
కరోనాని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ వలస కార్ముకుల భాధలు వర్ణనాతీతం. రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజల పరిస్థితి బహు దయనీయం. వలస వెళ్లిన ప్రాంతంలో పని లేదు సొంతూరికి వెళ్ళాటంటే అధికారుల అడ్డంకులు అనేకం. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లయింది. వలస కూలీల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా అడ్డుకోవడం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులను మూసేయాలని కేంద్రం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అతిక్రమిస్తే.. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని స్పష్టం చేసింది. అయితే, కేంద్రం కఠినమైన ఆదేశాలను జారీ చేసినప్పటికీ.. ఉపాధి కరువైన వలస కూలీలు మూకుమ్మడిగా నగరాల నుంచి తమ స్వస్థలాలకు కాలినడక సహా తమకు వీలైన అన్ని మార్గాల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
చాలామంది కార్మికులు వారి పని ప్రదేశాల్లో చిక్కుకుపోయి ఆకలితో నకనకలాడుతున్నారు. ఎటువంటి రవాణా లేకపోవడంతో చాలామంది కార్మికులు కడుపు చేతబట్టుకుని వందలాది కిలోమీటర్లు నడిచే తమ స్వస్థలాలకు చేరుకోవడానికి బయలుదేరారు. కొన్ని చోట్ల నిస్సహాయ స్థితిలో కనిపించిన వాహనాల్లో ఎక్కుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తక్షణమే వాస్తవంగా నెలకొన్న స్థితిగతులపై ప్రభుత్వం దృష్టి సారించాలని మేథావులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంగన్‌వాడీలు, పంచాయతీ భవనాలు, ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కమ్యూనిటీ హాళ్ళు, జిల్లా కార్యాలయాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని వారు కోరారు. ఉచితంగా ఆహారం సరఫరా చేయడం, వైద్య సంరక్షణ అందచేయడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.