
తెలంగాణకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ వద్ద గల అజ్ని అనే గ్రామం వద్ద ప్రస్తుతం మిడతల దండు ఉంది. దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే, చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యలో మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షించారు.
గత నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపు రాలేదు. అయితే తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకున్నారు. మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పే అని తేలింది. మరోవైపు ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు మళ్లీ మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. ఆ సమయంలో తెలంగాణలో వర్షాకాలం పంట సీజన్ ప్రారంభమయి ఉంటుంది. పంటలు మొలకెత్తి ఉంటాయి. మిడతల దండు దాడిచేసిందంటే చాలా నష్టం జరుగుతుంది. లేత పంటను పీల్చి పారేస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు.