Home Blog Page 8454

హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్..


కరోనా మహమ్మరి హైదరాబాద్ మహానగంలో విజృంభిస్తుంది. కరోనా వారియర్స్ అయిన వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు కరోనా బారిన పడడం శోచనీయంగా మారింది. ఇటీవలే నిమ్స్ ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో నిమ్స్ లో తాత్కాలికంగా వైద్యసేవలు నిలిపివేసిన సంగతి తెల్సిందే. కరోనా సమాచారం ప్రజలకు సేవలందిస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడుతున్నారు.ఇటీవలే మనోజ్ అనే జర్నలిస్టు కరోనా సోకి చికిత్స పొందుతూ మృతిచెందాడు. తాజాగా పోలీస్ శాఖను కరోనా భయాందోళనకు గురిచేస్తోంది.

ఏడుగురు పోలీసులకు కరోనా..
హైదరాబాద్లో కరోనా డెంజర్ బేల్స్ మోగుతూనే ఉన్నాయి. రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళనను రేపుతోంది. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏడుగురి సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. వారందరికీ హోం క్వారంటైన్ చేశారు. పోలీస్ యంత్రాంగం బాధితుల ప్రైమరీ కాంటాక్టులను సేకరించి వారిని క్వారంటైన్లో ఉంచి టెస్టులు నిర్వహిస్తున్నారు.

కరోనాపై పోరాడుతున్న కరోనా వారియర్స్ ఈ మహ్మమరి బారిన పడుతుంటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు, మెడికల్ విద్యార్థులు, వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు ఎవరిని కరోనా వదలడం లేదు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది. కాగా బుధవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో 143 కేసులు నమోదయ్యాయి. ఇందులో మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో 11చొప్పున నమోదు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 4,111కు చేరగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,138గా ఉంది.

మరో కాంట్రవర్సీకి తెరలేపిన ఆర్జీవీ


సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరింత వేగం పెంచాడు. ఒకే సారి మూడు సినిమాలు చేస్తున్నాడు. ఆ మూడూ డిఫరెండ్ చిత్రాలే కావడం విశేషం. అందులో ఒకటి ‘నగ్నం’. ఇటీవలే పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్‌’ అనే మూవీతో ముందుకొచ్చాడు. ఆర్జీవీ వరల్డ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఈ చిత్రానికి అనూహ్య స్పందన వచ్చింది. ఆ వెంటనే నగ్నం చిత్రం ట్రైలర్ను విడుదల చేశాడు. చీర కట్టుకున్న ఓ మహిళ శరీరభాగాలపై ఫోకస్ పెట్టి ఒకటిన్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ను కట్ చేశాడు. నాక్‌డ్, నంగా, నగ్నం అన్న పేర్లు ఉండడంతో దీన్ని తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్‌ చేస్తారని అర్థమవుతోంది. దీన్ని చూడాలంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని ఆర్జీవీ ప్రకటించాడు.

‘నగ్నం’ ట్రైలర్ విడుదలైన రెండు గంటల్లోనే రాము మరో రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే మీద ఓ సినిమా తీస్తున్నట్టు తెలిపాడు. దీనికి ‘ది మ్యాన్ హూ కిల్డ్‌ గాంధీ’ అని టైటిల్ ఖరారు చేశాడు. గాంధీని చంపిన గాడ్సే తనను తానే చంపుకున్నాడని పేర్కొంటూ ఈ మూవీ విశేషాలను ట్విట్టర్లో చెబుతున్నాడు ఆర్జీవీ. అలాగే, ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ అనే మరో మూవీ తీస్తున్నట్టు ప్రకటించాడు. ఓ ఇంట్లో మందుకొడుతున్న నలుగురు కుర్రాళ్లు గోడపై కత్రినా కైఫ్ ఫొటోను చూస్తున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. కరోనా నేపథ్యంలో థియేటర్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఫూచర్ సినిమా.. థియేటర్, ఓటీటీలో కాదు కేవలం పర్సన్ యాప్స్‌లో చూడాల్సి ఉంటుందని వర్మ ట్వీట్ చేశాడు.

