే సాధారణఎన్నికలయితే పరిస్థితులు వేరుగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్త ప్రభావం అన్ని ఎన్నికలపై ఉంటుంది. కాబట్టి ఈ ఉప ఎన్నికలో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే వుండే అవకాశాలు మెండుగా వున్నాయి.

ఇకపోతే సిపిఐ తెరాస కు మద్దత్తు ఇవ్వటం ఆశ్చర్యమూ, అవకాశవాదం కూడా. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత గట్టింది. ఇంతలోనే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెరాస కు అనుకూలంగా పరిస్థితుల్లో ఏమి మార్పు వచ్చిందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతయినా వుంది. పోయిన ఎన్నికల్లో సిపిఎం కూటమిలో చేరకుండా కాంగ్రెస్ కి మద్దత్తు ఇవ్వటానికి చెప్పిన కారణం ఒక్కటే. తెరాస ని ఓడించాల్సిన అవసరం వుంది కాబట్టి తెరాస వ్యతిరేక ఓట్లలో చీలిక రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దత్తు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు తెరాసకు మద్దత్తు ఇవ్వటానికి కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లలో చీలిక రాకూడదనే వాదన తీసుకొస్తుందా ? మరి దేశవ్యాప్తంగా సిపిఐ కాంగ్రెస్ తో కలిసి బీజేపీ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మరి తెలంగాణకమ్మూనిస్టు పార్టీది ప్రత్యేక వైఖరా? సిపిఐ ది పచ్చి అవకాశవాదం. ఒక కమ్మూనిస్టు పార్టీ ఇంత అవకాశవాద రాజకీయాలు చేయటం ఎక్కడా చూడలేదు. ఎన్నికల్లో ప్రతిపార్టీ వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలతో వైఖరులు ప్రదర్శిస్తూవుంటాయి. కానీ ఇంత పచ్చి అవకాశవాద వైఖరి ఒక కమ్మూనిస్టుపార్టీ తీసుకోవటం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఇందుకు తెరాస సిపిఐ నాయకులను కొన్నదని ప్రజల్లో వచ్చిన రూమర్లను పూర్తిగా కొట్టి పారేయలేము. మొత్తం హుజూర్ నగర్ ఎన్నికల్లో ఏ పార్టీ ఇంత అప్రతిష్ట పాలు కాలేదు. చివరగా ఒక్కమాట సిపిఐ అవకాశవాద వైఖరిని విమర్శించటంవరకే ఈ వ్యాఖ్యానాన్ని చూడాల్సివుంది. ఇది తెరాసకు వ్యతిరేకమనో , కాంగ్రెస్ కి అనుకూలమనో భావన తీసుకోవద్దు. ఎవరికి వోటువేయాలో ప్రజలకి వదిలేద్దాం.

భూముల అమ్మకం: జగన్ నిర్ణయం తప్పు

ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలకు మించి ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి వేస్ట్ గా పడి ఉన్న భూమిని అమ్మి సంక్షేమ పథకాలకు ఉపయోగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే ప్రభుత్వానికి తగినంత ఆదాయం కూడా లేదనేది సర్కార్ వాదన. కాబట్టి వేస్ట్ గా పడి ఉన్న భూమిని ఎవరు ఆక్రమించుకోకుండా ఉండాలన్నా.. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా.. ప్రభుత్వ భూమిని అమ్మక తప్పదు అని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నది. అయితే ఈ వాదనల పై నిజ నిజాలను ఇప్పుడు చూద్దాం..

