
రాజకీయవర్గాల్లో చిరంజీవి బీజేపీ లో చేరతాడనే ప్రచారం బలంగా జరుగుతుంది. ఇందులో నిజమెంతో తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు ఓపికపట్టాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి సైరా రిలీజ్ లో బిజీగా వున్నాడు. అయితే ఇన్నిసార్లు సాంఘిక మాధ్యమాల్లో, వార్తల్లో బయటకు వచ్చినా ఒక్కసారి కూడా ఈ వార్తలను ఖండిస్తూ ప్రకటన రాలేదు. అందువలన ఈ వార్త నిత్య నూతనంగా వెలువడుతూనే వుంటుంది.
వస్తున్న వార్తల ప్రకారం బీజేపీ ఆంధ్ర రాష్ట్ర శాఖ చిరంజీవిపై తీవ్ర ఒత్తిడి తెస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇందులో కొంత రాష్ట్ర బీజేపీ రాజకీయాలు కూడా ఇమిడివున్నాయి. ఆంధ్ర రాష్ట్ర బీజేపీ కి కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వం వహిస్తున్నాడు. కాకపొతే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఈ వర్గానికి ఆందోళన కలిగిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కి అత్యంత సన్నిహితులైన కమ్మ సామాజిక వర్గ నాయకులు టీడీపీ నుంచి బీజేపీ లోకి జంప్ అయ్యారు. టీడీపీ ద్వారా జగన్ ని ఎదుర్కోలేమని బీజేపీ లో చేరటం బీజేపీ లో కొంత మధనం జరుగుతుంది. ఇంతవరకు టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి, వైస్సార్సీపీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయనేది జగమెరిగిన సత్యం. అందుకే కన్నా లక్ష్మీనారాయణ ద్వారా సంఖ్యా పరంగా అతిపెద్దదైన కాపు సామాజికవర్గాన్ని దగ్గరకు తీసి లబ్దిపొందాలని బీజేపీ భావించింది. ఇంతలో బాగా డబ్బులున్న వ్యక్తులు, సామాజిక గణం బీజేపీ లో చేరటంతో వాళ్ళను తట్టుకోవటం కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్లకు సరితూగదని భావిస్తున్నారు. అందుకే ఈ సామాజిక వర్గనాయకులు చిరంజీవి లాంటి పాపులర్ పర్సనాలిటీ ని రంగం లోకి దించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నికలకి ఇంకా చాలా టైము ఉండటంతో చిరంజీవి ఇప్పట్లో నిర్ణయం ప్రకటించక పోవచ్చు.
ఈ సమీకరణాల్లో ఇంకో ఆసక్తికరమైన విషయం పవన్ కళ్యాణ్ ని గురించి. ఒకవేళ చిరంజీవి బీజేపీ లోకి రావటానికి ఒప్పుకునేటట్లయితే పవన్ కళ్యాణ్ జనసేన ని కొనసాగిస్తాడా? ఇదే అందరిలో తొలుస్తున్న పెద్ద ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఇటీవల ఎక్కడా కమ్యూనిస్టుల తో ప్రయాణం చేయటం లేదు. ఎన్నికలైనదగ్గర్నుంచి ఒక్కడిగానే మూవ్ అవుతున్నాడుగానీ పాత ధోరణి లో కమ్యూనిస్టుల ప్రస్తావన తేవటంలేదు. అదేసమయం లో కాశ్మీర్ విషయం లో మోడీ ని పొగిడాడు. ఇవన్నీ భవిష్యత్తుకి సంకేతాలా అనేది విశ్లేషకులు అనుకుంటున్నారు. అందరూ అనుకోవటం నిజంగా చిరంజీవి బీజేపీ లోకి వస్తే పవన్ కళ్యాణ్ జనసేన ని రద్దుచేయకపోయినా బీజేపీ తోటి పొత్తుపెట్టుకొని ఇద్దరూకలిసి జాయింటుగా ప్రచారం చేస్తారని అనుకుంటున్నారు. అదేజరిగితే రాష్ట్ర రాజకీయాల్లో జగన్ కి ధీటుగా బీజేపీ-జనసేన ఎదిగే అవకాశం మెండుగా వుంది. చిరంజీవి-పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పద్దతికి పూర్తిగా మద్దత్తు తెలుపుతారనే దాంట్లో సందేహంలేదు. ఒకటిమాత్రం ఖాయంగా కనిపిస్తుంది. టీడీపీ వచ్చే ఎన్నికల్లో నామమాత్రం అయ్యేఅవకాశాలు ఎక్కువగా వున్నాయి. మొత్తం మీద ఆంధ్ర రాజకీయాలు రంజుగానే వుంటాయి