అందుకే వలస కూలీలకు తీవ్ర ఇబ్బందులు!

లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగింపు ప్ పై తప్పుడు ప్రచారాలను నమ్మి వలస కూలీలు వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని దీంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. లాక్ డౌన్ పై అపోహలు, అనుమానాలు పెంచుకోకుండా ఎక్కడివారక్కడే ఉండాలని స్పష్టం ఆయన చేశారు. ప్రజలకు,కూలీలకు, వలస కార్మికులకు రాష్ట్ర పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆహార, ఆరోగ్య సమస్యలుంటే ప్రభుత్వ యంత్రాంగం లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లాక్ డౌన్ సమయంలో ఆశ్రయం కోల్పోయిన వారి కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసిందని సజ్జనార్ గుర్తు చేశారు.
దేశమంతా లాక్ డౌన్ తో స్తంభించిన వేళ.. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లినా.. ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కార్మికుల బాగోగులు చూసుకోవాలని భవన నిర్మాణ సంస్థలు, పలు కంపెనీలకు ఆదేశాలు జారీ చేసాం. ప్రభుత్వ, పోలీస్ శాఖ ఆదేశాలను కార్మిక సంస్థలు, భవన నిర్మాణ సంస్థలు బేఖాతర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని కమిషనర్ పేర్కొన్నారు.
కాలినడకన సొంత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో చిన్న పిల్లలతో ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారని ఆయన తెలిపారు. జాతీయ రహదారులపై ఎక్కువ దూరం నడవడం వల్ల రోడ్డు ప్రమాదాలు.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కార్మికులకు, వలస కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని సజ్జనార్ అన్నారు.
కరోనా వేళ.. గాంధీ ఆసుప్రతిలో నర్సుల సమ్మె

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వం కరోనా కట్టడికి శాయశక్తుల కృషి చేస్తున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఈ తరుణంలో గాంధీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 200మంది నర్సులు బుధవారం విధులకు గైర్హాజరయ్యారు. దీంతో కరోనా వార్డుల్లో రోగులకు సేవలు అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే మంగళవారమే నర్సులు సమ్మెకు సంబంధించిన నోటీసు గాంధీ సూపరిండెండెంట్ శ్రావణ్ కుమార్ నోటీసు అందించినట్లు సమాచారం.
గాంధీలో 1050పడకలకు 350 మంది నర్సులు ఉండాల్సి ఉండగా 160మంది రెగ్యూలర్ నర్సులు మాత్రమే పని చేస్తున్నారు. 2008నుంచి కొత్తగా నర్సుల నియామకాలను ప్రభుత్వం చేపట్టలేదు. ఈ 200మంది నర్సులు జీజేఎస్ అనే ఏజెన్సీ కింద గడిచిన 13ఏళ్లుగా గాంధీలో సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో వీరి సేవలు కీలకంగా మారాయి. ఈ తరుణంలో తమ సేవలను గుర్తించి ప్రభుత్వం తమను రెగ్యూలర్ చేయాలని కోరుతూ వారంతా సామూహికంగా సమ్మెకు దిగారు.
గత కొంతకాలంగా తమను రెగ్యూలర్ చేయాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. గాంధీలో కరోనా రోగుల సంఖ్య పెరగడంతో వీరు తమ ఆందోళన తీవ్రతరం చేశారు. వీరి సమ్మెకు దిగడంతో కరోనా వార్డుల్లో సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఈమేరకు వైద్యాధికారులు అప్రమత్తమైన రెగ్యూలర్ సిబ్బందితో మూడు షిప్టుల్లో సేవలందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సేవలను గుర్తించి రెగ్యూలర్ చేస్తారని ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా నర్సుల సమ్మెపై ప్రభుత్వం సత్వరమే స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
పాతబస్తీలో వైరస్ వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో కరోనా వేగంగా విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. మూడు రోజులల్లో 50 కరోనా కేసులు నమోదయ్యాయి. పాతబస్తీలో మర్కజ్ లింకులు ఉండడంతో పరిస్థితి అదుపు తప్పుతుందా అనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
అలాగే ఆయా కుటుంబాల్లో ఎవరైనా వృద్ధులు చనిపోతే అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురు మాత్రమే అంత్యక్రియలకు హాజరవ్వవలసి ఉంది.
ఇటీవల జరిగిన రెండు సంఘటనల్లో అంత్యక్రియలకు వారి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మూడు రోజుల వ్యవధిలో 50కి పైగా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.
దీంతో పాతబస్తీలో మూడు ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. తలాబ్ కట్ట, రమ్నస్‌పురా, అలీబాగ్. కాగా ఇప్పటివరకు హైదరాబాద్‌లో 300 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
ప్పటికైనా పాతబస్తీలో యధేచ్ఛగా తిరుగుతున్నవారిపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తే గాని వైరస్‌ను కొంత నియంత్రించే అవకాశం ఉండకపోవచ్చని అధికారులలో ఆందోళన వ్యక్తం అవుతున్నది.
ఆందోళన చెందుతున్న చాలామంది స్థానికులు ఎక్కడికక్కడ వీధి చివరిలో బ్యారికేడ్ లను ఏర్పాటు చేసుకొని, రాకపోకలను నిషేధిస్తున్నారు. పాత బస్తీలోని కొత్త ప్రాంతాలతో పాటు అవతలి వైపుకు కూడా వైరస్ విస్తరిస్తూ ఉండడం వారిని కలవరానికి గురిచేస్తున్నది.
మరోవైపు పాతబస్తీలో వైద్యులు, ఆశావర్కర్లు ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేక పోతున్నది.
సంపదలో ముఖేష్ అంబానీని దాటేసిన మహిళ!

