
రాష్ట్రంలో వైసిపి ఎమ్మెల్యేల లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడటంపై పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికార పక్షం ఇరకాటంలో పడినట్లు అయింది. వీరిపై విచారణను సీబీఐకి నివేదించే అవకాశం ఉన్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటికే ఐదుగురు ఎమ్యెల్యేలపై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న కోర్ట్ ముందు తాజాగా మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు వచ్చింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన సమూహాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిలపై హైకోర్టులో న్యాయవాది ఇంద్రనీల్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై సీబీఐ విచారణ ఎందుకు ఆదేశించకూడదని ప్రశ్నించడం సంచలనం కలిగిస్తున్నది. లాక్‌డౌన్ నిబంధనలు ప్రజాప్రతినిధులుగా అమలుచేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే, లబ్ధిదారులతో ముఖాముఖిలో భాగంగా జరిగిందని ప్రభుత్వ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ప్రజాప్రతినిధులే నిబంధనలు పాటించలేదన్న హైకోర్టు, ప్రభుత్వం చర్యలు తీసుకోనప్పుడు సీబీఐ విచారణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది. ప్రభుత్వం తరపు వివరాలు అందజేసేందుకు ఏజీ సమయం కోరారు.
ఈ కేసులులో తదుపరి విచారణ వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది. ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ హైకోర్టులో ఫిటిషన్లు దాకలు కాగా, తాజా పిటిషన్‌తో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది.