Home Blog Page 8522

కన్నాపై అంబటి సంచలన ఆరోపణ!


భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసిపి అదికార ప్రతినిది, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన ఆరోపణ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రి అయ్యారని, ఆ సమయంలో కన్నా ముఖ్యమంత్రి పదవిలోకి రావాలని డిల్లీలో కాంగ్రెస్ నేత ఒకరికి ఇరవై కోట్లు ముట్టచెప్పారని ఆయన ఆరోపించారు. అయితే ఆ తర్వాత కన్నాకు ఆ నేత టోపి పెట్టారని అన్నారు. ఈ విషయమై కన్నా కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్దమా అని ఆయన ప్రశ్నించారు.

అంతేకాదని నమ్మిన వారిని నట్టేట ముంచే చరిత్ర కన్నాకు ఉందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం ఇచ్చిన డబ్బుకు పార్టీకి లెక్కలు చెప్పలేదని ఆరోపించారు. ఈ అంశంపై అదిష్టానం ఆగ్రహంతో ఉందన్నారు. ఆ సంగతి తెలిసి కన్నా ఈ రకంగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరడానికి కన్నా సిద్దం అయి, ఆ తర్వాత గుండెపోటు వచ్చిందని ఆస్పత్రిలోకి చేరానని, నిజంగా గుండెపోటు వచ్చిందని ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు అమ్ముడు పోలేదని ప్రమాణం చేయగలరా అని కన్నా ప్రశ్నించారని, ప్రమాణం చేయడానికి విజయసాయిరెడ్డి తాను సిద్దంగా ఉన్నారని రాంబాబు తెలిపారు.

రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి వైసీపీనే కారణం!


వైసిపి ప్రజా ప్రతినిధులు ఇంటింటికి తిరిగి కరోనా వైరస్ వ్యాపింపజేయడం సరైందికాదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో అక్కడి వైసిపి ఎమ్మెల్యే ట్రాక్టర్లతో ఊరేగింపుగా ప్రదర్శన నిర్వహించారని, ప్రస్తుతం 13 మంది ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గుంటూరులో కూడా అదే జరిగిందన్నారు. ఆ రోజే మీ ఎమ్మెల్యే చేసిన దానిని నిలదీసివుంటే ఈ రోజు గుంటూరులో కొన్ని వందలమందికి కరోనా సోకేది కాదన్నారు. ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటుంటే మేమెలా సహకరిస్తామన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టడానికి ఒక నల్ల చట్టం తెచ్చారని అన్నారు. కేరళలో 2 నెలలకు సరిపోయే 17రకాల సరుకులు 95లక్షల కుటుంబాలకు ఇచ్చారని చెప్పారు. ప్రజలంతా భయపడుతున్న కనబడని శత్రువు కరోనా, అన్నిరకాల టచ్ పాయింట్ల ద్వారా శరవేగంగా విస్తరిస్తోందన్నారు. కారోనాకు నియంత్రణ ఒక్కటే దీనికి మార్గం అని, బైటనుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని క్వారంటైన్ చేయాలన్నారు. కేంద్రం లాక్ డౌన్ చేయకపోతే మనం మరింత విపత్కర పరిస్థితుల్లోకి వెళ్లేవాళ్లమని చెప్పారు.

మనదేశంలో 591మంది చనిపోయారని, మహారాష్ట్రలో కేసులు, మరణాలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. 53 మంది మీడియా ప్రతినిధులకు కూడా సోకిందన్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే ఏపిలో 76 కేసులు పెరిగాయని చెప్పారు
కరోనాను దాచిపెట్టినా, కావాలని కప్పెట్టినా, దానివల్ల కలిగే అనర్ధాల గురించి తొలినుంచి నేను హెచ్చరిస్తూనే ఉన్నానని తెలిపారు. నాతో సహా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంటే, వైసిపి వాళ్లు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో ఆన్ లైన్ లో ఒక సమావేశం పెట్టండి. మీకు నచ్చిన అధికారులు, మేధావులను పిలవండి, అభిప్రాయాలు తీసుకోండని చెప్పినా ఈ ప్రభుత్వం లెక్క పెట్టలేదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం, వాళ్ల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని, ఒక బాధ్యతగా ప్రవర్తించాలన్నారు.

చాలా రాష్ట్రాలు అనేక ల్యాబ్ లను పకడ్బందీగా నిర్వహిస్తున్నాయని, పకడ్బందీగా టెస్టింగ్ లు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఎందుకు గందరగోళం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపిలోని 13 జిల్లాలలో 11 రెడ్ జోన్ లో ఉన్నాయని, ఎక్కడికక్కడ పరీక్షలు చేసి హాట్ స్పాట్లపై ప్రత్యేక శ్రద్ద పెడితే తప్ప దీనిని నివారించలేమని చెప్పారు.

డాక్టర్లకు ఇచ్చే పిపిఈలు సురక్షితమైనవైనా, వైద్యులకు ఇచ్చే రక్షణ పరికరాలపై నిర్లక్ష్యం చేశారన్నారు. కరోనా రోగికి చికిత్స చేసినందుకు నెల్లూరులో డాక్టర్ కు కూడా సోకిందని, చివరికి ఆయన చికిత్స కోసం చెన్నై వెళ్లారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా సోకింది. చెన్నైలో ఆయన చనిపోతే మృతదేహాన్ని కూడా స్వగ్రామానికి తెచ్చే పరిస్థితి లేదని, ఆ డాక్టర్ అంత్యక్రియలు కూడా అక్కడే చేయాల్సి వచ్చిందని చెప్పారు. కర్నూలు జిల్లాలో ఎందుకీ పరిస్థితి వచ్చిందని, అక్కడ పేదల డాక్టర్ కూడా కరోనా రోగికి చికిత్స చేసి చనిపోయాడని చెప్పారు. రాష్ట్రంలో పిపిఈలన్నీ ఒక పద్దతి ప్రకారం ఉన్నాయా, డాక్టర్ల గౌన్లు, మాస్క్ లు రక్షణ ఇచ్చేవేనా, వాటి నాణ్యత పరీక్షించారా అని ప్రశ్నించారు. వీటన్నింటిపై ప్రాపర్ ఆడిటింగ్ చేయాలని, క్వాలిటీ టెస్ట్ చేయాలని సూచించారు. వీళ్లంతా కరోనాపై పోరాడే ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది గుర్తుంచుకోవాలన్నారు. నిన్న ఒక ఏఎస్ ఐ చనిపోయాడని, కరోనా రోగులను కాపాడేందుకు తమ ప్రాణాలు త్యాగాలు చేసేందుకు కూడా సిద్దపడిన వాళ్లను రక్షించే విధానం ఇదేనా అని ప్రశ్నించారు.