అమ్మకం పై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరియైనది కాదనేది అనేకమంది విశ్లేషకుల అభిప్రాయం. 5 సంవత్సరాలు అధికారంలో ఉండే ముఖ్యమంత్రి అసలు ప్రభుత్వ భూమిని అమ్మే హక్కు లేదు. ఒక ఇంటి యజమాని ఇల్లు అమ్ముకొని దాన ధర్మాలు చేస్తే… ప్రస్తుతం బాగుంటుంది కానీ తర్వాత వచ్చే తరాలు ఎలా బ్రతుకుతాయి..? అని కూడా ఆలోచించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వరంగ స్కూల్స్, కాలేజీలకు, ఆసుపత్రులకు, బస్సు డిపోలకు, అంగన్ వాడీలకు, కార్యాలయాలకు ఉన్న స్థలం, 30, 40 లేదా 50 సంవత్సరాల తర్వాత కూడా సరిపోతుందా… ? కచ్చితంగా సరిపోదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు అమ్ముకోవడం ఎందుకు?. ఇప్పుడు స్థలాలు అమ్ముకొని అప్పుడు కొనుకోవచ్చు అన్నట్లయితే.. ఇప్పుడున్న స్థలాల రేట్ల అప్పటికి పెరిగిపోతే కొనడం కష్టమౌతుంది కదా..! తెలుగు లో ఒక సామెత ఉంది.. “అమ్మబోతే అడవి-కొనబోతే కొరివి” అని అలానే ఉంటది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ భూములు అమ్మడం అనేది మంచిది కాదు.

అలాగే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురౌతుంది కాబట్టి అమ్ముతాము అంటున్నారు. భూములనే కాపాడటం చేతకాకపోతే ఇక రాష్ట్రాన్ని ఏమి కాపాడతారు? రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడతారు? అయినా ఉన్న స్థలం నుండి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలి గాని అమ్మడం అనేది సరైన నిర్ణయం కాదు.

రివర్స్ టెండరింగ్ సక్సెస్ తో చంద్రబాబుకి కష్టాలు

రివర్స్ టెండరింగ్ తో చంద్రబాబు నాయుడు కి కష్టాలు మొదలయ్యాయా? అవుననే అనిపిస్తుంది. ఇప్పటికి జరిగిన రెండు రివర్స్ టెండర్లలో మొత్తం 841 కోట్లు ప్రభుత్వ ఖజానా కు లాభమొచ్చింది. అంటే ఈ డబ్బు అనవసరంగా ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుండేదే కదా. ఇది చంద్రబాబు నాయుడు కి చెంపపెట్టే. నిన్నటిదాకా దీనివలన ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తం అయ్యిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా ఈ చర్యతో మూగపోయింది. దీన్ని ఎలా ట్విస్ట్ చేయాలో తెలియక సతమతమవుతున్నారు.

అసలు ఈ రివర్స్ టెండరింగ్ కొత్తేమీకాదనీ , దీనివలన క్వాలిటీ దెబ్బతింటుందని తెగ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు జరిగిన రెండు టెండర్ల ప్రక్రియలో నాసిరకం కాంట్రాక్టర్లని చెప్పే అవకాశమే లేదు. మొదటిదాంట్లో తక్కువకి టెండరు వేసింది అంతకుముందు టెండరు దక్కించుకున్న కంపెనీయే కాబట్టి ఆ మాట అనలేరు. ఇప్పుడు రెండో టెండరు దక్కింది ప్రఖ్యాత మేఘ ఇంజనీరింగ్ సంస్థకి. ఇది నాసిరకమని చెప్పలేరు. అందుకే గొంతులు మూగపోయినాయి. దీన్ని అవినీతికాక మరేమనాలి? ఇప్పటిదాకా అభ్యంతరాలు తెలిపిన కేంద్ర జలవనరుల శాఖకూడా అభినందనలు తెలిపే అవకాశముంది. అప్పుడు చంద్రబాబు నాయుడు , ఆయన మిత్ర బృందం ఏమంటారో చూడాలి.

