
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వం కరోనా కట్టడికి శాయశక్తుల కృషి చేస్తున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఈ తరుణంలో గాంధీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 200మంది నర్సులు బుధవారం విధులకు గైర్హాజరయ్యారు. దీంతో కరోనా వార్డుల్లో రోగులకు సేవలు అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే మంగళవారమే నర్సులు సమ్మెకు సంబంధించిన నోటీసు గాంధీ సూపరిండెండెంట్ శ్రావణ్ కుమార్ నోటీసు అందించినట్లు సమాచారం.
గాంధీలో 1050పడకలకు 350 మంది నర్సులు ఉండాల్సి ఉండగా 160మంది రెగ్యూలర్ నర్సులు మాత్రమే పని చేస్తున్నారు. 2008నుంచి కొత్తగా నర్సుల నియామకాలను ప్రభుత్వం చేపట్టలేదు. ఈ 200మంది నర్సులు జీజేఎస్ అనే ఏజెన్సీ కింద గడిచిన 13ఏళ్లుగా గాంధీలో సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో వీరి సేవలు కీలకంగా మారాయి. ఈ తరుణంలో తమ సేవలను గుర్తించి ప్రభుత్వం తమను రెగ్యూలర్ చేయాలని కోరుతూ వారంతా సామూహికంగా సమ్మెకు దిగారు.
గత కొంతకాలంగా తమను రెగ్యూలర్ చేయాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. గాంధీలో కరోనా రోగుల సంఖ్య పెరగడంతో వీరు తమ ఆందోళన తీవ్రతరం చేశారు. వీరి సమ్మెకు దిగడంతో కరోనా వార్డుల్లో సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఈమేరకు వైద్యాధికారులు అప్రమత్తమైన రెగ్యూలర్ సిబ్బందితో మూడు షిప్టుల్లో సేవలందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సేవలను గుర్తించి రెగ్యూలర్ చేస్తారని ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా నర్సుల సమ్మెపై ప్రభుత్వం సత్వరమే స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.