ఆ మూడు జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు!

తెలంగాణలో మూడు జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి,నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాబ్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల, నిర్మల్ ఉన్నాయి.
తెలంగాణలో కొత్త కరోనా కేసులు కాస్త తగ్గాయి. బుధవారం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం మరో ఇద్దరు బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ఇద్దరు చనిపోయారు. ఇవాళ GHMC పరిధిలో 15, మరో 12 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 89 మంది వలస కార్మికులు కరోనా బారినపడ్డారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1661 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,013 మంది కోలుకోగా.. 40 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 608 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
‘రంగుల’ కేసులో తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు..!

రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వేసిన అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటీషనర్, ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కమీటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 623ను జారీ వీహెసింది. ఈ జీఓలో అవే రంగులు ఉండటంతో జీఓను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ జెండాలోని మూడు రంగులతో పాటు మట్టి రంగు ఒక్కటే చేర్చి అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
జీవో నంబర్ 623 ప్రకారం పంచాయితీ కార్యాలయాలకి రంగులు వేయాలని ఏపీ సర్కారు పేర్కొందని, మళ్లీ ప్రభుత్వ భవనాలపై వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయని పిటిషనర్ తరుపు వాదనలు వినిపించిన న్యాయవాది సోమయాజులు తెలిపారు. గతంలో విచారణలో భాగంగా హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జీఓ పేరుతో అవే రంగులు వేయమని ఆదేశాలు ఇవ్వడం కోర్టు ధిక్కారంగా ఎందుకు భావించకూడదు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో ఈ కేసులో ఎటువంటి తీర్పు వస్తోందోననే ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర ప్యాకేజీ పై కెసిఆర్ కు ఎందుకంత కోపం?

కెసిఆర్ ఏది చేసినా వెనక రాజకీయ పరమార్ధం వుంటుంది. నిన్నటిదాకా మోడీ పై అభిమానం ఒలకపోసిన కెసిఆర్ కి అంత సడన్ గా కోపమెందుకు వచ్చింది? కరోనా మహమ్మారి మొదలైన తర్వాత ప్రెస్ మీటుల్లో మోడీ తోటి అన్నిసార్లు మాట్లాడాను, ఇన్ని సార్లు మాట్లాడాను, ఇలా సలహాలిచ్చాను అని చెప్పే వ్యక్తి ఒక్కసారి ఈ ప్యాకేజీ బోగస్, మేమన్నా బిచ్చగాల్ల మనుకుంటున్నాడా అని మాట్లాడటం వెనక ఏదో రాజకీయకోణం వుండి వుండాలి. మాములుగా అయితే అసలు రాష్ట్రాల రుణ పరిమితి 3 శాతం నుంచి 5 శాతానికి పెంచటానికి నే నిచ్చిన సలహానే అని గొప్పలు చేసుకోవాలి. కానీ సీను రివర్స్ అయ్యింది. దానికి కారణమేమిటో పరిశీలిద్దాం.
ప్యాకేజీలో వివాదాస్పద అంశాలు
విద్యుత్తు సంస్కరణలు : దీనికి ముందే విద్యుత్తు సవరణ బిల్లు ముసాయిదాను రాష్ట్రాలకు పంపటం జరిగింది. మాములుగా అయితే నిధుల కొరతతో సతమతమవుతున్న టైం లో 90 వేల కోట్ల రుణ సదుపాయం పంపిణీ సంస్థలకు కల్పించటాన్ని హర్షించాలి. కానీ దానికి పెట్టిన షరతులు, ముసాయిదా లో పొందుపరిచిన విషయాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు విద్యుత్తు పంపిణీ సంస్థల వ్యవహారం లో తన ఇష్టా రాజ్యంగా నడుస్తుంది. ఈ బిల్లు కనక ఆమోదం పొందితే ఆ పప్పులుడకవు. విద్యుత్తు టారిఫ్ యూనిఫారం గా అన్ని రంగాలకు వర్తించాలి. అంటే ఇప్పటిలాగా పారిశ్రామిక రంగానికి, వాణిజ్య రంగానికి ఎక్కువ వసూలు చేయ కూడదు. అదే సమయం లో నివాస సముదాయాలకు , వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వాలంటే ఆ డబ్బు నేరుగా ఇవ్వాలి. అది వంట గ్యాస్ లాగా నేరుగా ప్రజల ఖాతా లోకి జమ చేయాలి. తేడా అల్లా వంట గ్యాస్ రాయితీ గ్యాస్ కంపనీలు ఇస్తాయి , విద్యుత్తు రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇక్కడే వచ్చిన చిక్కల్లా. ఇప్పటివరకు సబ్సిడీ మొత్తం పంపిణీ సంస్థలకు చెల్లించకుండా వాయిదాల పద్దతిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వటం ఇకనుంచి కుదరదు. ఎప్పటికప్పుడు డబ్బులు కట్టాల్సి వస్తుంది. అది ఖజానా పై భారం పడుతుంది. అంటే పంపిణీ సంస్థల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి అవసరమయితే తక్కువ ధరకు విద్యుత్తు ని అందించే వీలు కలుగుతుంది. అదివరకటి లాగా ఉచితాలు, రాయితీలు ఇష్టారాజ్యంగా ఇవ్వటానికి కుదరదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ని బట్టి అవి అందించాల్సి వుంటుంది. రెండోది, నియామకాలు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యాన జరుగుతాయి, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టారాజ్యంగా జరగవు. మూడోది, విద్యుత్తు కాంట్రాక్టులు ఎప్పుడుబడితే అప్పుడు రద్దు చేసుకోవటం జరగదు. ఇవన్నీ అమలయితే కెసిఆర్ విద్యుత్తు రంగం పై అదివరకటి పట్టు కోల్పోయి నిబంధనల ప్రకారం విద్యుత్తు పంపిణీ సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. అది కెసిఆర్ కి ఇష్టం లేదు. తన అజమాయిషీ పోతుందని భావిస్తున్నాడు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ సంస్కరణలు : ప్యాకేజి లో ప్రకటించిన ఇంకో ప్రధాన సంస్కరణ వ్యవసాయరంగం. ఇప్పటివరకు కాలం చెల్లిన 1955 నిత్యావసరాల చట్టం, 1960 లలో ఏర్పడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాలతో ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యం లో వుంటాయి. ఇందులో తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టటం తో పాటు, రైతుల ఉత్పత్తులపై పూర్తి అజమాయిషీ తో వాటి అమ్మకాలపై సెస్సు వేస్తూ వున్నాయి. ఈ మార్కెట్ కమిటీల్లో లైసెన్స్ వున్న వ్యాపారస్తులు కుమ్మక్కయ్యి రైతుకి గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారు. 2017 సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు, జంతుసంపద మార్కెటింగ్ పేరుతో ఓ నమూనా చట్టాన్ని తీసుకొచ్చింది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ పంధాలో సంస్కరణలను తీసుకొచ్చాయి. ఎప్పటినుంచో కేంద్రం దీనిపై రాష్ట్రాలను ఒప్పించటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ కరోనా మహమ్మారి నేపధ్యంలో ఈ పరిధిని విస్తృతం చేసింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా మార్కెట్ సంస్థలు స్థాపించుకోవచ్చు. దీనితో మరిన్ని పెట్టుబడులు ఇందులోకి రావటమే కాకుండా రైతులకు మార్కెట్ లో మరింత ఛాయిస్ వుంటుంది. ఉత్పత్తి ని మార్కెట్టుకి తరలించకుండా , ఇంటిదగ్గరనుంచే అమ్ముకోవచ్చు. అలాగే దేశం లో ఎక్కడికైనా తన ఉత్పత్తిని తరలించుకోవచ్చు. సెస్సులు చెల్లించాల్సిన పనిలేదు. ఈ సంస్కరణలు అమలయితే వ్యవసాయ మార్కెట్ కమిటీల గుత్తాధిపత్యం బద్దలవుతుంది. రైతుకి మెరుగైన గిట్టుబాటు ధర , మార్కెట్ లో వినిమయదారుడికి మరింత చౌకగా లభ్యమయ్యే అవకాశముంది. అంటే మార్కెట్ లో పంట లభ్యత ని బట్టి పోటీ వుంటుంది. పోటీ ఎప్పుడూ అటు రైతు కి ఇటు వినిమయదారుడికి ఉపయోగపడుతుంది. ఇదో పెద్ద వ్యవసాయ సంస్కరణ. కానీ దీనితో ప్రభుత్వ గుత్తాధిపత్యం తగ్గుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడుతున్నట్లు లేదు.