మొన్న ఆరోపణలు చేసి, ఇప్పుడు మా విజన్ మెడ్ టెక్ జోన్ ఎలా అంటారన్నారు. ఏ2 ఇష్టానుసారం అందరి గురించి మాట్లాడతారని, మెడ్ టెక్ జోన్ మా విజన్, దీని ద్వారా దేశానికే సరఫరా చేస్తున్నాం అన్నా విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ రోజు సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ప్రశ్నించారు.

కరోనా కిట్ల కొనుగోళ్లలోనూ కక్కుర్తి పడతారా, ఒక్కో కిట్ రూ. 730కు కొన్నారని, అదే కిట్ చత్తీస్ గఢ్ ప్రభుత్వం సేమ్ బ్రాండ్ సేమ్ కంపెనీ కిట్ రూ. 337 ధరకు తెప్పించిందన్నారు. ఇప్పుడు పట్టుబడినాక తగ్గిస్తామని అనడం ఎంత వరకూ సమంజసమన్నారు. ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏం న్యాయమని, ప్రభుత్వ పిలుపును గౌరవించి ప్రజలు లాక్ డౌన్ పాటిస్తుంటే, వాళ్ల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం ఇదేనా చేసేదిని ప్రశ్నించారు.

రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ఆక్వా ఉత్పత్తులకు, హార్టీ కల్చర్ ఉత్పత్తులకు ధర లేదన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ప్రభుత్వమే కొని రైతు బజార్లలో, మొబైల్ రైతుబజార్లలో అమ్మవచ్చని సలహా ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్య లకు ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. సీఎం హామీలు కేవలం ప్రకతనాలకే పరిమితం అయ్యాయని చెప్పారు. టిడిపి, బిజెపి, జనసేన ఏ పార్టీ నాయకులు మాట్లాడినా వాళ్లపై విమర్శలు గుప్పించారన్నారు. మొన్న కన్నాపై, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారని చెప్పారు.

ఈ రోజు కొవ్వూరులో యూపి నుంచి వచ్చిన వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలలో మన వలస కార్మికులను ఆదుకోమని లేఖలు రాస్తున్నాం. వాటికి స్పందించి అక్కడి రాష్ట్రాలు ఆదుకుంటున్నాయని, ఇక్కడ ఉండే వలస కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా అని ప్రశ్నించారు. క్వారంటైన్ కేంద్రాల్లో చనిపోవడం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. క్వారంటైన్ లో ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తే వాళ్లకు పాజిటివ్ బైటపడితే ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రత్యేక చికిత్స ఇవ్వాలన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట లో, పెడనలో, చింతలపూడి మండలంలో చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి విద్యార్ధులు ఏపికి వస్తే వాళ్లను లాఠీఛార్జ్ చేసి తరిమేశారని, అలాంటిది ప్రభుత్వమే చెన్నై నుంచి కనగరాజ్ ను అంబులెన్స్ లో ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ప్రతిరోజూ ఛైర్మన్ ల నియామకం చేస్తున్నారని ఎందుకంత ఆతృత చెప్పాలన్నారు. 15 శాతం మందికి సోకితే మన దగ్గర వాళ్లందరికీ ఆసుపత్రులు ఉన్నాయా అని ప్రశ్నించారు.

బాలయ్య బొమ్మకు కథ రెడీ అంటున్న పూరీ


ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమా రూపొందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయాలనే సంకల్పం తో నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమా తరువాత పూరి జగన్నాధ్ తదుపరి మూవీ ఏ హీరోతో నిర్మిస్తాడు అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .

అలాంటి టైములో తాజాగా బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. గతంలో బాలకృష్ణతో ‘పైసా వసూల్’ చేసిన పూరి జగన్నాధ్ ,రీసెంట్ గా బాలకృష్ణకి కాల్ చేసి కథ వినిపించాడట. కథలో కొత్తదనం కారణంగా వెంటనే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది,.ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో చేస్తున్న ‘ఫైటర్’ సినిమా పూర్తి కాగానే ఈ బాలకృష్ణ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది .

మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన పూరీ జగన్నాధ్ ఈ సారి బాలయ్య బాబు కి హిట్ సినిమా ఇవ్వాలి అన్న కసితో కథ తయారు చేసాడట ..2017 లో మాస్ ఇమేజ్ వున్న బాలకృష్ణతో ‘పైసా వసూల్’ అనే సినిమా చేశాడు పూరీ జగన్నాధ్..అంతేకాదు . ఆ సినిమా లో బాలకృష్ణను చాలా స్టైలీష్ గా చూపించాడు. అందుకే బాలయ్య బాబుకి పూరీ జగన్నాధ్ అంటే వల్లమాలిన అభిమానం.

రీమేక్ కి రెడీ అవుతున్న ‘ఉప్పెన’


పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.అన్నట్టుంది మెగా మేనల్లుడి సినిమా పరిస్థితి .ప్రతిరోజూ పండగే ఫేమ్ సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ చిత్రం రూపొందింది. తెలుగులో అతనికి ఇదే తొలి చిత్రం అలాగే కథానాయిక కృతి శెట్టి ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయ మవుతోంది. అలాగే వీరిద్దరితో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా తెలుగు తెరకి పరిచయం కాబోతున్నాడు. సుకుమార్ శిష్యుడైన దర్శకుడు బుచ్చిబాబుకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాలో విలన్ గా తమిళ్ హీరో విజయ్ సేతుపతి నటించడం..

ఏప్రిల్ రెండవ తారీఖున విడుదల కావలసిన “ఉప్పెన ” సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కొత్త దర్శకుడు ,కొత్త హీరో , కొత్త హీరోయిన్ ల కలయికలో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు 22 కోట్ల భారీ బడ్జట్ తో నిర్మించారు.వారికీ సినిమా మీదున్న అపారమైన నమ్మకం తో సొంతంగా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఇక సినిమాలో కీలకమైన విలన్ పాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతి ఈ చిత్రం యొక్క ఔట్పుట్ చూసి తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించు కోవడంతో పాటు , రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడట. కాగా ఈ చిత్రం యొక్క తమిళ్ వెర్షన్ కి నిర్మాణ భాగస్వాములుగా మైత్రి మూవీస్ వారు ఉంటారని తెలుస్తోంది. … తెలుగులో విజయ్ సేతుపతి చేసిన పాత్రను, తమిళంలో కూడా ఆయనే చేస్తాడని తెలుస్తోంది .ఇక ఈ చిత్రం లోని పాటలు తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూత లూగిస్తూ, చార్ట్ బస్టర్స్ గా మారడం తో సినిమా ఫై అంచనాలు భారీగా పెరిగాయి. .

పుష్ప చిత్రంలో రెండో హీరోయిన్ గా నివేదా థామస్‌


2016 లో మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ` జెంటిల్మన్ ` చిత్రం లో నాని సరసన హీరోయిన్ గా నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించు కొన్న నివేదా థామస్‌ ఈ మధ్య లక్ తోక తొక్కినట్టుంది. వరుసగా మంచి ఆఫర్ లు వెతుక్కొంటూ వస్తున్నాయి. నిజానికి నివేదా థామస్‌ తెలుగులో నటించిన చిత్రాలన్నీ సక్సెస్ సాధించాయి. జెంటిల్మన్ సినిమా తరవాత `నిన్ను కోరి , జై లవకుశ , 118 , బ్రోచేవారెవరురా `చిత్రాలతో నివేదా థామస్‌ సక్సెస్ అందుకొంది. ఇపుడు తాజాగా నటించిన మల్టి స్టారర్ మూవీ ” వి ” కూడా బాగుంది అన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక నివేదా థామస్‌ నటించ బోయే చిత్రాల లిస్టులో పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ ” వకీల్ సాబ్ ” ఉండగా ఇపుడు మరో సూపర్ మూవీ లోసెకండ్ హీరోయిన్ ఆఫర్ వచ్చింది.

`ఆల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకొన్న అల్లు అర్జున్ ఇపుడు మరో పవర్ ఫుల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రంగస్థలం ఫేమ్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ రెండు డిఫరెంట్ గెటప్ లలో కన్పించ నున్నాడు.. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ హై ఎక్స్ పెక్టెడ్ (HIGH EXPECTED ) మూవీ లో ఇద్దరు హీరోయిన్ లు నటించ నున్నారు. అందులో ఒక హీరోయిన్ రష్మిక మందన్న కాగా రెండో హీరోయిన్ గా నివేదా థామస్‌ నటిస్తోంది . ఈ లెక్కన ఇద్దరు మెగా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రిస్టేజ్ చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా థామస్‌ చాలా చాలా లక్కీ ఫెలో అనక తప్పదు .

రాజధానిలో పులి సంచారం.. నిజమెంత?

హైద్రాబాద్ లోని బంజారహిల్స్‌ లో రోడ్డుపైన పులి సంచరించిందని ఈ రోజు ఉదయం నుంచి ఓ వీడియో వైరల్‌ అయింది. బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుత్రి రూట్‌ లో కేబీఆర్‌పార్క్‌ నుంచి పులి రోడ్డు దాటిందని వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌ లలో వీడియో పోస్ట్‌ చేయడంతో విపరీతంగా వైరల్‌ అయింది. కొన్ని వెబ్‌ సైట్లలో సైతం వార్త రాసి వీడియోను అప్‌ లోడ్‌ చేశారు. దింతో క్షణాల్లో ఈ వీడియోను సోషల్‌మీడియాలో వీపరీతంగా షేర్‌ చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని తీసుకుని చెక్‌ చేశారు. అసలు ఎక్కడా కూడా పులి సంచరించలేదని అధికారులు తేల్చి చెప్పారు. ఆ వీడియో ఇక్కడిది కాదని, తిరుమల కొండల్లోనిది అయుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ వీడియోను షేర్‌ చేసినవారికి పోలీసులు వార్నింగ్‌ కూడా ఇచ్చారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరైనా ఇలాంటి వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచన!

High court


కరోనా వైరస్ భారిన పడి ఆసుపత్రి లో చేరిన వారికి వైద్య సేవలందిస్తున్న వైద్యులకు తప్పనిసరిగా మాస్క్‌ లు, పీపీ కిట్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. జన సమూహాన్ని తగ్గించడానికి ప్రతి కాలనీలో మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో కరోనా నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి  జిల్లాలో ప్రత్యేక  కేంద్రాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

కరోనా మహామ్మరిని కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా 329 కంటైన్మెంట్ ప్రాంతాలను ఏర్పాటు చేశారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై మరోసారి పూర్తి వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 8కి కోర్టు వాయిదా వేసింది.

భారత వైద్యురాలికి అమెరికా సెల్యూట్..


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా మహమ్మరి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతంలో ప్రపంచంలోని అన్నిదేశాలకు కరోనా వైరస్ సోకింది. చైనాయేతర దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలడుతున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ లాంటి దేశాలు కరోనాతో అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అమెరికా ప్రస్తుతం తగు మూల్యం చెల్లించుకుంటోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతోన్నాయి.

ఈతరుణంలో ప్రవాస భారతీయ వైద్యులు అమెరికాలో కరోనా మహమ్మరిపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ అమెరికన్లకు అండగా నిలుస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనాపై పోరాడుతున్నారు. ఇప్పటికే అమెరికాకు అవసరమైన హైడ్రోక్లోరోక్వీన్ మందులను భారత్ పంపి ప్రాణదాతగా నిలిచింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయులు చేస్తున్న సేవలను గుర్తించిన అమెరికన్లు కృతజ్ఞతలు చెబుతున్నారు.

కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఉమా మధుసూదన్ అమెరికాలోని సౌత్ విండ్సార్ ఆస్పత్రిలో ఎన్నో ఏళ్లుగా వైద్యురాలిగా సేవలందిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆమె విశేషంగా సేవలందిస్తుంది. ఇలాంట విపత్కర పరిస్థితుల్లో ఆమె సేవలను గుర్తించిన అమెరికన్లు వైద్యురాలు ఉమా మధుసూదన్ ఇంటి ముందుకు చేరుకొని పెద్దఎత్తున వాహనాలతో పేరేడ్ నిర్వహిస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో ప్రవాస భారతీయులు సుమారు 50వేల వైద్యులు సేవలు అందిస్తున్నట్లు సమాచారం. అమెరికన్లు ఉమా మధుసూదన్ ఇంటి ఎదుట వాహనాలతో పేరేడ్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

నాలుగో రీమేక్ లో నటించబోతున్న సమంత


పెళ్ళైన తరవాత సమంత అక్కినేని లో చాలా మార్పు కనపడుతోంది . ఇదివరకటి లాగా ఏ సినిమా బడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. సెలెక్టివ్ గా వెళుతోంది . పెళ్లయిన తర్వాత `రంగస్థలం’ ,` మహానటి ` , `మజిలీ ` వంటి మంచి సినిమాలు చేస్తూ..మరపురాని విజయాలు ఖాతాలో వేసుకున్న సమంత మధ్యలో రీమేక్ చిత్రాలు చేసింది. ` యూ టర్న్` , `ఓ బేబీ’, `జాను `అనే మూడు రీమేక్ చిత్రాలు చేసింది. ఆ మూడు చిత్రాలు నటిగా సమంత కి మంచి పేరు తెచ్చి పెట్టాయి. దాంతో మరోసారి ఓ రీమేక్ చిత్రంలో నటించాలి అనుకొంటోంది సమంత. నిజానికి ‘జాను’ చిత్రం ప్లాప్ అయిన తర్వాత సమంత ఇక రీమేక్‌ చిత్రాల జోలికి వెళ్ల దని అంతా అనుకొన్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సమంత ఓ కన్నడ రీమేక్ చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకొంది.

ఈ ఏడాది ఫిబ్రవరి లో కన్నడలో విజయం సాధించిన ‘దియా’ ఇపుడు తెలుగులో రీమేక్ అవుతోంది ..కాగా ఈ ప్రేమకథ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశం కనిపిస్తోంది.నిజానికి ఈ చిత్రం లవ్‌స్టోరీ అయినప్పటికీ ఇందులో పాటలు, ఫైట్లు ఏమీ ఉండవు . .. కథ, కథనం ఈ సినిమాకు మూలస్తంభాల్లా నిలిచి ఈ సినిమా ని హిట్ చేశాయి. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది ..కాగా ఈ ట్రయాంగిల్ స్టోరీ లో సమంత తో పాటు నాగచైతన్య, నాగశౌర్య నటిస్తారని తెలుస్తోంది .ఇంకో విశేషం ఏమిటంటే సమంత , నాగ చైతన్య కాంబినేషన్ లో ఇది ఐదో చిత్రంగా రాబోతుంది .

Shivani Raina Photoshoot Stills

Sapna Pabbi Hot Photos

Ananya Panday Glamorous Pics

రాపిడ్ టెస్టింగ్ కిట్ల నాణ్యతపై దుమారం… నిలిపివేత


పలు రాష్ట్ర ప్రభుత్వాలు వేలం వెర్రిగా కొనుగోలు చేస్తున్న రాపిడ్ కిట్ల నాణ్యతపై దుమారం చెలరేగింది. దానితో వాటిని ఉపయోగించడం వెంటనే నిలిపివేయమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత వైద్య పరిశోధన మండలి (ఇసిఎంఆర్) ఆదేశించింది. రెండు రోజులపాటు వాటి నాణ్యతను పరిశీలించి, ఏమి చేయాలో చెబుతామని తెలిపింది.

కరోనా వైరస్‌పై సత్వర ఫలితాల కోసం వినియోగించే ర్యాపిడ్ టెస్ట్ కిట్లు సరైన ఫలితాలు ఇవ్వడం లేదని అంటూ రాజస్థాన్ వాటి ఉపయోగాన్ని నిలిపివేసి, ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకోంది. ఈ విషయమై రాజస్థాన్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలన ప్రకారం కేవలం 5.4 శాతం మాత్రమే సరైన ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్యమంత్రి రఘుశర్మ వెల్లడించారు.

కనీసం 90 శాతం ఖచ్చితమైన ఫలితాలు రావలసి ఉంది. రాజస్థాన్‌లో జైపూర్ సహా పలు హాట్‌స్పాట్లలో 170 ఫరీక్షలు జరుపగా తప్పుడు ఫలితాలు వచ్చాయని అన్నారు. ఈసరికే కరోనా ఉన్నవారికి సైతం ఆ కిట్లు ఉపయోగించి పరీక్షిస్తే నెగెటివ్ వచ్చిందని వివరించారు.

దాంతో కిట్స్ విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తాయని, వైద్య కమిటీ సలహా మేరకు వాటిని ఉపయోగించడం నిలిపివేసి ఐసీఎంఆర్‌కు తెలియజేశామని మంత్రి చెప్పారు.
ఐసీఎంఆర్ నుంచి ఇంకా సమాధానం రాలేదు.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో ఫలితాలు వచ్చేందుకు 6 గంటల వరకు పడుతుంది. అదే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అయితే 15 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. కరోనా వైరస్ హాట్‌స్పాట్లలో ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఉపయోగించాలని ఐసీఎంఆర్ సూచించింది. దీంతో భారత్ సుమారు 5 లక్షల టెస్ట్ కిట్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకున్నది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా వీటి నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కూడా గత వారమే వీటిని తెప్పించుకొంది. దానితో వీటి నాణ్యతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏపీ సీఎం ఎక్కడ?

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కరోనా నివారణ చర్యల తో పాటు ప్రజల్ని కాపాడుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మేఘాలయా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారని అక్కడి పేపర్ క్లిపింగ్ లతో సహా ట్వీట్ చేశారు.

65 ఏళ్ళ వయస్సున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గ్రౌండ్ లెవల్ లో పని చేస్తున్నారు. 65 ఏళ్ళ వయస్సున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్షేత్ర స్థాయి లో పని చేస్తున్నారని తెలిపారు.