భారత కుబేరుడు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీని ఓ మహిళ వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముఖేష్ అంబానీ సంపద తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తర్వాత ఉన్న స్థానంలో ఉన్న మహిళ ఒక స్థానం ఎగబాగింది. దీంతో ఆయన ఒక స్థానం కోల్పోయి తాజాగా ప్రపంచ ధనవంతుల్లో 19వ స్థానంలో కొనసాగుతున్నారు.
ప్రపంచంలో ధనవంతుల్లో ఒకరికిగా కొనసాగుతున్న ముకేశ్ అంబానీని సంపదలో మెకంజీ బెజోస్ వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఆమె సంపదలో ముఖేష్ అంబానీని దాటేయడంతో మరోసారి మెకంజీ వార్తల్లో నిలిచారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన ఫౌండర్ జెఫ్ బెజోస్ మాజీ భార్యనే మెకంజీ బెజోస్. జెఫ్ నుంచి ఆమె విడాకుల తీసుకున్నందుకు భరణం కింద అమెజాన్లో 4శాతం వాటా దక్కింది. ప్రస్తుతం అమెజాన్ షేర్ ధర 5.3శాతం పెరిగింది. దీంతో ఆమె సంపద పెరిగడంతోపాటు ముఖేష్ అంబానీ సంపద తగ్గింది. దీంతో ఆమె ముఖేష్ అంబానీని సంపదలో వెనక్కి నెట్టారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం మెకంజీ బెజోస్ సంపద విలువ ఏప్రిల్ 15నాటికి 8.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ముకేశ్ అంబానీ సంపద విలువ మార్చి 19నాటికి 34.4 బిలియన్ డాలర్లు ఉండగా మెకంజీ సంపద విలువ 45.3బిలయన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఆమె ప్రపంచ మహిళా సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒక స్థానం ఎగబాకి 18వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు. ఈయన సంపద విలువ 138.5 బిలియన్ డాలర్లు. ఏప్రిల్ 15న ఈయన సంపద విలువ 24బిలియన్ డాలర్లకు పెరిగిందని బ్లూమ్ బర్గ్ ఇండెన్స్ ప్రకటించింది.
ఏప్రిల్ 20 తర్వాత ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపు!

దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఏప్రిల్ 20 తర్వాత హాట్ స్పాట్ కాని ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు మొదలవుతాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. భారత్ లో ఇప్పటివరకు 170 జిల్లాలను హాట్ స్పాట్ ప్రాంతాలుగా, 207 జిల్లాలను నాన్ హాట్ స్పాట్ జిల్లాలుగానూ, మిగిలినవి గ్రీన్ జోన్ ప్రాంతాలుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు సామూహిక సంక్రమణ వ్యాప్తి స్థాయికి కరోనా వైరస్ చేరలేదని, కొన్ని చోట్ల స్థానిక వ్యాప్తి మాత్రమే ఉందని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చి ఉంటుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రవేత్త గంగా ఖేడ్కర్ చెప్పారు. గబ్బిలాల నుంచి అలుగు (పంగోలియన్)కు వాటి నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించి ఉండొచ్చని చైనా పరిశోధనలు పేర్కొంటున్నాయని తెలిపారు. తాము నిర్వహించిన పరిశోధనలోనూ దేశంలో కూడా రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్ లక్షణాలు గుర్తించామని చెప్పారు. అయితే, వాటి ద్వారా మనుషులకు సోకే అవకాశం అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే, వెయ్యేళ్లకోసారి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉందని తెలిపారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1076 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, దీంతో దేశం మొత్తంమీద కేసుల సంఖ్య 11,439కి చేరిందని తెలిపారు. ఇప్పటి వరకు 377 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 హాట్ స్పాట్ కేంద్రాలు, నాన్ హాట్ స్పాట్ కేంద్రాలు, గ్రీన్ జోన్లను గుర్తించామని లవ్ అగర్వాల్ తెలిపారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రెడ్ జోన్లో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన

మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆకస్మికంగా పర్యటించారు. వేములవాడలోని కంటోన్మెంట్ ప్రాంతంతోపాటు ముస్తాబాద్ మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండలంలోని గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించి మాట్లాడారు.
వేములవాడలో 21ఏళ్ల యువకుడికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యువకుడితో సన్నహితంగా ఉన్న 21మందిని క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు. కరోనా కట్టడికి ఫార్మూలా ఏమిలేదని.. అది సోకకుండా చూసుకోవడమే మందు అని ఆయన సూచించారు. రాష్ట్రంలో కరోనా కోసం ఎనిమిది ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మర్కజ్ సంఘటన లేకపోయి ఉంటే జిల్లాల్లో ఒక్క కేసు కూడా ఉండేది కాదని ఆయన అన్నారు. వలస కార్మికుల కోసం హైదరాబాద్‌లో 55శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామాలు, పట్టణాల్లో ప్రతిఒక్కరి ఆరోగ్య వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
లాక్డౌన్ కారణంగా రైతులు అధైర్య పడొడ్డన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం సూచించిన విధంగానే రైతులు దిగుబడులను కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని సూచించారు. రైతులు సామాజిక దూరం పాటించాలని కోరారు. రైతులు డబ్బులను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు తెల్లరేషన్ కార్డు కలిగిన వారందరికీ రూ.1,500లను వారి జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
దర్శకుడిగా ఛాన్స్ వద్దంటున్న మేటి కమెడియన్

డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను అనేది ఒకనాటి మాట . ఇపుడు డైరెక్టర్ కావాలనుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనుకోకుండా హీరోలుగా మారిన వాళ్లు చాలామందే ఉన్నారు. నాని రవి తేజ, పవన్ కళ్యాణ్ ఇలా నటులైన వాళ్ళే . ,ఇలాంటి వాళ్లు నటులుగా ఎంత పేరు సంపాదించినప్పటికీ. ఏదో ఒక మూల దర్శకత్వం చేపట్టాలన్న ఆశ మాత్రం చావదు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ సినిమా అలా వచ్చిందే. ఇపుడు అదే కోవలో మరో నటుడు నాకు డైరెక్షన్ ఛాన్స్ వద్దు బాబో అంటున్నాడు ..
‘వెన్నెల’ సినిమాతో కమెడియన్ గా తెలుగు సినిమా ప్రపంచానికి పరిచయం అయిన కిషోర్ ఏకంగా తన పేరునే వెన్నెల కిషోర్ గా మార్చు కొన్నాడు. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించి.. చాలా ఎర్లీ గానే బిజీ కమెడియన్ అయి పోయాడు. కాగా వెన్నెల కిషోర్ కూడా డైరెక్షన్ ఆశతో వచ్చి నటుడు అయిన కోవకు చెందిన వాడే.. ఐతే అతను మిగతా వాళ్లలా దర్శకత్వం చేపట్టడానికి ఎక్కువ కాలం ఎదురు చూడలేదు.
తాను అరంగేట్రం చేసిన ‘వెన్నెల’ సినిమాకు కొనసాగింపుగా ‘వెన్నెల వన్ అండ్ హాఫ్’తో దర్శకుడిగా మారాడు. అయితే అది చేదు అనుభవాన్ని మిగల్చడంతో వెంటనే మరో ట్రయల్ వేసాడు. కామెడీ స్టార్ బ్రహ్మానందం హీరోగా ‘జఫ్ఫా’ అనే మరో సినిమా తీశాడు. అది కూడా బాల్చీ తన్నేసింది. దీంతో మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లలేదు కిషోర్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మళ్లీ దర్శకత్వం ఎప్పుడు చేస్తారు అని అడిగితే.. ‘‘నేను మళ్లీ దర్శకత్వం చేయకపోతేనే నాతో సహా అందరికీ మంచిది. ప్రస్తుతానికి నాకీ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. సమీప భవిష్యత్తులో అయితే నేను దర్శకత్వం చేసే అవకాశం లేదు’’ అని స్పష్టం చేశాడు.
నటుడిగా వెన్నెల కిషోర్ కెరీర్ ఇప్పుడు చాలా హ్యాపీ గా సాగి పోతోంది. అఖిల్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో పాటు, నితిన్ చిత్రం ‘రంగ్ దె’లో కూడా నటిస్తున్నాడు .. ఇంకా అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’లోనూ అవకాశం వచ్చిందతనికి . ఇక సంపత్ నంది దర్శకత్వంలో `సీటీ మార్ ‘ చిత్రంలోహీరో గోపీచంద్ తో పోటా పోటీగా ఉండే క్యారెక్టర్ చేస్తున్నాడు . ఇవన్నీ ఒకెత్తు అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో నటిస్తున్నాడు . ఈ చిత్రం తన కెరీర్లోనే అతి పెద్ద అవకాశాల్లో ఒకటని ,. చిరంజీవితో ఆల్రెడీ ఒక వారం పని చేశానని.. ఈ ఆచార్య సినిమా విషయంలో చాలా ఆతృతగా ఉన్నానని..చెప్పాడు. ఈ యు ఎస్ రిటర్న్అయిన కమెడియన్.
రక్తం దొరకక క్లిష్ఠ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు

మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదానం పిలుపు విని ఇన్నేళ్లుగా ఇంతమంది ముందుకొచ్చారంటే అన్నయ్య చలువే. గివ్ బ్లడ్ సేవ్ లైఫ్… నినాదంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిరంతరం సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులకు రక్త దాతల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తూ.. ఇదే విషయంపై చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు రక్త దాతల్ని అభ్యర్థించారు.
రమణం స్వామినాయుడు మాట్లాడుతూ-“ప్రభుత్వాల నిర్ణయంతో కరోనా లాక్ డౌన్ వల్ల బ్లడ్ బ్యాంకులు అన్నీ లాక్ అయిపోయాయి. రక్త దాతలు ఇంటికే పరిమితం అయిపోవడం వల్ల ఎక్కడా రక్తం దొరకడం లేదు. ముఖ్యంగా తలసిమియా వ్యాధిగ్రస్తులకు నిరంతరం బ్లడ్ అందాల్సి ఉండగా.. రక్తం దొరకక క్లిష్ఠ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ఎందరో ఆపరేషన్లు జరగక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అంపశయ్యపై ఉన్నారు. రక్తం లభ్యం కాక డాక్టర్లు ఆపరేషన్లు వాయిదా వేస్తున్నారు. అందుకే అందరూ ముందుకొచ్చి పోలీస్ వారి సహకారంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి విచ్చేసి రక్తదానం చేయండి. మీ సమీపంలోని ఏదైనా బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తదానం చేయండి“ అని అన్నారు.
ఆరోగ్యసేతు యాప్ కు రికార్డు స్థాయిలో స్పందన

కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. 13 రోజులలో 5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 2016లో పోక్‌మాన్ గో గేమింగ్ యాప్‌ను 19 రోజుల్లో 5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలో ఎక్కువ డౌన్‌లోడ్ అయిన యాప్‌గా ఆరోగ్య సేతు రికార్డు సృష్టించింది.
మోదీ పిలుపునిచ్చిన గంటల్లోనే కోటీ పది లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకా చేసుకుంటున్నారు. 13 రోజుల్లో ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి 5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం సంచలనంగా మారింది.
14వ తేదీ ఉదయం పది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత నిమిషానికి లక్షమంది చొప్పున నమోదు చేసుకున్నారని, సగటున నిమిషానికి 20 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని నీతి ఆయోగ్ బృందంలోని ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ప్రోగ్రామ్ డైరక్టర్ అర్నబ్ కుమార్ తెలిపారు. యాప్‌ను అభివృద్ధి చేసిన టీమ్‌లో అర్నబ్ కూడా ఒకరు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అభివృద్ధి చేసిన ఈ యాప్ ఇంగ్లీష్‌తో పాటు 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే.. మీ పరిసరాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తి కదలాడితే వెంటనే మీకు అలర్ట్ వస్తుంది. దీంతో మీరు అప్రమత్తమై ఇన్ఫెక్షన్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేందుకు బ్లూటూత్, లొకేషన్‌లను ఆన్ చేయాల్సి ఉంటుంది. ‘లొకేషన్ షేరింగ్’లో ‘ఆల్వేస్’ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. దీంతో యాప్ ఇన్‌స్టాలేషన్ పూర్తవుతుంది. ఇక లోపలికి ప్రవేశించగానే కరోనా లక్షణాలు మీకు ఉన్నాయా? లేదా? అనేది తేల్చే పలు ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. ఇందుకు 20 సెకన్లు కేటాయిస్తే చాలు.
కరోనా లక్షణాలు ఉన్నాయని తేలితే వెంటనే ప్రభుత్వ సర్వర్‌కు సమాచారం వెళ్లిపోతుంది. దీని ఆధారంగా అధికార యంత్రాంగం సదరు వ్యక్తి లొకేషన్‌ను గుర్తించి, అతడిని ఐసొలేషన్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి.
ఇలాంటి వారి సమాచారం యాప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. అటువంటి వాళ్లు వైద్య యంత్రాంగానికి చిక్కకుండా తిరుగుతూ.. మీ పరిసరాల్లోకి వస్తే బ్లూటూత్, అల్గారిథమ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ల ఆధారంగా గుర్తించి మీ మొబైల్‌లోని ‘ఆరోగ్యసేతు’ యాప్ అలర్ట్ టోన్‌ను వినిపిస్తుంది.
దేవాలయాల్లో e-పూజలు!

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలలో భాగంగా మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో దేవాలయాల్లోకి భక్తులకు అనుమతించడం లేదు. ఈ నేపధ్యంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోరిక మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ‘ఈ-పూజ’లను నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులకు ఆయా దేవస్థానాల్లో భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు ఇంటికే పంపుతారు. ఈ విధానంపై ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అమరావతిలోని సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. భక్తులు ఈ పూజలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆయా దేవాలయాల్లో నిత్యకైంకర్యాలు పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో కిచెన్ కెపాసిటీ మరియు ఆర్థిక వనరుల అనుమతి మేరకు నిరుపేదలకు అన్నప్రసాద పంపిణీపై ఆయా జిల్లా కలెక్టర్ తో చర్చించి, అవసరం మేరకు వారి ద్వారా అన్నప్రసాద పంపిణీ చేయాలని దేవదాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు.
అన్ని ప్రధాన దేవాలయాల్లో మరియు ఇతర చోట్ల సాంప్రదాయం ప్రకారం, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేపట్టవలసిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. మే నెల 3 తర్వాత అన్ని ప్రధాన దేవాలయాల ప్రవేశ ద్వారాల వద్ద డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ను మరియు థర్మల్ స్కాన్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కాన కాణిపాక దేవాలయం మరియు విజయవాడ దేవాలయాల అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం పై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
కలవరపెడుతున్న ఆ రెండు కరోనా కేసులు!

హైదరాబాద్ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గడచిన 24గంటల్లో నగరంలో కొత్తగా 40కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదిలాఉంటె మరోవైపు రెండు కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఆ రెండు కేసుల వల్ల వైద్యులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
హైదరాబాద్ గాంధీనగర్ కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. కాళ్లు చేతులు పనిచేయక ఇంటిలోనే ఉంటున్నాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. వీళ్లలో ఎవరికి బయట లింకులు లేవు. అయినా సరే పక్షవాతం సోకిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వైద్యులను షాక్ కు గురిచేసింది.
అలాగే మరో కేసులో….టౌలిచోకీకి చెందిన 8 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ చిన్నారి కుటుంబాలకు ఎవరితోనూ లింక్స్ లేవు. అయినా ఆమెకు కూడా కరోనా సోకింది.
ఈ రెండు కేసులకు మర్కజ్ తోకానీ.. విదేశీ ట్రావెల్ హిస్టరీ కానీ లేకపోవడం వైద్యవర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ కేసుల్లో ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ లేకున్నా కానీ కరోనా సోకడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉంటారోనన్న భయం నెలకొంది. కొంతమందిలో లక్షణాలు బయటపడడంలేదు.వారు బయట తిరుగుతూ అంటించేస్తున్నారు. ఇలా ఎవరి ద్వారా వ్యాపిస్తుందో తెలియని కేసులు సామూహిక దశ అని ఇది చాలా డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజురోజుకు సంఖ్య తగ్గకపోగా విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో అనూహ్యమైన కరోనా కేసులు వెలుగుచూస్తుండడం వైద్యవర్గాలను సైతం షాక్ కు గురిచేస్తోంది.
ఇంటికి వెళ్లే వారికి రూ. 2 వేలు సాయం!

క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ ప్రోటోకాల్ పూర్తిచేసుకుని బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్ళేటప్పుడు పేదలకు కనీసం రూ.2 వేలు ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాళ్లు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించమని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వారంటైన్ నుంచి ఇళ్లకు వెళ్లిన బాధితులకు ప్రతి వారం పరీక్షలు చేయించుకునేలా చూడాలనని కోరారు. క్వారంటైన్ సెంటర్లలో ఏమేమి ఉండాలన్నదానిపై ఎస్‌ఓపీని దిగువ అధికారులకు పంపించాలన్న సూచించారు.
రాష్ట్రంలో కోవిడ్‌విస్తరణ, పరీక్షలు, పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను సీఎంకు అందించిన అధికారులు. మరో నాలుగైదు రోజుల్లో కోవిడ్ –19 పరీక్షల రోజువారీ సామర్థ్యం 2వేల నుంచి 4వేలకు పెంచుతామన్న అధికారులు. ప్రస్తుతం రోజుకు 2100కుపైగా పరీక్షలు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ట్రూనాట్ పరికరాలను వినియోగించుకుని పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32వేల మందికి కూడా పరీక్షలు చేయాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. వీరికి పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి అయిన తర్వాత ర్యాండమ్‌గా పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు.
క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై సీఎం మరోసారి ఆరా తీశారు. ప్రతిరోజూ ప్రతి మనిషికి భోజనం, బెడ్‌కోసం, దుప్పటికోసం రూ. 500లు. ప్రతిరోజూ ప్రతిమనిషికి రూ. 50లు పారిశుద్ధ్యం కోసం,
ఇతరత్రా ఖర్చులకోసం రోజుకు రూ.50లు, ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్ సెంటర్‌కు రూ.300లు, తిరుగు ప్రయాణంకోసం కూడా మరో రూ.300లు ఖర్చు చేస్తున్నట్టుగా వెల్లడించిన అధికారులు సీఎంకు వివరించారు. డబుల్ రూం లేదా, సింగిల్‌రూం ఇస్తున్నామని చెప్పారు.
ఫ్రంట్ లైన్లో ఉన్నవారికి, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నవారి ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్త వహించాలన్న జగన్ సూచించారు. అరటి, పుచ్చ ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలన్నారు. రైతులను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. వంటనూనెల ధరలపై దృష్టి పెట్టాలన్నారు. ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌సహా అధికారులు హాజరయ్యారు.
షాకింగ్ న్యూస్.. భార్యను చంపిన కరోనా బాధితుడు