ఏమైనా చంద్రబాబు నాయుడు కి ముందు ముందు కష్టాలే అని అనిపిస్తుంది. అసలే జగన్ కి తనన్ని జైలుకి పంపించాడని లోలోపల ఉడికి పోతుంది. చంద్రబాబు నాయుడు ఏమైనా మోడీ లాగా నికార్సయిన మనిషా ? తనకన్నీ మచ్చలే అయినప్పుడు తనేదో నీతిమంతుడులాగా మాట్లాడటం ప్రజలకి వెగటు పుట్టిస్తుంది. దీన్నే జగన్ తనకనుకూలంగా మలుచుకున్నాడు. మోడీ అవినీతికి వ్యతిరేకంగా చిదంబరాన్ని జైలుకి పంపిస్తే ప్రజలు హర్షించారు. ఎందుకంటే పంపించిన వ్యక్తి నిజాయితీ పై ఎవరికీ అనుమానం లేదు. మీడియా కక్షసాధింపు చర్యని గొంతుచించుకున్నా ప్రజలు పట్టించుకోలేదు. కారణం మోడీ మీదున్న నమ్మకం. అదే చంద్రబాబు నాయుడు పై ఆ నమ్మకం ప్రజలకు లేదు. అదీ ప్రత్యక్షంగా ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత. అప్పుడు కక్షసాధింపు చంద్రబాబు నాయుడు వంతయితే ఇప్పుడు జగన్ కి అవకాశం వచ్చింది.

జరగబోయే పరిణామం తెలుసుకాబట్టే ఎందుకైనా మంచిదని తన నమ్మకస్తుల్ని బీజేపీ లోకి చేర్పించాడు. అయినా మోడీ వదిలిపెడతాడని జనం అనుకోవటం లేదు. త్వరలో రాబర్ట్ వాద్రా కి చిదంబరం గతే పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండో విడతలో చంద్రబాబు నాయుడు ఉండొచ్చని అనుకుంటున్నారు. ఆ విషయమూ చంద్రబాబు నాయుడు అంచనాకి వచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే సాక్ష్యాలు బయటపడటానికి ఇంకా సమయముంది. ఈ లోపల మోడీకి ఇంకొంచెం దగ్గర కావాలని ప్రయత్నం చేయొచ్చు. అది దింపుడు కళ్లెం ఆశ లాగే కనబడుతుంది. చిదంబరం, రాబర్ట్ వాద్రా తో పోలిస్తే చంద్రబాబుని లోపలికి పంపించటం మోడీకి పెద్ద పనికాక పోవచ్చు. అదే చంద్రబాబు భయమంతా. చివరకు చంద్రబాబు ఆశ అంతా న్యాయస్థానాల మీదే. అక్కడ తనకు అనుకూల వ్యక్తులు వున్నారని ఎలాగైనా తనను కాపాడతారని ఆశతో ఉన్నట్లు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

ఏమి సారూ…! బీడీలు , సిగరెట్లు లాగా హాని చేయవా?

హరీష్ రావు ఇటీవల గోవా లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన సందర్భంలో ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ని ప్రత్యేకంగా కలిసి బీడీ కట్టలపై పన్ను ఎత్తేయమని కోరాడు. దీనిపై ఆధారపడి కొన్ని లక్షలమంది జీవిస్తున్నారని, వాళ్ళు పేదోళ్ళని అందుకే పన్ను ఎత్తేయాలని కోరాడు. ఇంతకుముందు కూడా తెలంగాణ లో బీడీ కట్టలపై వున్న పుర్రె గుర్తును తొలగించాలని పెద్ద ఆందోళన చేశారు. ఈ డిమాండ్లలో సహేతుకత, హేతుబద్దత ఎంతవుంది. రాజకీయనాయకులు చెబుతున్నట్లు బీడీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వాలా ?

ప్రభుత్వం సిగరెట్లపై అధికపన్నులు వేస్తుంది. అదేమంటే దాని వినిమయాన్ని తగ్గించటానికాని చెబుతుంది. ఓకే , ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై అంత ప్రేమ ఉండటం అభినందించదగ్గదే. అలాగే ఇటీవల ఇ సిగరెట్లను నిషేదించింది. నాకు ఇప్పటికీ అర్ధంకాని విషయమేమంటే పొగాకుతో పోల్చుకుంటే అంత హానికాని ఇ సిగరెట్టు నిషేదించినప్పుడు పొగాకు ఉత్పత్తులు ఎందుకు నిషేదించకూడదు. పొగాకు పంటను నిషేధిస్తే సరిపోతుందికదా. అది చేయకపోగా పొగాకుపంట వేసిన రైతుకి అందరితోపాటు ఎరువుల సబ్సిడీ, నగదు సబ్సిడీ ( కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్, తెలంగాణా రైతు బంధు, ఆంధ్ర రైతు భరోసా ) ఇస్తూ పొగాకు పండించే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. కానీ అది సిగరెట్టుగా మారిన తర్వాత వినిమయాన్ని తగ్గించటానికి అధిక పన్నులేస్తున్నామని చెబుతున్నారు. ఈ లాజిక్ ఏంటో ఇప్పటికీ అర్ధం కాదు.

ఇక బీడీల విషయాన్ని కొస్తే ఇంకొంచెం ముందుకెళ్ళి అధిక కాదుకదా అసలు పన్నే ఎత్తేయమని అడుగుతున్నారు. వాస్తవానికి బీడీల్లో సిగరెట్టుకన్నా ఎక్కువ నికోటిన్ ఉంటుంది. ఇవ్వాళ దేశంలో పొగ తాగే వాళ్లలో 80 శాతం మంది బీడీలు కాల్చేవాళ్లే. మరి లక్షలమంది బీడీకార్మికుల జీవితాలకు అదే లక్షలమంది జీవితాలు బలైనా ఫర్వాలేదా? బీడీ కార్మికులు ఓ క్రమపద్ధతిలో గుర్తించబడతారు. అదే బీడీ కాల్చి చనిపోయే వాళ్ళు ఒక్కచోట, ఒక టైం లో గుర్తించబడరు కదా. పొగాకు పీల్చటం, తినటం మహమ్మారి అయినప్పుడు బీడీ తాగటం మహమ్మారి కాదా? ఈ తర్కం ఎక్కడికి దారి తీస్తుంది? ఎన్ని లక్షలమంది పేద వాళ్ళ ప్రాణాలు ( ఎందుకంటే బీడీ తాగేవాళ్ళు పేదవాళ్ళే కాబట్టి) బలి తీసుకుంటుంది. ఇది రాజకీయనాయకులకు పట్టదా? కాబట్టి హరీష్ రావు గారూ, దయచేసి బీడీలపై పన్ను తీసేసి లక్షల మంది పేదవాళ్ల ప్రాణాలు బలి తీయకండి. చేతనయితే బీడీ ఆకు సేకరణను నిషేదించమని అడగండి. మీ రాష్టం వరకు ఆ పని మీరే చేయొచ్చు. బీడీల కొక నీతి, సిగరెట్ల కొక నీతినా ? ఇటువంటి జనాకర్షణ చర్యలతో పేదవాళ్ల బతుకులతో ఆడుకోకండి. ఇంకా చేతనయితే బీడీల పరిశ్రమపై ఆధారపడిన వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే పథకాలకు రూపకల్పన చేయండి. ప్రజలు, బీడీ కార్మికులు హర్షిస్తారు. అప్పటివరకు పన్ను ని ఉండనీయండి. ఎటువంటి పరిస్థితుల్లో పన్ను తీసివేయొద్దు. దీనిపై ప్రజా ఉద్యమం రావాలి. అన్ని రాజకీయపార్టీలు ఇందుకు వ్యతిరేకమని తెలుసు. సంఘ సేవకులు, యెన్ జి ఓలు కదలాల్సిన అవసరం ఎంతయినా వుంది.

రేవంతరెడ్డి ప్రాంతీయపార్టీ పెడతాడా?

రేవంత్ రెడ్డి ప్రవర్తన మారదా ? ఇది ప్రజల మనస్సులో తొలుస్తున్న ప్రశ్న. తనకి రాష్ట్రంలో అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండొచ్చు. కానీ తను ఓ మోనార్క్ లాగా ప్రవర్తించటం ప్రజలకు, ముఖ్యంగా పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న నాయకులకు నచ్చటం లేదు. తాను చెప్పిందే జరగాలని కోరుకోవటం, లేకపోతే మీడియా కి ఎక్కటం ఏ విధంగా చూసినా సమర్ధనీయం కాదు. పార్టీ లో తనో పెద్ద నాయకుడినని తనకు తాను ఊహించుకోవటం వలనే ఇదంతా జరుగుతుంది. అందువల్ల తను ఎక్కువమంది శత్రువులను కొని తెచ్చుకుంటున్నాడని గ్రహించలేకపోతే తన గొయ్యి తానే తవ్వుకున్నట్లవుతుంది.

రేవంతరెడ్డి తో సమస్యల్లా ఒక్కసారి పెద్ద నాయకుడు కావాలని అనుకోవటం. తన మాటే చెల్లుబాటు కావాలని కోరుకోవటం. లేకపోతే తిరుగుబాటు చేయటం. రేవంత రెడ్డి రాజకీయ ప్రస్థానం తెరాస తో మొదలయ్యింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నాడు. ఇక్కడా ఎన్నిరోజులు ఉంటాడో తెలియదు. ఎందుకంటే ఈ ధోరణితో ఉంటే కాంగ్రెస్ నాయకులు తనని బయటకు పంపించమని అధిష్టానం పై ఒత్తిడి తేవటం ఖాయం. అసలు సమస్యల్లా తను ఎక్కడున్నా అందరూ తన నాయకత్వాన్ని ఆమోదించాలని భావించటం. ఇటీవలే సోనియా గాంధీ ని కుటుంబ సభ్యులందరితో కలిసాడు. తనను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయమని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. అసలు కాంగ్రెస్ లో ప్రతి వాడూ నాయకుడే. కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి కింద పనిచేయటానికి ఏ సీనియర్ నాయకుడూ ఒప్పుకోడు. అటువంటప్పుడు రేవంతరెడ్డి కోరిక ఎలా తీరుతుంది. తన స్వంత జిల్లా మహబూబ్ నగర్ లోనే ఎవ్వరూ రేవంతరెడ్డిని ఒప్పుకోలేదు. రేవంతరెడ్డి ముందు ముందు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యే అవకాశముంది. నల్గొండ జిల్లాలో వున్నంతమంది నాయకులు కాంగ్రెస్ లో ఏ జిల్లా లో లేరు. అటువంటిచోట రేవంత్ రెడ్డి వేలుపెడితే ఎవరు ఒప్పుకుంటారు. అందుకే ఉత్తమ్ రెడ్డి కన్నా ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రియాక్ట్ అయ్యాడు.

ఇది చదవండి: ‘హౌడీ మోడీ’ పై పాకిస్తాన్ కుట్ర!

రేవంతరెడ్డి ముందుగా బీజేపీ లో చేరటానికి సంసిద్దమయ్యాడని, అయితే తనని అధ్యక్షుడిని చేయమని షరతు పెట్టాడని , అందుకు బీజేపీ సిద్ధంగా లేకపోవటం తో కాంగ్రెస్ లో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడని అందరూ అనుకుంటున్నారు. రేవంత రెడ్డి కి పార్టీ కన్నా తన పదవే ముఖ్యమని ఇప్పటికే ప్రజలకు అర్ధమయింది. దానితోపాటు బహిరంగంగా కులరాజకీయాలు చేయటం కూడా నెగటివ్ పాయింట్ అయ్యిందని అనుకుంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే రేవంత రెడ్డి ఎక్కడా ఇమిడే అవకాశాలు లేవు. తనకి ఒక్కటే ప్రత్యామ్నాయం కనబడుతుంది. తానే ఒక ప్రాంతీయపార్టీ పెట్టుకొని దానికి జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం. చివరకు అదే జరిగే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనబడుతున్నాయి అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

చిరంజీవి-పవన్ కళ్యాణ్ జంటగా వచ్చే ఎన్నికల్లో?

రాజకీయవర్గాల్లో చిరంజీవి బీజేపీ లో చేరతాడనే ప్రచారం బలంగా జరుగుతుంది. ఇందులో నిజమెంతో తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు ఓపికపట్టాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి సైరా రిలీజ్ లో బిజీగా వున్నాడు. అయితే ఇన్నిసార్లు సాంఘిక మాధ్యమాల్లో, వార్తల్లో బయటకు వచ్చినా ఒక్కసారి కూడా ఈ వార్తలను ఖండిస్తూ ప్రకటన రాలేదు. అందువలన ఈ వార్త నిత్య నూతనంగా వెలువడుతూనే వుంటుంది.

వస్తున్న వార్తల ప్రకారం బీజేపీ ఆంధ్ర రాష్ట్ర శాఖ చిరంజీవిపై తీవ్ర ఒత్తిడి తెస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇందులో కొంత రాష్ట్ర బీజేపీ రాజకీయాలు కూడా ఇమిడివున్నాయి. ఆంధ్ర రాష్ట్ర బీజేపీ కి కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వం వహిస్తున్నాడు. కాకపొతే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఈ వర్గానికి ఆందోళన కలిగిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కి అత్యంత సన్నిహితులైన కమ్మ సామాజిక వర్గ నాయకులు టీడీపీ నుంచి బీజేపీ లోకి జంప్ అయ్యారు. టీడీపీ ద్వారా జగన్ ని ఎదుర్కోలేమని బీజేపీ లో చేరటం బీజేపీ లో కొంత మధనం జరుగుతుంది. ఇంతవరకు టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి, వైస్సార్సీపీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయనేది జగమెరిగిన సత్యం. అందుకే కన్నా లక్ష్మీనారాయణ ద్వారా సంఖ్యా పరంగా అతిపెద్దదైన కాపు సామాజికవర్గాన్ని దగ్గరకు తీసి లబ్దిపొందాలని బీజేపీ భావించింది. ఇంతలో బాగా డబ్బులున్న వ్యక్తులు, సామాజిక గణం బీజేపీ లో చేరటంతో వాళ్ళను తట్టుకోవటం కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్లకు సరితూగదని భావిస్తున్నారు. అందుకే ఈ సామాజిక వర్గనాయకులు చిరంజీవి లాంటి పాపులర్ పర్సనాలిటీ ని రంగం లోకి దించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నికలకి ఇంకా చాలా టైము ఉండటంతో చిరంజీవి ఇప్పట్లో నిర్ణయం ప్రకటించక పోవచ్చు.

ఈ సమీకరణాల్లో ఇంకో ఆసక్తికరమైన విషయం పవన్ కళ్యాణ్ ని గురించి. ఒకవేళ చిరంజీవి బీజేపీ లోకి రావటానికి ఒప్పుకునేటట్లయితే పవన్ కళ్యాణ్ జనసేన ని కొనసాగిస్తాడా? ఇదే అందరిలో తొలుస్తున్న పెద్ద ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఇటీవల ఎక్కడా కమ్యూనిస్టుల తో ప్రయాణం చేయటం లేదు. ఎన్నికలైనదగ్గర్నుంచి ఒక్కడిగానే మూవ్ అవుతున్నాడుగానీ పాత ధోరణి లో కమ్యూనిస్టుల ప్రస్తావన తేవటంలేదు. అదేసమయం లో కాశ్మీర్ విషయం లో మోడీ ని పొగిడాడు. ఇవన్నీ భవిష్యత్తుకి సంకేతాలా అనేది విశ్లేషకులు అనుకుంటున్నారు. అందరూ అనుకోవటం నిజంగా చిరంజీవి బీజేపీ లోకి వస్తే పవన్ కళ్యాణ్ జనసేన ని రద్దుచేయకపోయినా బీజేపీ తోటి పొత్తుపెట్టుకొని ఇద్దరూకలిసి జాయింటుగా ప్రచారం చేస్తారని అనుకుంటున్నారు. అదేజరిగితే రాష్ట్ర రాజకీయాల్లో జగన్ కి ధీటుగా బీజేపీ-జనసేన ఎదిగే అవకాశం మెండుగా వుంది. చిరంజీవి-పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పద్దతికి పూర్తిగా మద్దత్తు తెలుపుతారనే దాంట్లో సందేహంలేదు. ఒకటిమాత్రం ఖాయంగా కనిపిస్తుంది. టీడీపీ వచ్చే ఎన్నికల్లో నామమాత్రం అయ్యేఅవకాశాలు ఎక్కువగా వున్నాయి. మొత్తం మీద ఆంధ్ర రాజకీయాలు రంజుగానే వుంటాయి