61 ఏళ్ళ వయస్సు ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహన్ గ్రౌండ్ లెవల్ లో తిరుగుతూ రైతుల కష్టాలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారని, మేఘాలయా ముఖ్యమంత్రి కోనార్డ్ సంగ్మా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలకు సహాయం అందిస్తున్నార పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గ్రౌండ్ లో పని చేస్తున్నారన్నారు. 77 ఏళ్ళ వయస్సున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్షేత్ర స్థాయిలో ఉండి కరోనా పై పోరాటం చేస్తున్నారని తెలిపారు. మరి యువ ముఖ్యమంత్రిని అనే చెప్పుకునే,ఆంధ్రప్రదేశ్ సీఎం.జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజప్రసాదంలో నుంచి బయటకు రారా అని ప్రశ్నించారు. రాజకీయమే ఆయనకి ముఖ్యమా అనేది చెప్పాలన్నారు. ఏపీ సీఎం మిస్సింగ్ అని ట్వీటర్ లో పోస్టు చేశారు.

కొత్త జీవోతో విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్!

కోవిద్19 దెబ్బతో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ అమలుపరుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు ఎటువంటి ఫీజులు వసూలు చేయవద్దని సీఎం కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించిన స్కూల్ ఫీజుల నియంత్రణ జీవోను తెలంగాణ సర్కార్ జారీ చేసింది. విద్యా సంస్థలు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని,అది కూడా నెల వారీగా తీసుకోవాలని సర్కార్ స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం ఎటువంటి ఫీజులు వసూలు చేయవద్దని విద్యా సంస్థలను విద్యాశాఖ ఆదేశించింది.ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేస్తామని సర్కార్ పేర్కొంది. సీబీఎస్సీ,ఐసీఎస్సీ,ఇంటర్నేషనల్ బోర్డులను కూడా ప్రభుత్వం పరిధిలోకి తెస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో తెలంగాణ విద్యార్దులకు,తల్లిదండ్రులకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. చాలా ప్రైవేటు పాఠశాలలు,కళాశాలలు డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలు వసూళ్లు చేస్తాయి.ఈ సారి ఆ బాధ లేకపోవడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో ఇప్పటికే 1 నుంచి 9 వతరగతి విద్యార్దులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు దాదాపుగా ముగిశాయి. వాటి వాల్యుయేషన్ కొనసాగాల్సి ఉంది. పదో తరగతి పరీక్షల పై మే 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇప్పటి కే ప్రకటించారు. ఇక డిగ్రీ,బీటెక్,ఇతర పీజీ పరీక్షలు కూడా జరగాల్సి ఉంది. పరిస్థితి అదుపులోకి రాకుంటే సెమిస్టర్ పరీక్షలలో విద్యార్దులను పాస్ చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా టెన్త్ పరీక్షలు,ఇంటర్ ఫలితాలు ప్రభుత్వానికి సవాల్ గా మారాయి.

షాకింగ్ న్యూస్.. పార్ల‌మెంట్‌‌కు పాకిన కరోనా..


దేశంలో కరోనా చాపకింద నీరులా విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కట్టడి లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టడంలేదు. రోజుకురోజుకు దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశంలో 18వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 600మంది మృత్యువాత పడ్డారు. నిన్నటి నిన్న రాష్ట్రపతి భవన్లో పని చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడం సంచలనంగా మారిన సంగతి తెల్సిందే. తాజాగా లోక్ సభలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన రేకెత్తిస్తోంది.

తాజాగా కరోనా సోకిన వ్యక్తి లోక్ సభలోని హౌస్ కీపింగ్ విభాగంలో పని చేస్తుంటాడని అధికారులు పేర్కొన్నారు. మార్చి 23న పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డటంతో సదరు వ్యక్తి ఇంటికే పరిమితమయ్యాడు. ప‌ది రోజుల కింద‌ట అనారోగ్యానికి గురవడంతో ఆస్ప‌త్రిలో చూపించుకున్నాడు. అయితే అప్పుడు అతడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రాలేదు. దీంతో వైద్యులు అతడిని డిశ్చార్చి చేశారు.

తాజాగా ఈనెల 18న క‌రోనా ల‌క్షణాలు కన్పించడంతో మరోసారి ఆస్ప‌త్రిలో చేరాడు. వైద్యులు అతడికి టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సదరు ఉద్యోగిని క్వారంటైన్ కు తరలించారు. అతడు తన భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, మనవరాలితో ఉంటున్నాడు. దీంతో వీరందరికీ పరీక్షలు నిర్వహించారు. కాగా కరోనా కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ తొలి రెండు స్థానాల్లో నిలుస్తుంది. ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు సంఖ్య పెరిగిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.

స్వాతంత్ర భారతావని లో 9 చారిత్రక తప్పిదాలు

సమయం ఆగకుండా ఎప్పటిలాగే గడిచిపోతుంది. లాక్ డౌన్ తో మన పనులకు ఫులుస్తాప్ పడిందిగానీ సమయానికి కాదు. చరిత్రలో ఎన్నింటిని వీక్షించిందో గదా. భూమి పై జీవరాశి పుట్టిన దగ్గర్నుంచి అదెలా పరిణామం చెందుతూ వచ్చిందో వీక్షిస్తూనే వుంది. అలాగే భారత్ దాస్య సృంఖాల నుంచి విముక్తిపొందిన విధానం అప్పటినుంచి ఇప్పటిదాకా మారుతున్న పరిణామాలు కూడా అలుపెరగకుండా వీక్షిస్తూనే వుంది. ఈ 73 సంవత్సరాల భారత్ ఎలా పురోగమనం చెందిందో ఎక్కడక్కడ తప్పుటడుగులు వేసిందో కూడా గమనిస్తూనే వుంది. ఈ తప్పటడుగులే లేకపోతే ఇంకా ఎంతగా ఎదిగేదో కూడా సమయానికి తెలుసు. తెలియందల్లా మనకే మిత్రమా. ఆ తప్పటడుగులేమిటో స్థూలంగా ఒక్కసారి పరిశీలిద్దామా.

