
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం రేపుతున్న పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విస్తరణకు సంబంధిచి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా రెండు రోజులుగా ఈ వివాదంపై ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం ఎత్తిపోతల విస్తరణ పనులపై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ విచారించి స్టే విధించింది.
ప్రాజెక్టు అధ్యయనానికి నాలుగు శాఖల సమన్వయంతో కేంద్ర కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్, కేంద్ర పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి, హైదరాబాద్ ఐఐటీ నిపుణులను సభ్యులుగా నియమించింది. రెండు నెలల్లో కమిటీ స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పింది.
తదుపరి ఆదేశాలిచ్చే వరకు పనులు చేయొద్దని ఏపీని ట్రిబ్యునల్ ఆదేశించింది. తెలంగాణలోని నారాయణ పేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. పోతిరెడ్డి పాడుతో తెలంగాణలో తాగు,సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషనర్ తెలిపారు.
ఈ స్టే రావడానికి ముందురోజే, మంగళవారం నాడు సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల వెంటనే ఆపేయాలని కృష్ణా నదీ యాజమన్యా బోర్డు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే నెల వరకు చేసిన కేటాయింపులను మించి వాడుకున్నారని, ఇక నీరు తీసుకోవడానికి వీల్లేదని పేర్కొంది. ఈమేరకు ఎపి జలవనరుల శాఖ ఈఎన్‌సికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం లేఖ రాశారు.
నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులను విధిగా పాటించాలని ఎపి ప్రభుత్వాన్ని బోర్డు ఆదేశించింది. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని సూచించింది. సాగర్ కుడి కాల్వకు 158.255 టిఎంసిల నీటిని కేటాయించగా ఎపి ఇప్పటికే 158.264 టిఎంసీల నీటిని వాడుకుందని తేల్చి చెప్పింది. హాంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 47.173 టిఎంసీల నీటిని కేటాయించగా, ఇప్పటివరకు 48.328 టిఎంసీల నీటిని వాడకున్నారని, ఇక నుంచి నీటి విడుదల ఆపేయాలని బోర్డు ఆదేశించింది.