పెరుగుట విరుగుట కొరకే

రాజకీయపార్టీల విన్యాసాలు ఒక్కోసారి వాళ్ళకే ఎదురుదెబ్బ తీస్తుంటాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 20 మందికి పైగా వైస్సార్సీపీ ఎమ్యెల్యే లను తెలుగుదేశంలోకి చేర్చుకున్నాడు. అది చివరకి తనకే బెడిసికొట్టింది. అలాగే కెసిఆర్ గత ప్రభుత్వం లో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యే లను తెరాస లో చేర్చుకున్నాడు. అయితే ఎన్నికల్లో దాని ప్రభావం పడకుండా తెలంగాణ సెంటిమెంట్ రగిలించి తిరిగి అధికారం లోకి రాగలిగాడు. కానీ వచ్చినతర్వాత కష్టాలు మొదలయ్యాయి. ఉద్యమకాలం నుంచీ ఉన్నవాళ్లకు, కొత్తగా చేరిన వాళ్లకు వాళ్ళ నియోజకవర్గాల్లో పడటం లేదు. ఇంతమంది కోరికలు తీర్చటం అంత తేలికైన పనికాదు.

ఇటీవలే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మేము పార్టీకి అసలైన ఓనర్లమని చెప్పాడు. అది పెద్ద సంచలనమయ్యింది. అలాగే కొత్త మంత్రుల చేరిక తర్వాత అసంతృప్తి స్వరం పెరిగింది. ఎలా సంతృప్తి పరచాలో అర్ధంకావటంలేదు. సందట్లో సడేమియా అన్నట్లు ఈ అవకాశాన్ని బీజేపీ కలిసివచ్చిన అదృష్టంగా అనుకుంటుంది. అసంతృప్తి గణమంతా ఒక్కొక్కరుగా బీజేపీ గొడుగు కిందకు చేరుతున్నారు. ఇది కెసిఆర్ కి ఆందోళన కలిగిస్తుంది. బీజేపీ యంత్రాంగాన్ని తేలికగా తీసిపారేయలేమని లోలోపల ఆందోళన చెందుతున్నాడు. అందుకే హరీష్ రావు విషయం లో తిరిగి రాజీ ధోరణి అవలంబించాడని అందరూ అనుకుంటున్నారు.

ఇది బీజేపీ కి కూడా వర్తిస్తుంది. వచ్చే వాళ్ళు ఎటువంటివాళ్ళు, వాళ్ళమీద ప్రజలకున్న అభిప్రాయాలేంటి అనే ఆలోచనకూడా లేకుండా గేట్లు బారా తెరిచారు. ఇది చివరకు తెరాస పరిస్థితే ఎదురవుతుంది. తీసుకునే వాళ్ళ చరిత్ర తో పనిలేదనుకుంటే ప్రజల ను తక్కువగా అంచనా వేసినట్లే. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళను అమాయకులుగా అనుకొని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే తగిన బుద్ధిచెబుతారు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు పసుపుకుంకుమ పేరుతో చివరి క్షణంలో మహిళా ఖాతా ల్లో డబ్బులు జమ చేసినా వాళ్ళు చంద్రబాబు నాయుడు ని ఓడించారు. ఇప్పటికే సుజనా చౌదరి , సీఎం రమేష్ లాంటి వాళ్ళను చేర్చుకోవటంపై ప్రజల్లో అసంతృప్తి వుంది. తెలంగాణాలో ఇప్పటివరకూ అటువంటి అసంతృప్తి రాకపోయినా చేర్చుకునే వాళ్ళ విషయం లో ఆచి తూచి వ్యవహరించకపోతే ఇక్కడకూడా అటువంటి అసంతృప్తి వచ్చే అవకాశముంది. టీడీపీ అయినా , తెరాస అయినా , బీజేపీ అయినా ప్రజల్ని తక్కువగా అంచనావేస్తే మొదటికే మోసమొస్తుందని గ్రహిస్తే మంచిది.

సీఎం జగన్ బర్త్ డే ఫోటోలు

సీఎం జగన్ బర్త్ డే ఫోటోలు