
రెండో రోజు మన తెలుగింటి కోడలు నిర్మలమ్మ మరికొన్ని వర్గాలకు, రంగాలకు వరాలు ప్రకటించారు. ఈరోజు అత్యంత పేద వర్గాలకు ఉపశమన చర్యలు ప్రకటించింది. నిన్న ప్రధానంగా సప్లై సైడ్ దృష్టి సారిస్తే ఈరోజు డిమాండ్ సైడ్ దృష్టి పెట్టింది. నిన్న ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి లో 35 శాతం , ఎగుమతుల్లో మూడింట ఒక వంతు ఉండటంతో ముందు దానిపై దృష్టి సారించారు. ఈ రోజు అత్యంత పేద వర్గాలు పడుతున్న కష్టాల మొర కొంతమేర ఆలకించింది. నిన్న ప్రధానంగా ద్రవ్య లభ్యతపై కేంద్రీకరించగా ఈ రోజు ఉపశమన చర్యలపై కేంద్రీకరించింది. ముఖ్యంగా వలస కార్మికులు, చిరు వ్యాపారస్తులు, స్ట్రీట్ వెండర్స్, అలాగే చిన్న, సన్నకారు రైతులు ఈ ఉపశమనం పొందిన వారిలో వున్నారు. మధ్యతరగతికి సంబంధించి గృహ రుణాల్లో వడ్డీ సబ్సిడీ పై నిర్దిష్ట ఉపశమన చేసింది. అవేమిటో స్థూలంగా చూద్దాం.
వలస కార్మికులు
• ఉచిత ఆహార రేషన్ పధకాన్ని ఇంకో రెండు నెలలు పొడిగించారు .
• రేషన్ కార్డులు లేని వాళ్లకు కూడా ఉచిత రేషన్ ఇస్తారు.
• దీనికింద 8 కోట్ల వలస కార్మికులు ప్రయోజనం పొందుతారు.
• షుమారు 3500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు.
జాతీయ పోర్టల్ ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తారు. దీనికింద ఆగష్టు 31 వ తేదీ లోపల 83 శాతం అంటే 67 కోట్ల మంది ని తీసుకొస్తారు. మార్చి 2021 లోపల 100 శాతం మందిని ఇందులోకి తీసుకొస్తారు. అంటే రేషన్ కార్డు వున్న వాళ్ళు దేశం లో ఎక్కడ వున్నా అక్కడ రేషన్ షాప్ లో తీసుకోవచ్చు. ఇది ప్రధానంగా వలస కార్మికులకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఒక దేశం, ఒక రేషన్ పదకంగా పిలుస్తున్నారు.
వలస కార్మికుల కోసం ఇంకో పెద్ద పధకాన్ని ప్రకటించారు. అదేమిటంటే చౌక అద్దెకి వసతి కల్పించటం. ప్రస్తుతం వలస కార్మికులు తాత్కాలిక వసతి (ఎక్కువభాగం రేకుల షెడ్లు) లో ఉంటూ నానా ఇబ్బంది పడుతున్నారు. వీరి కోసం వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తారు. కొన్ని ప్రభుత్వం, కొన్ని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ,మరికొన్ని యజమానుల చొరవతో నిర్మించ నున్నారు. ఇది కనుక అమలయితే వలస కార్మికులకు పెద్ద ఉపశమనమే.
చిన్న ముద్ర రుణ దారులకు
• 50 వేల రూపాయలు లోపు తీసుకున్న ముద్ర రుణ గ్రహీతలకు ఇంకో 12 నెలలు 2 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తారు.
• దీనివలన 1.62 లక్షల కోట్ల రుణాలకు 3 కోట్లమందికి లబ్ది చేకూరుతుంది.
• దీనికి ప్రభుత్వానికి 1500 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.
వీధి వ్యాపారస్తులు
• మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ ని కేంద్ర పధకాల పరిధి లోకి తీసుకొచ్చింది.