గాంధీ ముఖంలో గాడ్సే
‘ది మ్యాన్ హూ కిల్డ్‌ గాంధీ’ చిత్రం వివాదాస్పదమయ్యేలా ఉంది. ఈ మూవీ ప్రకటనతోనే సంచలనానికి తెరలేపిన ఆర్జీవీ తాజాగా ఓ పోస్టర్రిలీజ్ చేశాడు. అందులో గాంధీ, గాడ్సే ఇద్దరి ముఖాలను కలిపివేశాడు. కళ్లజోడు పెట్టుకున్న జాతిపిత ఫొటోను మార్పింగ్ చేసి గాడ్సే ఫొటోను అతికించిన పోస్టర్ పై ఇప్పటికే సామాజిక కార్యకర్త బాబు గోగినేని అసహనం వ్యక్తం చేశారు. హత్యచేసిన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తుల ఫొటోలను మార్పింగ్ చేస్తూ ఇలా పోస్టర్‌ విడుదల చేయడం సరికాదన్నారు. ఏమిటి, ఈ అకతాయితనం అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కానీ, తనది భావ ప్రకటనా స్వేచ్ఛ అని, డైరెక్టర్ గా క్రియేటివిటీ చూపించడం నా హక్కు అని ఆర్జీవీ తనదైన స్టయిల్లో జవాబిచ్చాడు. ‘మార్ఫింగ్ చేసిన ఈ పోస్టర్‌ వెనుక ఉన్న అసలు ఉద్దేశం సినిమా పూర్తిగా చుసిన తర్వాత తెలుస్తుంది. సినిమాను చూడకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు మీకు లేదు. పోయి బీరు తాగి ప్రశాంతంగా ఉండండి’ అని సలహా ఇచ్చాడు.

https://twitter.com/RGVzoomin/status/1270566259843756034

 

‘వకీల్ సాబ్‌’లో శ్రుతి హాసన్ కూడా నటిస్తోందా?


అజ్ఞాతవాసి అనంతరం ఇండస్ట్రీకి దూరమైన పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపై కనిపిస్తే చూడాలని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమితాబ్ బచ్చన్ నటించిన బాలీవుడ్ హిట్ ‘పింక్’ మూవీ రీమేక్‌ ‘వకీల్ సాబ్‌’తో పవన్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకురానున్నారు. రాజకీయాల్లో కొన్నేళ్ల పాటు బిజీగా ఉన్న పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ కావడంతో దీనిపై సహజంగానే భారీగా అంచనాలున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు కొన్ని షెడ్యూల్స్‌లో షూటింగ్‌ కూడా చేశారు. ఇప్పటికే పవన్‌ ఫస్ట్‌ లుక్‌తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయగా భారీ స్పందన వచ్చింది. దిల్‌రాజు, బోనీ కపూర్ నిర్మాణంలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గురించి తాజాగా ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

ఈ మూవీలో శ్రుతి హాసన్‌ నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై శ్రుతీనే హింట్ ఇచ్చింది. శ్రుతి రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయింది. వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ‘వకీల్ సాబ్‌’లో నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆమె నేరుగా జవాబివ్వలేదు. ‘ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పను’ అని బదులిచ్చింది. ఒకవేళ ఈ సినిమాలో భాగం కాకపోయి ఉంటే ఆమె నేరుగా లేదు అని చెప్పేది. నటిస్తుంది కాబట్టే ఇప్పుడు చెప్పను అన్నదని అభిమానులు భావిస్తున్నారు. బహుశా వకీల్ సాబ్‌లో శ్రుతి గెస్ట్ అపియరెన్స్ లేదంటే సర్ప్రైజ్ రోల్‌ పోషిస్తుందేమో అని అనుకుంటుకున్నారు. పవర్ స్టార్ సూపర్ హిట్ ‘గబ్బర్ సింగ్‌’లో హీరోయిన్‌గా మెప్పించిన శ్రుతి పవన్‌తో మరోసారి యాక్ట్ చేస్తుందో లేదో చూడాలి. పవన్‌ లాయర్ పాత్ర పోషిస్తున్న వకీల్ ‌సాబ్‌లో అంజలి, నివేదా థామస్, అనన్య, ప్రకాశ్ రాజ్‌, నరేశ్, అనసూయ కూడా నటిస్తున్నారు.

తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి దర్శనం


తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణ భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు గురువారం నుంచి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0లో దేవాలయాల్లో దర్శనానికి అనుమతి ఇవ్వడంతో, రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోని దేవాలయాల్లో దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక షరతులతో అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో టిటిడి తొలి మూడు రోజులు దేవస్థానం ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించింది. రోజుకు ఏడూ వేల మంది భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తామని టిటిడి ప్రకటించింది. గురువారం మూడు వేల మందికి ప్రత్యేక దర్శనం, మారో మూడు వేల మందికి టైమ్ స్లాట్ టిక్కెట్లను విక్రయించారు. అలిపిరి తొలిగేట్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కొండపైకి టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. లేని వారిని వెనక్కి పంపిస్తున్నారు. గంట పాటు విఐపిలకు దర్శనం కల్పించేందుకు టిటిడి అధికారులు అవకాశం కల్పించారు. దర్శనం కోసం వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. అదేవిధంగా సామాజిక దూరం పాటించాలి, కేవలం దర్శనాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రత్యేక కైకర్యాలు ఏమీ ఉండవు.

ఆన్ లైన్ లో టిక్కెట్ లు బుక్ చేసుకోలేని వారి కోసం తిరుపతిలోని అలిపిరిలోని బాలాజీ లింక్ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో దర్శన సమయ టోకెన్లను జారీ చేస్తున్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో టోకెన్ జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ నెల 15 నుంచి 17 వరకూ టోకెన్లను ఈ రోజు టిక్కెట్ విక్రయ కేంద్రాల వద్ద విక్రయిస్తున్నారు. అలిపిరి లింక్ బస్టాండ్ లో భక్తులను టీటీడీ సిబ్బంది దూరదూరంగా కూర్చోబెట్టారు. శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ సెంటర్ నుంచి డీబీఆర్ హాస్పిటల్ వరకూ క్యూ లైన్ కనిపించింది. కరోనా వైరస్ ను సైతం లెక్కచేయకుండా స్వామివారి దర్శనానికి భక్తులు పోటీ పడుతున్నారు.

ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలు కష్టం?

Bonalu

Bonalu

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలు నిర్వహించడం కష్టంగా మారింది. దీనికి తోడు జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోనాల విషయంలో ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతుంది. ప్రజలు ఇంట్లోనే అమ్మవారికి బోనం సమర్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఘటాల ఊరేగింపును పూజారులే దేవాలయాల పరిసరాల్లో చేపడతారని, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు కూడా వాళ్లే సమర్పిస్తారన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన బోనాల ఉత్సవాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

ప్రతి ఏటా జరిగే బోనాల జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, ఈసారి కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉన్నందున సామూహిక బోనాల పండుగ జరుపుకోవడం మంచిది కాదని తెలిపారు. నచ్చిన పద్ధతిలో బోనం తయారు చేసి సూర్యభగవానుడికి చూపించి, అమ్మవారి చిత్రపటం ముందు సమర్పించాలని ఆడపడుచులకు ఆయన సూచించారు. భక్తులెవరూ అమ్మవారి ఆలయాలకు బోనంతో రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆలయాల్లో పూజారులే పూజలు, అలంకరణలు, బోనం చేస్తారని అన్నారు. అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టువస్ర్తాలు ఒకరోజు ముందుగానే ఆలయాలకు అందజేస్తామని తెలిపారు.

సీఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ


కరోనా మహమ్మరితో మృతిచెందిన జర్నలిస్టు మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సమాచారం అందిస్తూ జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వనికి ఉందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

జర్నలిస్టులు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారని తెలిపారు. అయితే ఈ సమయంలోనూ కొందరు జర్నలిస్టులు ఈ మహమ్మరి బారినపడి మృత్యువాత పడటం శోచనీయమన్నారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వం 10వేల రూపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వమే 50లక్షల హెల్త్ బీమా కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు ఉచితం కరోనా పరీక్షలు చేయాలన్నారు.

అదేవిధంగా కరోనాతో మృతిచెందిన మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం 50లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలపై తక్షణమే స్పందించాలని రేవంత్ ఆ లేఖలో డిమాండ్ చేశారు.

రానా పెళ్లి వాయిదా పడలేదు… అదే రోజు ఫిక్స్‌


వీళ్లు వాళ్లు అని తేడా లేకుండా కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయారు. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. అదే సమయంలో పలువురు సినీ సెలబ్రిటీలు.. సినీ స్టయిల్లో ఆకాశమంత పందిరి అనేలా ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నా.. ఆ అవకాశం లేక వాయిదా వేసుకున్నారు. అందులో నితిన్ రెడ్డి ఒకడు దిల్‌ రాజు (సెకండ్ మ్యారేజ్), నిఖిల్ సిద్దార్థ్‌ మాత్రం లాక్‌డౌన్‌ రూల్స్‌ ఫాలో అవుతూ కొద్ది మంది అతిథులు సమక్షంలో పెళ్లి తంతు కానిచ్చేశారు.

లాక్‌డౌన్‌ టైమ్‌లో తన ప్రేమ విషయాన్ని బయట పెట్టిన దగ్గుబాటి రానా పెళ్లి విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మిహికా బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించిన రానా.. ఆమె అంగీకారంతో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇరు కుటుంబాలు కూడా ఓకే చెప్పగా.. తన పెళ్లి విషయాన్ని రానా ఇప్పటికే ప్రకటించాడు. వధువు కుటుంబ సంప్రదాయం ప్రకారం కొన్ని రోజుల కిందట రోకా వేడుక నిర్వహించారు. ఆగస్టు 8వ తేదీన పెళ్లి ఫిక్స్ చేశారు. రానా తండ్రి, ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా పెద్ద కొడుకు పెళ్ళి కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ పెళ్లి వాయిదా వేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే, ఇవన్నీ అసత్య ప్రచారాలే అని రానా, మిహికా కుటుంబాలు చెప్పాయి. ముందుగా నిర్ణయించిన తేదీనే అంటే ఆగస్టు 8న పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశాయి. లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటిస్తూ కొద్ది మంది బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక జరపాలని నిర్ణయించారట. ఆగస్టు 6,7వ తేదీల్లో మెహిందీ ఇతర వేడుకలు నిర్వహిస్తారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలు హౌస్ అరెస్ట్


కరెంటు బిల్లులను నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ నేతలు ఛలో కలెక్టర్ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్లను భారీగా మోహరించి హౌజ్ అరెస్టులు చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావులను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కాగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇంటి వద్దకు ఉదయం 6 గంటల వరకు పోలీసులు భారీగా చేరుకొని ఆయనను ఇంటి నుంచి బయటికి రాకుండా గృహనిర్భందం చేశారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన సమయంలో అద్దెలు చెల్లించవద్దని చెప్పిన కేసీఆర్ నేడు స్లాబుల పేరుతో అధిక బిల్లు వసూళ్లకు పాల్పడటం సమంజసం కాదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై ఇంత కక్ష్య సాధింపు చర్యలేంటని ప్రశ్నించారు. తెలంగాణలో మూడు నెలలుగా ప్రజలకు ఉపాధి లేకుండా పోయిందని ఈ పరిస్థితుల్లో వారిపై కరెంటు బిల్లుల భారాన్ని మోపడం కరెక్ట్ కాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న కాంగ్రెస్ నేతలను నిర్భంధించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్టులకు దిగడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలన్నారు.