రాష్ట్రాల రుణ పరిమితి పెంపు: కెసిఆర్ ఇంతకుముందు రాష్ట్రాల రుణ పరిమితిని రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో 3 శాతం నుంచి 5 శాతానికి పరిమితిని పెంచమని కోరటం జరిగింది. అదే ఇప్పుడు కేంద్ర చేస్తే గగ్గోలు పెట్టటం జరుగుతుంది. అసలు కేంద్రం పెట్టిన షరతులు అంత ఇబ్బంది పెట్టేవి ఏమున్నాయి? ఒక దేశం, ఒక రేషన్ కార్దు అమలు, వాణిజ్య సులభతర విధానం, విద్యుత్తు పంపిణీ పనివిధానం మెరుగుదల, పట్టణ స్థానిక సంస్థల వనరుల సేకరణ. ఇందులో అంతగా అభ్యంతరం పెట్టాల్సిన అంశాలేమిటో అర్ధం కావటం లేదు. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాలు సంస్కరణల్లో ముందున్నాయి. కాబట్టి సమస్య పెద్దగా వుండదు. చిన్న చిన్న అంశాల్లో దృష్టి సారించగలిగితే ఇవి అమలుచేయటం పెద్ద కష్టం కాదు. ఇవి ప్రతిపాదించింది ఫైనాన్సు కమీషన్ , దీనివలన దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా ఆర్ధిక క్రమశిక్షణ వస్తుంది.
ఇవీ ప్రధాన వివాదాస్పద అంశాలు . కానీ కెసిఆర్ ఏమి చేసినా దానివెనక రాజకీయ పరమార్ధం వుంటుంది. రాష్ట్రం లో మెల్లి మెల్లిగా తెరాస కి ప్రత్యర్ధి గా బిజెపి ఎదుగుతుందనే భయం లోలోపల కెసిఆర్ ని వెంటాడుతుందని అనిపిస్తుంది. ఇటీవల పోతిరెడ్డిపాడు విషయమే తీసుకుందాం. ఆంధ్ర ప్రభుత్వం పోతిరెడ్డుపాడు పై టెండర్లు పిలవటం అంశాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర జల విద్యుత్తు మంత్రి దృష్టి కి తీసుకెళ్లటం , ఆయన వెంటనే కృష్ణా బోర్డుకి చెప్పటం , అదే విషయాన్ని తిరిగి బండి సంజయ్ కుమార్ కి లేఖ ద్వారా తెలపటం చక చకా జరిగిపోయాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి మాట చెల్లుబాటు అయ్యిందన్నమాట. ఇది కెసిఆర్ లాంటి వ్యక్తి కి మింగుడుపడటం అయ్యేపని కాదు. అందుకే ఇంతకోపమని అనుకుంటున్నారు. ఈ రాష్ట్రం లో తన మాటే చెల్లాలి. ఇంకొకరు ఎవరూ ఎదగటాన్ని కెసిఆర్ తట్టుకోలేడు. అసలు రాష్ట్రం లో రాజకీయంగా తనని సవాలు చేసే వ్యక్తి , శక్తి వుండటం తన మనస్తత్వానికి గిట్టదు. అయితే తను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నీడలో ఈ బలహీనత ప్రజల ముందు పెద్దదిగా కనిపించటం లేదు. అదే ప్రస్తుతానికి తనని కాపాడుతుంది. అయితే పరిస్థితులు ముందు ముందు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేము. రాజకీయాల్లో నాలుగు సంవత్సరాలు చాలా పెద్ద కాలమే.
వలస కార్మికులను ఇళ్లకు పంపిస్తున్న తెలుగు హీరో

మే 20 తన బర్త్‌డేను పురస్కరించుకొని హీరో మనోజ్ మంచు ఒక సామాజిక కార్యక్రమాన్ని తలపెట్టారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడి వలస కార్మికులు అక్కడే ఆగిపోయారు. ఉపాధి లేక, స్వస్థలాలకు చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అలాంటి వారిని ఆదుకోవడానికి మనోజ్ ముందుకు వచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వలస కార్మికులు హైదరాబాద్‌లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న విషయం ఆయన దృష్టికి రావడంతో, వాళ్లను సొంత ఊళ్లకు తరలించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని మూసాపేట నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురిని రెండు బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపించారు. వాళ్లకు అవసరమైన ఆహారంతో పాటు మాస్క్‌లు, శానిటైజర్స్‌ను కూడా ఆయన అందజేశారు. ఆ కార్మికులు తమ ఇళ్లకు చేరేంతవరకు మార్గమధ్యంలో అవసరమైన సౌకర్యాలను మనోజ్ టీమ్ కల్పిస్తున్నారు. ఇదే విధంగా గురువారం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను హైదరాబాద్ నుంచి వారి ఊళ్లకు బస్సుల్లో పంపేందుకు మనోజ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
తీరంలో “ఆంఫన్” విజృంభణ!

బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రచండ తుఫాను ‘ఆంఫన్’ అతి తీవ్ర తుఫానుగా మారి పశ్చిమబెంగాల్ లో తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 2.30 గంటలకు తుపాను తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరాన్ని తాకే ప్రక్రియ సుమారు నాలుగు గంటల పాటు కొనసాగనుంది. ఆ సమయంలో బీభత్సంగా గాలులు వీస్తాయి. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో 160 కిలోమీటర్ల వేగం నుంచి 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఒక్కోసారి 190 కి.మీ వేగంతో కూడా గాలులు వీయవచ్చు. భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దమ్ దమ్ విమానాశ్రయం వద్ద 75 కి.మీ వేగంతో గాలులు వీచినట్టు వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ మొత్తం తీరాన్ని దాటడానికి సాయంత్రం 6.30 అవ్వొచ్చని అంచనా. అంఫాన్ తుఫాన్ కారణంగా సుమారు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, 12,078 షెల్టర్లలో ఉంచినట్టు బంగ్లాదేశ్ ప్రకటించింది.
ఏపీ వైపు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చూపు

రెండు నెలలకు పైగా లాక్ డౌన్ తో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆగిపోయింది. కుదేలైంది. ఇప్పుడు లాక్ డౌన్ మెల్లిమెల్లిగా సడలిస్తున్నా కూడా సినీ పరిశ్రమను తెరిచేరోజుపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే సామూహికంగా జనాలు గుమిగూడే థియేటర్స్ , మాల్స్, సినిమా షూటింగ్ లకు ప్రభుత్వం ఇప్పట్లో అనుమతులు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టిప్లెక్సెస్ మూతపడ్డాయి. దీంతో ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేక జీవనం కష్టంగా మారింది. అయితే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం ఈ మధ్య కొన్ని రంగాలకు కాస్త మినహాయింపులు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు అటు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరికొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.
*సినీ పరిశ్రమకు జగన్ గుడ్ న్యూస్
కరోనా లాక్ డౌన్ తో అన్నింటికంటే ఎక్కువగా దెబ్బపడింది సినిమా రంగంపైనే.. సినిమాలు ఆగిపోయాయి.. సీరియళ్లు నిలిచిపోయాయి. షూటింగ్ లు అన్నీ బంద్ అయిపోయాయి. సామూహికంగా చూసే థియేటర్స్ మూతపడ్డాయి. ఇప్పుడు దేశమంతా ఓపెన్ అయిన వేళ సినిమాలు, సీరియళ్లు, వాటి షూటింగులకు మాత్రం పలు రాష్ట్రాలు అనుమతులు ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ పరిశ్రమ అంతా నెలవై ఉన్న తెలంగాణలో వాటికి అనుమతి లేదు. అయితే ఏపీ సీఎం జగన్ ఈ విషయంలో ఎంతో పెద్ద ఉదార నిర్ణయం తీసుకొని సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్ చెప్పారు.
*గడ్డు స్థితిలో సినీ కళాకారులు, కార్మికులు
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్స్ ఓపెన్ అవుతాయని.. షూటింగ్స్ మళ్లీ మొదలుపెట్టుకోవచ్చని టాలీవుడ్ సినీ పరిశ్రమ గంపెడాశలు పెట్టుకుంది. కానీ ఎంటర్టైన్మెంట్ లో ముఖ్యపాత్ర పోషిస్తున్న సినిమాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గని నేపథ్యంలో థియేటర్లు తెరిస్తే సమస్య తీవ్రమవుతుందని.. ప్రజలు కూడా థియేటర్లకు వచ్చే ఆలోచన చేస్తారని అనుకోవటం లేదని.. అందుకే కనీసం మరో మూడు నాలుగు నెలల పాటు థియేటర్లు తెరిచే ఉద్దేశం లేదని ఖరాఖండీగా తేల్చేశారు. దీంతో పరిస్థితులు చక్కబడితే షూటింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చన్న వారు షాక్ కి గురయ్యారు.
*ఏపీలో షూటింగ్ లకు జగన్ పచ్చజెండా
ఇదిలా ఉండగా ఇప్పుడు లేటెస్టుగా ఏపీలో సినిమా షూటింగ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసిందని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమాల షూటింగ్ లతో పాటు సీరియల్ షూటింగ్స్ కూడా చేసుకోవచ్చునని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొందట. దీంతో ఆగిపోయిన సినిమాలు, సీరియళ్ల షూటింగ్ లు మొదలు పెట్టే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే టీవీ చానెల్స్ లో పాత ప్రోగ్రామ్స్ చూడలేక ఖాళీగా ఉంటున్న జనం చస్తున్నారు. దీంతో ఇవి షూటింగ్ లు మొదలైతే టీవీలకు కళ వస్తుంది. అందుకే రిస్క్ అయిన కూడా ఏపీలో షూటింగ్ లకు వెళ్లాలని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న సినీ పరిశ్రమకు ఏపీ సీఎం జగన్ నిర్ణయం కాస్త ఊరట లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ఏపీలో షూటింగ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేయడం నిజమైతే తెలంగాణాలో సినిమా మరియు సీరియల్స్ షూటింగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుటుందనేది ఆసక్తిగా మారింది.
*ఏపీకి సినీ ఇండస్ట్రీ తరలిపోతుందా?
సినిమా ఇండస్ట్రీపై బతుకుతున్న ఎంతో మంది నటులు, కార్మికులకు సీఎం జగన్ దారి చూపించారని.. ఈ నిర్ణయం సినీ పరిశ్రమ ను నిలబెడుతుందని టాలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో అనుమతి ఇవ్వకపోవడంతో తెలుగు సినిమా పరిశ్రమ, టీవీ ఇండస్ట్రీ ఏపీకి తరలిపోవడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. అక్కడే షూటింగ్ లు జరుపుకోవడానికి సిద్ధమైంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో క్రమంగా షూటింగ్ లకు ఏపీ స్వర్గధామమై.. తెలంగాణకు ఇది పెద్ద మైనస్ గా మారే చాన్స్ ఉందంటున్నారు.
-నరేశ్ ఎన్నం
చంద్రబాబు, లోకేష్ కదిలిరావాల్సిందేనా?

ఇన్నాళ్లు కరోనా-లాక్ డౌన్ నిబంధనలు స్టిక్ట్ గా ఉండడంతో తెలంగాణలోని హైదరాబాద్ లో సొంతింటిని వీడి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లలేకపోయిన చంద్రబాబు ఇక తెలంగాణను వీడే సమయం వచ్చింది. ఎల్లో మీడియా సహకారంతో ఏపీలో లేకున్నా వార్తల్లో నిలుస్తూ హైదరాబాద్ నుంచి చక్రం తిప్పిన బాబు ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సీఎం జగన్ అన్నింటికి సడలింపులు ఇవ్వడం.. సాధారణ స్థితికి ఏపీ చేరుకోవడం.. రేపటి నుంచి బస్సులు కూడా ఏపీలో ప్రారంభిస్తుండడంతో చంద్రబాబు ఇక ఏపీలో అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది..
*చంద్రబాబుకు దూరంగా తెలుగుతమ్ముళ్లు
10, 20, 30రోజులు.. రెండు నెలలు కావొస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబును డైరెక్టుగా, టీవీల్లో చూడలేక తెలుగు తమ్ముళ్లు, ఆంధ్రులు తెగ బాధపడిపోతున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 71 ఏళ్ల చంద్రబాబు ఎలా ఉన్నాడు? పక్క రాష్ట్రంలో ఏం తింటున్నాడు. కరోనాకు భయపడి ఆంధ్రాకు రాడా అని ఇన్నాళ్లు తెగ బాధపడ్డారు. కానీ ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. చంద్రబాబు ఏపీలో అడుగుపెట్టే తరుణం ఆవిష్కృతం కాబోతోంది. చంద్రబాబు రాక కోసం తెలుగు తమ్ముళ్లు అంతా కాచుకు కూర్చున్నాయి. వెలవెలబోయిన టీడీపీ రాజకీయం ఇక బాబు రాకతో స్పీడందుకోనుంది.
*అన్నింటిని తెరిచేసిన జగన్
ఏపీ సీఎం జగన్ నిన్నటి విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నింటికి రిలాక్స్ ఇచ్చాడు. బస్సులు మొదలు దుకాణాలు, వ్యాపారాలు, వాణిజ్యాలు, పరిశ్రమలు అన్నింటిని తెరిచి పనులు చేసుకోవచ్చని అభయం ఇచ్చారు. దీంతో కరోనా-లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఇన్నాళ్లకు ఏపీలో మళ్లీ సాధారణ పరిస్థితి ఏర్పడబోతోంది. దీంతో ఇప్పుడు కూడా చంద్రబాబు రాకపోతే టీడీపీకి రాజకీయంగా గడ్డు కాలం. పైగా జగన్ విచ్చలవిడిగా లాక్ డౌన్ సడలిస్తూ కరోనా వ్యాప్తి చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పక్కరాష్ట్రంలో ఉండే వాయిస్ వినిపిస్తే అది జనాల్లోకి ఎక్కదు. సో ఏపీలోకి ఎంట్రీ ఇచ్చి జగన్ పై విరుచుకుపడేలా చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.
*చంద్రబాబు ఏపీకి రావడమే తరువాయి..
ఏపీలో అన్ని తెరిచాక.. అంతా ఓపెన్ చేశాక ఇక చంద్రబాబు కూడా ఎందుకు ఆగుతాడు అని తెలుగు తమ్ముళ్లు ధీమాగా చెబుతున్నారు. ఇన్నాళ్లు పక్కరాష్ట్రం నుంచి ఏపీలోకి అడుగుపెడితే 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉంచింది ఏపీ సర్కార్. చంద్రబాబు వచ్చినా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు సూచించారు కూడా. దీంతో ఇప్పటిదాకా రాజకీయంగా ఇబ్బందులు.. ఎందుకు రిస్క్ తీసుకోవాలని మిన్నకుండిన బాబు.. ఇప్పుడు ఏపీలో అంతా సాధారణ పరిస్థితి నెలకొనడంతో ఏపీ బాట పడుతున్నారు. లాక్ డౌన్ భారీ మినహాయింపులు నేపథ్యంలో సాధారణ జనజీవనం ఏర్పడ్డ తరుణంలో చంద్రబాబు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోయే సమయం ఆసన్నమైంది.. ఆయనతోపాటు లోకేష్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ తండ్రీ కొడుకుల రాకకోసం తెలుగు తమ్ముళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
-నరేశ్ ఎన్నం
డబుల్ బెడ్ రూం ఇండ్లపై కేటిఆర్ గుడ్ న్యూస్!

తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, పెండింగ్ లో ఉన్న అన్ని ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లపై ఈ రోజు ఆయన సమీక్ష నిర్వహించారు. సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో చాలా చోట్ల 80 శాతానికి పైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేశామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పురపాలక, హౌసింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు.
రవాణాశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు!

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ రోజు ఖమ్మం బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాక్ డౌన్ సడలింపులు, ప్రజారవాణా ప్రారంభమైన నేపథ్యంలో ప్రయాణికుల కొరకు అధికారులు ఏర్పాట్ల విషయమై ఆయన ఈ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బస్సుల వివరాలు, ప్రయాణికులకు అందిస్తున్న సాకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి డిపోలో కండక్టర్ కు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్ ఇవ్వాలని.. బస్సులో ప్రయాణికులకు హ్యాండ్ శానిటైజ్ చేసిన తర్వాతే టికెట్ ఇవ్వాలని సూచించారు. మాస్కులు ధరించని ప్రయాణికులకు టికెట్ ఇవ్వవద్దని ఆదేశించారు.
కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని ప్రతి బస్సుకు విధిగా శానిటైజర్ అందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనలను అతిక్రమించే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామనిమంత్రి హెచ్చరించారు.
రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు..!

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. చట్ట ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీలులేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 48.13 శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ సుప్రీంకోర్టులో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‍పై జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. 1992లో ఇంద్రసహాని కేసులో ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం మించవచ్చన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరిన పిటిషనర్ రామ్మోహన్‍నాయుడు కోరారు. ఇందుకు కోర్టు నిరాకరించింది. టీడీపీ నాయకులు రామ్మోహన్ నాయుడు, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాసలు సహా పలువురు నేతలు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపినా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడాదని తీర్పు వెలువరించింది. తాజాగా మరోసారి ఈ తీర్పును జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతం చేరుకోవడంతో రాజ్యాంగ విరుద్ధంగా మారింది. ఎస్టీలకు 5.73 శాతం, ఎస్సిలకు 20.46 శాతం రిజర్వేషన్లు ఉండగా 50 శాతంలోపు ఉన్న మిగిలిన మొత్తాన్ని బీసీలకు కేటాయిస్తున్నారు. గతంలో హైకోర్టు ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.
మెగా హీరో డెబ్ల్యూ మూవీపై క్లారిటీ వచ్చేసింది..!

మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘ఉప్పెన’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడగా, షూటింగులు వాయిదాపడ్డాయి. రెండు నెలలుగా థియేటర్లు మూతపడటంతో కొన్ని సినిమాలు ఓటీటీ ఫాట్ ఫామ్స్ లో రిలీజవుతున్నాయి. దీంతో వైష్ణవ్ తేజ్ డెబ్ల్యూ మూవీ కూడా ఓటీటీ రిలీజవుతుందనే ప్రచారం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో చిత్రబృందం దీనిపై క్లారిటీ ఇచ్చింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ మూవీ ఓటీటీ రిలీజ్ చేయడంలేదని ఖచ్చితం థియేటర్లలోనే రిలీజు కానుందని స్పష్టం చేశారు.
దేశంలో లాక్డౌన్ 4.0 మే 31వరకు కొనసాగనుంది. ఇప్పటికే కేంద్రం దాదాపుగా అన్ని పరిశ్రమలు, ప్రజారవాణాకు అనుమతించింది. ట్రైన్లు, విమాన సర్వీసులు, థియేటర్లు, షూటింగులు, మాల్స్, దేవాలయాలకు మాత్రమే సడలింపులు ఇవ్వలేదు. లాక్డౌన్ 4.0తర్వాత వీటికి కూడా అనుమతి లభించే అవకాశం మెరుగ్గా ఉంది. దీంతో మరో రెండు మూడు నెలల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం ఖాయంగా కన్పిస్తుంది. దీంతో నిర్మాతలు ఆగస్టులో సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ జూలైలో థియేటర్ల ఓపెన్ అయితే చిన్న సినిమాలను ముందుగా రిలీజు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
ఇప్పటికే ‘ఉప్పెన’ మూవీ రిలీజుకు సిద్ధంగా ఉంది. లాక్డౌన్ లేకుండా ఉంటే ఇప్పటికే థియేటర్లలో సందడి చేసేది. ఈ సినిమాకు సంబంధించి ఒక సెన్సాన్స్ ఒక్క బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా పూర్తి చేసుకొని ఆగస్టు 15న సినిమాను రిలీజు చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి ఓ ముఖ్య పాత్రలో నటించాడు. ఉప్పెన రిలీజ్ తేదీని చిత్రబృందం జూన్లో అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.
మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన!

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు మెదక్ జిల్లాలోని హవెలి ఘన్‌పూర్ మండలం సర్దన గ్రామంలో మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య పాలకుల కుట్రల వల్లే మంజీరాపై చెక్ డ్యామ్ నిర్మించడం సాధ్యం కాలేదని అన్నారు. మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణం కల త్వరలోనే నెరవేరనుందన్నారు. 12.50 కోట్ల రూపాయలతో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కేసీఆర్ రైతుబిడ్డ అయినందునే ఈ కల నేరవేరుతుందని హరీష్‌రావు తెలిపారు. మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయని వివరించారు. సర్దన వద్ద చెక్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్న హరీశ్ రావు… ఈ డ్యామ్ ఐదు గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంజీరా నదిపై దాదాపు 15 చెక్ డ్యామ్‌లు మంజూరు చేయించుకున్నామని హరీశ్ రావు గుర్తు చేశారు. మంజీరా నదిపై చెక్ డ్యామ్ లు నిర్మిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని… 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
పోతిరెడ్డిపాడుపై ఎన్జీటీలో ఏపీకి ఎదురుదెబ్బ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం రేపుతున్న పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విస్తరణకు సంబంధిచి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా రెండు రోజులుగా ఈ వివాదంపై ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం ఎత్తిపోతల విస్తరణ పనులపై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ విచారించి స్టే విధించింది.
ప్రాజెక్టు అధ్యయనానికి నాలుగు శాఖల సమన్వయంతో కేంద్ర కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్, కేంద్ర పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి, హైదరాబాద్ ఐఐటీ నిపుణులను సభ్యులుగా నియమించింది. రెండు నెలల్లో కమిటీ స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పింది.
తదుపరి ఆదేశాలిచ్చే వరకు పనులు చేయొద్దని ఏపీని ట్రిబ్యునల్ ఆదేశించింది. తెలంగాణలోని నారాయణ పేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. పోతిరెడ్డి పాడుతో తెలంగాణలో తాగు,సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషనర్ తెలిపారు.
ఈ స్టే రావడానికి ముందురోజే, మంగళవారం నాడు సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల వెంటనే ఆపేయాలని కృష్ణా నదీ యాజమన్యా బోర్డు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే నెల వరకు చేసిన కేటాయింపులను మించి వాడుకున్నారని, ఇక నీరు తీసుకోవడానికి వీల్లేదని పేర్కొంది. ఈమేరకు ఎపి జలవనరుల శాఖ ఈఎన్‌సికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం లేఖ రాశారు.
నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులను విధిగా పాటించాలని ఎపి ప్రభుత్వాన్ని బోర్డు ఆదేశించింది. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని సూచించింది. సాగర్ కుడి కాల్వకు 158.255 టిఎంసిల నీటిని కేటాయించగా ఎపి ఇప్పటికే 158.264 టిఎంసీల నీటిని వాడుకుందని తేల్చి చెప్పింది. హాంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 47.173 టిఎంసీల నీటిని కేటాయించగా, ఇప్పటివరకు 48.328 టిఎంసీల నీటిని వాడకున్నారని, ఇక నుంచి నీటి విడుదల ఆపేయాలని బోర్డు ఆదేశించింది.
వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై సీబీఐ విచారణ?

రాష్ట్రంలో వైసిపి ఎమ్మెల్యేల లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడటంపై పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికార పక్షం ఇరకాటంలో పడినట్లు అయింది. వీరిపై విచారణను సీబీఐకి నివేదించే అవకాశం ఉన్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటికే ఐదుగురు ఎమ్యెల్యేలపై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న కోర్ట్ ముందు తాజాగా మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు వచ్చింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన సమూహాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిలపై హైకోర్టులో న్యాయవాది ఇంద్రనీల్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై సీబీఐ విచారణ ఎందుకు ఆదేశించకూడదని ప్రశ్నించడం సంచలనం కలిగిస్తున్నది. లాక్‌డౌన్ నిబంధనలు ప్రజాప్రతినిధులుగా అమలుచేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే, లబ్ధిదారులతో ముఖాముఖిలో భాగంగా జరిగిందని ప్రభుత్వ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ప్రజాప్రతినిధులే నిబంధనలు పాటించలేదన్న హైకోర్టు, ప్రభుత్వం చర్యలు తీసుకోనప్పుడు సీబీఐ విచారణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది. ప్రభుత్వం తరపు వివరాలు అందజేసేందుకు ఏజీ సమయం కోరారు.
ఈ కేసులులో తదుపరి విచారణ వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది. ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ హైకోర్టులో ఫిటిషన్లు దాకలు కాగా, తాజా పిటిషన్‌తో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది.


