చారిత్రక తప్పిదాలు 

  1. దేశ విభజన : మన పుట్టుకే లోపంతో జరిగింది. అప్పటిదాకా ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా కలిసివున్న భారతావని మతం పేరుతో విభజనకాబడటమే అన్నిటికన్నా పెద్ద తప్పు. మత రాజకీయాలకు అప్పుడే బీజం పడింది. పుట్టుక లో లేని భేదం, జాతి లో లేని తేడా, మతం పేరుతో నువ్వు వేరు, నేను వేరు అనటంలోనే అన్నింటికన్నా పెద్ద చారిత్రక తప్పిదం జరిగింది. మానవాళికి మచ్చ తెచ్చింది. ప్రపంచం లో ఎక్కడా కేవలం మతం కోసం విడిపోయిన సంఘటన చరిత్రలో లేదు. ఇది బ్రిటీష్ వాడు వాడి స్వార్ధం కోసం, ‘గ్రేట్ గేమ్’ లో భాగంగా వెళుతూ వెళుతూ మనకిచ్చిన ‘ బహుమతి’. అది తప్పని 1971 కి అందరికీ అర్ధమయ్యింది. అయినా రావణా కాష్టంలా అది పశ్చిమ సరిహద్దులో కాలుతూనే వుంది. రావణా కష్టం ఆరినా ఈ చిచ్చు ఆరేటట్లు లేదు.
  2. సామాజిక విభజన : బ్రిటీష్ వాడు పెట్టిన చిచ్చు నుండి మనం బయట పడలేదు. మన పెద్దలు సెక్యులర్ రాజ్యాంగాన్ని తయారుచేసి మతాన్ని ప్రభుత్వాన్నుంచి వేరుచేసినా చివరలో వుమ్మడి పౌర సంస్కృతి పై రాజీపడి క్షమించరాని తప్పు చేశారు. ఆ పాపమే మనల్ని ఈ రోజుకీ వెంటాడుతుంది. నీ మతం వేరు, నా మతం వేరు అనే భావన చివరకు నువ్వు వేరు, నేను వేరు అనేదాకా ఈ రోజు వచ్చిందంటే అది ఆ రోజు మన రాజ్యాంగ పెద్దలు వేసిన బీజమే. ఆధునిక ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే ముందుగా పౌరులందరూ ఒక్కటనే భావం బలపడాలి. అది బలపడాలంటే జాతి, కుల, మత బేధ భావం అంతరించాలి. లేకపోతే ఆధునిక ప్రజాస్వామ్యానికి అర్ధం లేదు. యూరప్ లో వచ్చిన పునరుజ్జీవన ఉద్యమం పునాదిగా మొట్టమొదట ఏర్పడిన ప్రజాస్వామ్య రిపబ్లిక్ అమెరికా. అక్కడ జాతి విభేదాన్ని , లింగ అసమానతల్ని నిర్మూలించక పోయినా మత గుర్తింపు ఆధార సామాజిక విభజనను అంతమొందించారు.  మరి మనమేం చేశాం. మతం పేరుతో వేరు వేరు పౌర చట్టాల్ని చేశాం. అదేమన కొంపముంచింది. అదే భారతదేశం నుంచి అమెరికా నో , ఇంగ్లాండో , జర్మనీ నో, ఫ్రాన్సో, ఆస్ట్రేలియా నో వెళితే అక్కడ వున్న వుమ్మడి పౌర చట్టాల కిందనే పనిచేస్తాము. అక్కడలేని అభ్యంతరం మన దేశం లో ఎందుకో అర్ధం కాదు. అంబేద్కర్ మహనీయుడు హిందూ చట్టాలను సంస్కరించి ఉండకపోతే కనీసం ఈ మాత్రమయినా సమాజం వుండేది కాదు. సంప్రదాయవాదులు అప్పుడూ దాన్ని వ్యతిరేకించారు. అయినా మన రాజకీయ నాయకత్వం ధైర్యంగా ముందడుగు వేసింది. అదే వుమ్మడి పౌర చట్టం విషయం లో తోకముడిచింది. ఆ విభజనే ఈ రోజు ఏకు మేకై గుర్తింపు రాజకీయాలను పెంచి పోషిస్తుంది.
  3. కాశ్మీర్ విభజన : 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారం జరిగిన కాశ్మీర్ విలీనాన్ని తుంగలోతొక్కి ప్రజల కోరిక మేరకు అనే  కొత్త అంశాన్ని ( చట్టం లో లేక పోయినా) , ఎటువంటి అధికారం లేకపోయినా ప్రచారం చేయటం క్షమించరాని చారిత్రక తప్పిదం. చట్టబద్ధంగా విలీనమైన  భూభాగాన్ని దుండగులు ఆక్రమిస్తే తిరిగి స్వాధీనం చేసుకోవాల్సింది పోయి ఐక్యరాజ్యసమితి కి  నివేదించటం, తర్వాత ఐక్యరాజ్యసమితి దాన్ని ‘ వివాదం’ గా చేస్తే కిమ్మనకుండా కూర్చోవటం కన్నా పాలకుల వైఫల్యం చరిత్రలో ఇంకేముంటుంది. అసలు చట్టం లో లేని ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ఐక్యరాజ్యసమితి కి నివేదించటం కన్నా ఘోర తప్పిదం ఇంకేముంటుంది? ఆ అధికారం చట్టం లోని ఏ నిబంధన కింద వుందో ఇన్ని సంవత్సరాల తర్వాత నైనా ఎవరైనా చెప్పగలరా? మిగతా అన్ని సంస్థానాలు ప్రత్యేక రాజ్యాంగాలు లేకుండా భారత రాజ్యాంగాన్ని ఒప్పుకుంటామని తీర్మానం చేస్తే అదేపని చేయటానికి కాశ్మీర్ మహారాజు తో మంతనాలు జరిపి ఒప్పించకుండా ( ఆ పనికి మహారాజు ఒప్పుకునే అవకాశం వుండేది) అధికారం లేని వ్యక్తుల సలహాలతో ప్రత్యేక రాజ్యాంగానికి బాటలు వేయటం తో అక్కడి ప్రజలకి మేము వేరు అనే భావన కలగటానికి పాలకులే కారణమయ్యారు. ఇది కూడా చారిత్రక తప్పిదమే. కాశ్మీర్ వేర్పాటువాదులకు ఇది ఆయుధంగా మారింది.
  4.  చైనా తో సంబంధాలు : చైనా మనకన్నా రెండు సంవత్సరాల తర్వాత జపాన్ ని ఓడించి, అంతర్యుద్ధం నుంచి బయటపడి పూర్తి స్వతంత్ర దేశంగా అవతరించింది. అది ప్రజాస్వామ్య దేశంగా కాకుండా ప్రపంచం లోనే అతి పెద్ద కమ్యూనిస్టు దేశంగా అవతరించింది. ఈ పరిణామాన్ని భారత్ మనస్పూర్తిగా ఆహ్వానించింది. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో చైనా వైఖరిని అంచనా వేయటం లో పెద్ద తప్పే చేసింది. చైనా మాటలను గుడ్డిగా నమ్మింది. ఐక్యరాజ్యసమితి లో తైవాన్ స్థానం లో కమ్యూనిస్టు చైనా ని తీసుకోవాలని కోరింది. అదేసమయం లో చైనా టిబెట్ ని ఆక్రమించుకుంటే మిన్నకుంది. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన భూబాగం ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని రహస్యంగా ఆక్రమించుకుంటే కనీసం తెలుసుకోలేకపోయింది. చివరకు భారత్ పై యుద్ధానికి దిగిందాకా చైనా ని నమ్ముతూనే వుంది. చైనా తో వున్న సరిహద్దు తగదాలని పరిష్కరించుకోవటానికి వ్యూహాత్మకంగా టిబెట్ వ్యవహారాన్ని వాడుకొని వుండాల్సింది. టిబెట్ చైనా లో అంతర్భాగమని ఒప్పుకోకుండా వుండాల్సింది. అన్ని తురుపు ముక్కలు వదులుకొని చైనా ని పైన కూర్చోబెట్టింది. ఆ తర్వాత చైనా మనన్ని దెబ్బతీయటానికి నాగా వేర్పాటువాదుల్ని, ఇతర ఈశాన్య భారత వేర్పాటు వాదుల్ని , అంతర్గత తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది. ఒకవైపు ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ లోపల , బయట వున్న ప్రతిపక్ష నాయకులూ మొదట్నుంచీ హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టి చైనా ని గుడ్డిగా నమ్మటం పెద్ద చారిత్రాత్మక తప్పిదం. అది తెలుసుకునే టప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
  5. ప్రాధమిక విద్య నిర్లక్ష్యం చేయటం : చైనా ని అమితంగా అభిమానించే నాయకత్వం వారు అమలుచేసిన విద్యా సంస్కరణలను గుర్తించలేదు. మొదట కావాల్సింది సంపూర్ణ అక్షరాస్యత అనే సత్యాన్ని గ్రహించటానికి అర్ధ శతాబ్దం పట్టింది. అంటే అర్ధ శతాబ్దం వెనకబడ్డట్టే కదా. కిందనుంచి పైకి అనే సూత్రం బదులు పైనుంచి కిందకు అనే సూత్రాన్ని పాటించబట్టే ఈ గ్రహణం  పట్టింది. దానితో 72 సంవత్సరాల తర్వాత కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోయాం. ఇది సమాజ పురోగమనానికి ప్రతిబంధకంగా తయారయ్యింది. ఈ చారిత్రక తప్పిదాన్నుంచి మేలుకొని గత రెండు దశాబ్దాలనుంచి అంగలు వేస్తున్నాము. త్వరలో మన లక్ష్యానికి చేరువవుతామని ఆశిద్దాం.
  6. తప్పుడు పారిశ్రామిక విధానం : విద్యావిధానం లో లాగే పారిశ్రామిక విధానం లోనూ తప్పిదాలు చేస్తూ వచ్చాం. మొదట్లో బొంబాయి ప్లాన్ పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు సంయుక్త చొరవతో మొదలైన పారిశ్రామిక విధానం రాను రానూ పురోగతి లో పయనించే బదులు తిరోగమనం లో పయనించింది. చిన్న, కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి బారీ పరిశ్రమల పైనే దృష్టంతా పెట్టింది. అదీ కేవలం ప్రభుత్వ రంగం లో మాత్రమే. మొదట్లో పెట్టుబడిదారి దేశాలు రాజకీయంగా పాకిస్తాన్ కి అనుకూలంగా భారత్ కి వ్యతిరేకంగా వుండటం వాస్తవమే అయినా ఆర్ధికరంగం లో తర్వాత దశలోనైనా ఆ దేశాల పెట్టుబడులను ఆహ్వానించే చర్యలు చేపట్టలేదు. దక్షిణ కొరియా, ఆ గ్నేయేసియా దేశాలు ఆ అవకాశాల్ని అందిపుచ్చుకున్నాయి. తర్వాత దశలో డెంగ్ షియవోపింగ్ నాయకత్వాన చైనా మార్కెట్ ఆర్ధిక వ్యవస్థ లోకి మారి ప్రపంచపెట్టుబడులను  ఆహ్వానించినా మనం మాత్రం మడికట్టుకోని కూర్చున్నాము. చివరకు తప్పని పరిస్థితుల్లోనే 1991 లో సరళీకృత విధానాన్ని పాటించటం మొదలుపెట్టాం. అంటే దాదాపు అర్ధ శతాబ్దం మిగతా ప్రపంచం తో వెనకబడ్డామన్న మాట. లేకపోతే ఇప్పటికి చైనా తో సమాన స్థాయి లోనైనా వుండేవాళ్ళం. మనం చేసిన తప్పుడు ప్రయోగాలు సంస్కరించుకోవటానికి తీసుకున్న సమయం అతి విలువైనదని మరచిపోవద్దు.
  7. వ్యవసాయ రంగంలోనూ ఎన్నో తప్పిదాలు : వ్యవసాయ రంగం లో అధికోత్పత్తి సాధించటానికి, స్వయం సమృద్ధి సాధించటానికి , ఆధునీకీకరణ పద్ధతులు అవలంబించటానికి తీసుకున్న చర్యలు ఈ రోజుకీ ప్రపంచ స్థాయికి చేరుకోలేదు. ఇన్నాళ్ళ తర్వాత కూడా ప్రయోగాల దశలోనే వున్నాం. ఇప్పుడిప్పుడే ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నాయి. ముందుగా చెప్పాలంటే ఉత్పత్తి స్థాయి ఆకుపచ్చ విప్లవం తర్వాత పెరిగినా ఇప్పటికీ ప్రపంచ స్థాయికి చాలా దిగువున వున్నాం. పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించే వ్యవస్థని నిర్మించుకోలేకపోయాం. అధునాతన వ్యవసాయం అప్పటికన్నా మెరుగైనా  ప్రపంచ స్థాయి తో పోలిస్తే చాలా వెనకబడి వున్నాం. భారీ సంస్కరణలు చేపట్టే ధైర్యం రాజకీయ నాయకత్వానికి లేకుండా పోయింది. ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించినా మనకున్న సానుకూల పరిస్థితుల్లో ఇంకా ఎంతో చేయాల్సి వుంది.
  8. సాంస్కృతిక , చారిత్రక వ్యవహారాల్లో తప్పిదాలు: ముందుగా చెప్పాల్సివస్తే మన చరిత్ర ని వక్రీకరించిన విధానాన్ని గురించి చెప్పాలి. ఉదాహరణకు మన ఆధునిక చరిత్రలో స్వాతంత్ర పోరాటం గురించి పూర్తి వక్రీకరణలు చోటుచేసుకోవటం చూశాం. భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర పోరాట యోధుల్ని కించపరిచే విధంగా , నేతాజీ సుభాష్ చంద్ర బోస్ నడిపిన పోరాటాన్ని పూర్తిగా విస్మరించే విధంగా , మొత్తం స్వాతంత్ర పోరాట చరిత్రలో కాంగ్రెస్ తప్పితే మిగతా వాళ్ళు చేసిన త్యాగాలని విస్మరించటం ఒకటేమిటి అన్నీ వక్రీకరణలే. పాత చరిత్ర చూసినా ఈ గడ్డమీద జరిగిన వీరోచిత పోరాటాల్ని తక్కువ చూపించటమో, విస్మరించటమో జరిగింది. చరిత్ర ని సరిగ్గా చూపించటమే కాకుండా దాన్నుంచి ప్రతి భారతీయుడు ప్రేరణ పొందేలా వుండాలి. ఇక సాంస్కృతికంగా  చూస్తే మనకున్న వారసత్వం బహుకొద్ది దేశాలకు మాత్రమే వుంది. మనదేశం లో జన్మించిన బౌద్ధం విశ్వవ్యాప్తం చెందింది. అయినా  ఆ వారసత్వ సంపదని ప్రపంచానికి చెప్పటం లో , వాళ్ళను మనదేశానికి రప్పించటం లో చేయాల్సింది ఎంతో వుంది. ప్రతిదేశానికి వాళ్ళ జాతీయ వాదమే వాళ్ళ బలం. ఏ పురాతన వారసత్వం లేకపోయినా అమెరికా తన జాతీయ వాదాన్ని బలంగా ప్రజల మనస్సులో నాట గలిగింది. కమ్యూనిస్టు దేశమైన చైనా ఈరోజు ఇంత  బలంగా ఉండటానికి ఓ కారణం వారి జాతీయవాదం. మరి ఎంతో చారిత్రక, సాంస్కృతిక వారసత్వం గల భారత్ ఇటీవలిదాకా దాన్ని ఉపయోగించుకొని దేశాన్ని బలోపేతం చేయటం లో ఎంతో వెనక బడింది. ఇదికూడా ఓ చారిత్రక తప్పిదమే.
  9. కొన్ని తప్పుడు పోకడలు : చివరగా చెప్పాల్సివస్తే భారత్ లో రెండు విషయాలు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఒకటి అవినీతి విలయతాండవం చేయటం. ప్రపంచం లోని ఎక్కువ అవినీతికర దేశాల్లో భారత్ వుండటం సిగ్గుచేటు. దీనికి బీజాలు మొదట్లోనే పడ్డాయి. అధికారం లో ఎక్కువ కాలం వున్న పార్టీ రాజకీయ నాయకత్వం మొదట్నుంచీ అవినీతి విషయం లో చూసి చూడనట్లు ఉండటమే ప్రధాన కారణం. అప్పుడే కనుక కఠిన చర్యలు తీసుకొని వుండివుంటే మిగతావారికి ఓ హెచ్చరికగా వుండేది. కానీ అందులో ఉదాసీనత తో వ్యవహరించటం తో సమాజం మొత్తం కలుషితమై ఇప్పుడు నీతి, నిజాయితీలు కాగడా వేసి వెదికినా కనబడకుండా అయిపోయాయి. ఇప్పుడు ఏ పార్టీ ఇందుకు అతీతం కాదు. కాకపోతే కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ మాత్రమే.  అలాగే రెండోది వారసత్వ రాజకీయాలు. ఇందుకూ ప్రధాన కారణం గ్రాండ్ ఓల్డ్ పార్టీ బాధ్యత వహించక తప్పదు. ఎందుకంటే ఆ పార్టీ వునికే ప్రస్తుతం దానిపై ఆధారపడివుంది. ఇది ప్రజాస్వామ్యం బలహీనపడటానికి దారితీస్తుంది. ఇది దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలలో వుంది.  ఆధునిక ప్రజాస్వామ్యం మనుగడ కు  ఈ పోకడలు అడ్డంకులని  ప్రజలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా ప్రజాస్వామ్యం బలపడుతుంది.ఇవి సంపూర్ణమని అనుకోవటం లేదు. స్థూలంగా లాక్ డౌన్ లో కూర్చొని ఆలోచిస్తుంటే అప్పుడి కప్పుడు మనసుకి తట్టినవి మీ ముందుంచు తున్నాను. ఇలాంటి ఆలోచనలు ఇంకా చాలా మంది దగ్గర వుంటాయి. అవన్నీ ఒకరి కొకరు పంచుకుంటే  మన ప్రజాస్వామ్యం బలపడుతుంది. మరి ఇన్ని చారిత్రక తప్పిదాలున్నా భారత్ అప్రతిహతంగా ముందుకు సాగుతుందంటే ఈ తప్పిదాలే లేకుంటే ఇంకెంత అద్భుతంగా మన ప్రగతి ఉండేదో ఆలోచించండి. ఇప్పటికైనా మనకున్న పెద్ద సంపద మన ప్రజాస్వామ్యమే. భావ స్వేచ్చ, వాక్స్వాతంత్రం , సహన భావం , సౌహార్ద్రత లే మనల్ని , మనదేశాన్ని కాపాడుతాయని బలంగా విశ్వసిస్తున్నా.సమయం ఈ ఆలోచలని కూడా తనలో ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతూనే వుంది. చరిత్ర నడుస్తూనే వుంటుంది. అందులో మనం సూత్రదారులం కాదు పాత్రధారులం మాత్రమే .