కోలుకుంటున్న కరోనా బాధితులు!

Corona

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నప్పటికి కోవిద్ బారినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న వారి కంటే కోలుకున్న రోగుల సంఖ్య పెరిగింది.  కరోనా విలయతాండవంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వార్త కొంత ఉపశమనాన్నిస్తున్నది. బుధవారానికి మొత్తం పాజిటివ్‌ కేసులు 2.7 లక్షలు దాటగా, వారిలో 1,35,205 మంది రోగులు కోలుకున్నారు. 1,33,632 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ విధంగా చికిత్స తీసుకుంటున్న వారి కంటే కోలుకున్న వారి సంఖ్య పెరిగినట్లయింది. మొత్తం కరోనా కేసుల్లో కోలుకున్న రోగుల సంఖ్య 48.99 శాతంగా నిలిచింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 9,985 మందికి కరోనా సోకింది. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసులు మొత్తం 2,76,583కు చేరాయి. గత 24 గంటల్లో 279 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 7,745కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 3,289 మంది మృతి చెందారు. గుజరాత్‌లో 1313, ఢిల్లీలో 905 మరణాలు చోటు చేసుకున్నాయి.

ప్రభుత్వ న్యాయవాదులపై వేటు..!


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో న్యాయస్థానాల్లో గట్టి ఎదురుదెబ్బలు అనేకం తగిలాయి. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టులో అనేక కేసులు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో 64 కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. దీంతో జగన్ ప్రభుత్వం అపఖ్యాతి పాలయ్యిందనే ప్రచారం జరుగుతోంది. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన కేసుల్లో ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ తొలగింపు, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అమలు, రాజధాని తరలింపు, ఐఏఎస్ జాస్తి కిషోర్ సస్పెన్షన్, పోలవరం జాలవిద్యుత్ కేంద్రం టెండర్ల రద్దు, రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ అమలు, విద్యుత్ ఒప్పందాల రద్దు, విశాఖలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవడం, బాబుకి భద్రత కుదింపు వంటి ఎన్నో కేసులు ఉన్నాయి.

న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. న్యాయస్థానాల్లో వాదనలు వినిపించే న్యాయవాదులను మార్చాలని ఇటీవల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం న్యాయవాదులుగా పనిచేస్తున్న గెడ్డం సతీష్ కుమార్, పెనుమాక వెంకటరావు, షేక్ హాబీబ్ లు తమ రాజీనామాలను అందజేశారు. ఇప్పటికే ముగ్గురు న్యాయవాదులు రాజీనామాలు సమర్పించగా న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజీనామాలకు ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వం ఏడుగురు గవర్నమెంట్ ప్లీడర్స్ (జిపి)లు, మరో 14 మంది అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్స్ (ఏజిపి) లను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాజీనామాల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ప్రభుత్వ నిర్ణయాలలో ఉన్న లోపాన్ని న్యాయవాదులపై నెట్టి వారిని మార్చడం వల్ల ప్రయోజనం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.

నాగ్ అసంతృప్తి వాస్తవం కాదట !


అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. అయితే ఈ సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ అసంతృప్తిగా ఫీల్ అయినట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఇవి కేవలం రూమర్స్ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ చాల బాగా వచ్చాయట. ఈ సీన్స్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తాయట. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.

కాగా అఖిల్ గత సినిమా ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో ఈ సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ తో పాటు అఖిల్ కూడా దగ్గర ఉండి ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక షెడ్యూల్స్ అన్ని కూడా పూర్తి అయ్యాయి.

ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. అలాగే రమేష్ అనె ఓ కొత్త డైరెక్టర్ కథను అఖిల్ ఓకే చేశారట. కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారు.

రేపే ఇంటర్ ఫలితాలు


ఆంధ్రప్రదేశ్ లో రేపు ఇంటర్మీయట్ ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11గంటలకు ఇంటర్మీయట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీయట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇంటర్ సప్లమెంటరీ, ఇంఫ్రూవ్ మెంట్ పరీక్షలపై విద్యాశాఖ క్లారిటీ ఇవ్వలేదు. ఫలితాలు ప్రకటించిన తర్వాతే వీటికి సంబంధించిన తేదిలను ప్రకటించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యాపకులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష పేపర్లను మూల్యంకనం చేశారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే సమయానికల్లా ఇంటర్మీయట్ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో ఇంటర్మీయట్ విద్యార్థులకు కొంతమేర ఊరట కలిగింది. అయితే లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో నిర్వహించిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇందులో పదో తరగతి పరీక్షలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉన్నప్పటికీ లాక్డౌన్ ఎత్తివేయడంతో పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది.

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు రద్దు చేయడంతో ఏపీలోనూ పరీక్షలు వాయిదా పడుతాయని అనుకున్నారు. తెలంగాణలో బాటలోనే పలు రాష్ట్రాలు పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెల్సిందే. అయితే ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతుండటం గమనార్హం. రెండు పేపర్లు ఉన్న సబెక్టులను ఒక్కటికి కుదించి పరీక్షలను నిర్వహించనున్నారు. ఈమేరకు విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ ఇటీవల పదో విద్యార్థులకు క్లారిటీ ఇచ్చిన సంగతి తెల్సిందే.

వెనక్కి తగ్గిన చిరంజీవి.. కారణమేంటి?


దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు, థియేటర్లు వాయిదా పడిన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో ఇటీవల లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని కోరగా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు సినిమా, టీవీ షూటింగులను ప్రారంభించుకోవచ్చని ఇటీవలే జీవో కూడా జారీ చేశారు. అదేవిధంగా ఏపీలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి షూటింగులకు అనుమతి ఇచ్చారు. దీంతో ఈనెల 15నుంచి టాలీవుడ్లో సినిమా షూటింగుల సందడి మొదలుకానుంది.

ఇదిలా ఉంటే చిరంజీవి తాజా చిత్రం ఆచార్య విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనాకు ముందు నిర్మాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ మూవీని భారీ బడ్జెట్లో తెరకెక్కించాలని భావించాడు. అయితే ప్రస్తుతం పరిస్థితులు దృష్ట్యా బడ్జెట్ ను తగ్గించేందుకు చిత్రబృందం మొగ్గుచూపుతుందని సమాచారం. ఈమేరకు బడ్జెట్ తగ్గించాలని దర్శకుడు కొరటాల శివకు మెగాస్టార్ సూచించారట. వీలైనంత త్వరగా సినిమాను ప్రారంభించి మూవీని కాంప్లీట్ చేయాలని భావిస్తున్నారని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది.

ప్రస్తుతానికి సినిమా షూటింగులు ప్రారంభమైనప్పటికీ థియేటర్లు ఓపెన్ కాలేదు. రానున్న రోజుల్లో థియేటర్లు ఓపెన్ అయినా జనాలు థియేటర్లు ఇంతకముందులా వచ్చే అవకాశం కన్పించడం లేదు. దీంతో భారీ బడ్జెట్లో మూవీని నిర్మిస్తే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మెగాస్టార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్యలో చిరుకు జోడీగా కాజల్ ఆగర్వాల్ నటిస్తుండగా రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. రెజీనా కసండ్రా ఓ స్పెషల్ సాంగ్లో చిరంజీవితో ఆడిపాడనుంది. మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ చిరంజీవి మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు- రూ.7లక్షల కరెంట్ బిల్!

Power bill

ఒక ఫ్యాన్, 3 బల్బులు ఉండి, కూలీ పని చేసుకుంటూ ఉండే ఒక ఇంటి యజమానికి రూ. 7 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. ప్రతి నెలా రూ.500 మాత్రమే విద్యుత్ బిల్లు వస్తుంది. గతనెల ఫిబ్రవరిలో కూడా రూ. 414 మాత్రమే కరెంటు బిల్లు వచ్చింది. ఈ నెల రూ.7 లక్షలకు పైగా రావడంతో ఆ ఇంటి యజమాని ఖంగుతిన్నాడు. తాము బిల్లు ఎలా చెల్లించాలని ఆందోళన చెందుతున్నాడు.