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనా మహ్మమరి దెబ్బకు మెజార్టీ దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ఎక్కువ రోజులకు ఇంటికే పరిమితమవడంతో ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఇది దంపతుల మధ్య చిచ్చుపెడుతుంది. కరోనా వైరస్ హత్యలకు, కుటుంబ కలహాలు దారితీస్తుండటం శోచనీయంగా మారింది. లండన్లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర లండన్‌లోని ఎడ్మాంటన్‌లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. హుస్సేయిన్ ఎగాల్(65), మార్యన్ (57) భార్యభర్తలు. సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో కరోనా వైరస్ చిచ్చు రేపింది. ఎగాల్ కు కరోనా లక్షణాలు ఉండటంతో అతని భార్య తనకు కూడా వైరస్ సోకుంతుందనే భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెప్పింది. దీంతో ఆవేశానికి గురైన ఎగాల్ తన భార్యను కొట్టి చంపాడు. ఎగాల్ పై అనుమానం వచ్చిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని విచారించగా తన భార్యను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు.
కరోనా వల్ల తన భార్య తనను ఇంటి నుంచి వెళ్లిపోమ్మని చెప్పినందుకే హత్య చేశానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. కాగా పోలీసులు అతడికి వైద్య పరీక్షలు చేయించగా అతడికి నిజంగా కరోనా పాజిటివ్ వచ్చింది. పోలీసులు అతడిని ఆన్ లైన్ వీడియో కాల్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపర్చగా కేసును జూన్ 14కు న్యాయమూర్తి వాయిదా వేశారు.
టిక్ టాక్ పోరికి వర్మ బంపర్ ఆఫర్

టిక్ టిక్ వీడియోలు చేసే ఓ యువతికి డైరెక్టర్ వర్మ బంపరాఫర్ ఇచ్చాడు. ఓ యువతి టిక్ టాక్ వర్మ డైలాగ్స్ తో టిక్ టిక్ చేసి పోస్టు చేసింది. ఇది చూసిన వర్మ ఆ యువతికి ఫిదా అయ్యాడు. సినిమాల్లో నటించాలనుకుంటే ఛాన్స్ ఇస్తానంటూ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఆ యువతి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరీ..
డైరెక్టర్ వర్మ రూటే సపరేట్ గా ఉంటుంది. సమాజంలో ఉండే వివాదాలనే వర్మ తన పబ్లిసిటీకి వాడుకుంటుంటాడు. తన సినిమాలను ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడం వర్మ స్టైలే వేరు. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివాదాస్పద వ్యాఖలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంటాడు. వర్శకు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో.. అలాగే అతడిని వ్యతిరేకించే వర్గం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. తాజాగా వర్శ డైలాగ్ లతో ఓ అందమైన యువతి చేసిన వీడియోను తన ట్వీటర్లో పోస్టు చేశాడు. ‘నీకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంటే.. వెంటనే మీ డిటైల్స్ పంపించండి’ అంటూ ఓ మెయిల్ ఐడీ అడ్రస్ ఇచ్చాడు. ఈ అమ్మాయికి వర్మ అంతా ఫిదా అవడం ఆసక్తిని రేపుతోంది.
దీనిపై పలువురు నెటిజన్లు వారివారి స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. వర్మకు ఫ్యూచర్ స్టార్ దొరికిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు తమకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. డైరెక్టర్ వర్మ ఇచ్చిన బంపరాఫర్ పై ఆ యువతి ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

