• దీనిద్వారా 50 లక్షల మంది కి 5 వేల కోట్ల రూపాయలతో ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు చొప్పున రుణ సదుపాయం కల్పిస్తారు.
• తిరిగి వ్యాపారం చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.
చౌకగా గృహ రుణాలు
• దిగువ మధ్య తరగతి వర్గానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మార్చి 2020 వరకు గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ ఇస్తుంది. దీనికింద 3.3 లక్షల మంది లబ్ది పొందారు.
• ఈ పధకాన్ని ఇప్పుడు మార్చి 2021 వరకు పొడిగించారు. దీనివలన అదనంగా 2.5 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని అంచనా.
• దీనివలన ప్రభుత్వానికి 70 వేల కోట్లు భారం పడుతుంది.
• ఈ ప్రోత్సాహకం ద్వారా గృహ నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ లాంటి అనేక రంగాలకు ఊతం దొరుకుతుంది.
చిన్న , సన్నకారు రైతులకు
• ఇప్పటికే ఇచ్చిన 30 వేల కోట్లకు అదనంగా మరో ౩౦ వేల కోట్ల రూపాయలు అత్యవసర వర్కింగ్ కాపిటల్ కింద నాబార్డ్ కి ప్రభుత్వం ఇస్తుంది. ఇది చిన్న, సన్నకారు రైతులకి సహాయపడుతుంది.
• అదనంగా 2.5 కోట్లమందికి కిసాన్ క్రెడిట్ కార్డ్ సదుపాయం కల్పిస్తుంది. 2 లక్షల కోట్ల చౌక రుణ సదుపాయం దీని ద్వారా కలుగుతుంది.
• ఈ సదుపాయం మత్స్యకారులకు, డైరీ ( పాల ) రంగానికి కూడా విస్తరించారు.
ఆదివాసులకు
• రాష్ట్ర ప్రభుత్వాలు కంపా నిధుల కింద 6 వేల కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించాయి. వాటిని 10 రోజుల్లో అనుమతిస్తారు. దీనివలన అటవీకరణ తో పాటు ఆదివాసులకు ఉపాధి దొరుకుతుంది.
• ఇవీ రెండో రోజు ప్రకటించిన ఉద్దీపనా చర్యలు. దీనితో పాటు ఇప్పటికే ప్రభుత్వం ఈ రెండు నెలల్లో తీసుకున్న అనేక కార్యక్రమాలను కూడా వివరించింది. అందులో ముఖ్యమయినది వలస కార్మికుల కోసం ఇప్పటికే ఇచ్చిన 11 వేల కోట్ల రూపాయలు కూడా వున్నాయి. ఇప్పటివరకూ వలస కార్మికులకు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఎక్కువ భాగం కేంద్రం నుంచే నిధులు అందుతున్నట్లు దీన్నిబట్టి అర్ధమవుతుంది. అలాగే కేంద్రం దగ్గర పడివున్న కంపా నిధులు ఖర్చు చేయటం కోసం కేవలం 6 వేల కోట్ల ప్రతిపాదనలే కేంద్రం దగ్గర పెండింగ్ లో వుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వున్న నిధుల్ని రాష్ట్రాలు వాడుకోలేకపోవటం దురదృష్టం. ఇప్పటికైనా ఎక్కువ ప్రతిపాదనలు రాష్ట్రాలు కేంద్రానికి పంపించి నిధులు వాడుకుంటాయని ఆశిద్దాం.
• ఇప్పటివరకూ ఈ రెండు రోజుల్లో ప్రకటించిన పధకాలు , ఉద్దీపనా చర్యలు ప్రజలకు వుత్తేజానిస్తున్నాయి. అనుకున్నదానికన్నా ఆలస్యమయినా ప్రభుత్వ పధకాలు కింది ప్రజల్ని దృష్టి లో పెట్టుకొని తయారుచేయటం ఆహ్వానించదగ్గది. ఇక రేపు ఏమి వస్తాయో వేచి చూద్దాం.