కామారెడ్డి జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. రూ.500 విద్యుత్ బిల్లు వచ్చే ఇంటికి రూ.7,29,471 బిల్లు ఇచ్చారు. దీంతో ఆ ఇంటి యజమాని ఒక్కసారి అవాక్కయ్యాడు. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన గాండ్ల శ్రీనివాస్ వ్యవసాయం కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంట్లో మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నాయి. ప్రతి నెలా రూ.500 కరెంట్ బిల్లు వస్తుంది. గత ఫిబ్రవరి నెలలో రూ.415 విద్యుత్ బిల్లు చెల్లించాడు. మార్చి, ఏప్రిల్, మే నెలలో కరోనా వల్ల విద్యుత్ బిల్లులు రాలేదు. ఈ నెలలో విద్యుత్ బిల్లులు రావడంతో ఆ ఇంటి యజమాని ఖంగుతిన్నాడు. వెయ్యి కాదు, రెండు వేలు కాదు.. ఏకంగా రూ.7 ,29,471 విద్యుత్ బిల్లు వచ్చింది. దాంతో తాము బిల్లు ఏ విధంగా చెల్లించాలో చెప్పాలని అధికారులను ప్రశ్నిస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్యానికి తాము బిల్లు ఎలా కడతామని అంటున్నాడు. అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

మిడతల దండుపై మరోసారి మీటింగ్!

Locusts

 

Locusts

తెలంగాణకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ వద్ద గల అజ్ని అనే గ్రామం వద్ద ప్రస్తుతం మిడతల దండు ఉంది. దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే, చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యలో మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షించారు.

గత నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపు రాలేదు. అయితే తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకున్నారు. మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పే అని తేలింది. మరోవైపు ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు మళ్లీ మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. ఆ సమయంలో తెలంగాణలో వర్షాకాలం పంట సీజన్ ప్రారంభమయి ఉంటుంది. పంటలు మొలకెత్తి ఉంటాయి. మిడతల దండు దాడిచేసిందంటే చాలా నష్టం జరుగుతుంది. లేత పంటను పీల్చి పారేస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు.

అరె.. ‘నట సింహం’లో మార్పు వచ్చింది !


యువరత్న నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. అయితే బాలయ్య అంటేనే.. ఒన్లీ యాక్షన్, పైగా బాలయ్య సినిమాలు ఆయన అభిమానులకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు బాలయ్య మారాడు. తన సినిమాలను కూడా మార్చబోతున్నాడు. కథల విషయంలో.. తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్యలో మార్పు వచ్చిందని, ఇక నుండి బాలయ్య అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా ఇక పై తను చేయబోయే చిత్రాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని బాలయ్య దర్శకులకు క్లారిటీగా చెప్పారట. తనకు కథ చెప్పాలనుకుంటే కొత్తదనం ఉండాలని, అప్పుడే కథ చెప్పడానికి రండని అన్నారట. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే కాకుండా ఇంకాస్త కొత్తగా కనిపించాలని బాలయ్య బలంగా కోరుకుంటున్నారట. అందుకే బోయపాటి సైతం బాలయ్య అభిరుచికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేయించాల్సి వచ్చింది.

మెయిన్ గా బాలయ్య ఆదేశాల మేరకు పాత్రలో వైవిధ్యంతో పాటు, కొత్త తరహా కథను సిద్దం చేశారు బోయపాటి. మొత్తానికి బాలయ్య తన తర్వాతి సినిమాలను కూడా అలాగే కొత్తగా చేసి.. ఈ తరం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకోవాలని గట్టిగా భావిస్తున్నారు. మరి బాలయ్య కొత్తదనం ఎలా ఉంటుందో.. అందర్నీ బాలయ్య ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.