
కరోనా కారణంగా.. లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరికి ఎటునుండి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. గత 50 రోజులనుండి ఇంట్లో ఉన్నవారందరు కూర్చొని తినడమే తప్ప, ఎటునుంచి రూపాయి ఆదాయం ఏమిలేకుండా పోయింది. దీంతో రాజధాని లో ఇంటి యజమానులకు, అద్దెకు ఉంటున్న వారికి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
తాజాగా ఈ విషయంపై 8 మంది ఇంటి యజమానులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో అద్దె చెల్లించాలని కిరాయిదారులను ఒత్తిడి చేయవద్దని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని ముఖర్జీనగర్ లో విద్యార్థులు అద్దెఇళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. తమను అద్దె ఇవ్వాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు చేసిన ఫిర్యాదుల మేర తాము 8మంది ఇంటియజమానులపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇంటి యజమానులకు నెలరోజుల పాటు జైలు శిక్ష లేదా రూ.200 ల జరిమానా లేదా రెండూ విధించవచ్చని పోలీసులు చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల నుంచి అద్దె డిమాండుపై ఫిర్యాదులు రావడంతో తాము కేసులు నమోదు చేశామని డీసీపీ విజయంత ఆర్యా చెప్పారు.
తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ విధమైన గొడవలు బాగానే జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైద్రాబాద్ ప్రాంతాలలో వసతి గృహాలలో ఉంటున్నవారికి యజమానుల నుండి, అద్దెలకు ఉంటున్నవారికి ఇంటి యజమానుల నుండి అద్దె కట్టమని తీవ్రమైన వత్తిడులు వస్తున్నాయి.విద్యార్థులు, అద్దె కి ఉంటున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇంటి అద్దెలు ఇప్పట్లో వసూలు చేయవద్దని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది.