Woman Emotional Story: అది బీహార్ రాష్ట్రం లోని సివాన్ ప్రాంతం. అక్కడ రింకీ దేవి అనే మహిళ తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఈమెకు పిల్లలు కూడా ఉన్నారు. వారు చదువుతున్నారు. రింకీ దేవికి కోళ్లను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో చాలా కోళ్లు ఉంటాయి.
రకరకాల కోళ్లను పెంచుకునే రింకీ దేవి.. వాటిని తన పిల్లలతో సమానంగా చూసుకుంటుంది. ఉదయం లేవగానే వాటికి గింజలు వేస్తోంది. మధ్యాహ్నం కూడా గింజలు వేస్తుంది. రాత్రిపూట నీళ్లు పెట్టి.. వాటిని ప్రత్యేకమైన షెడ్లలో చేర్చుతుంది. ఇక మళ్లీ ఉదయం వాటిని బయటికి వదులుతుంది. కోళ్లతోనే ఆమె దిన చర్య సాగుతూ ఉంటుంది. పైగా వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలు తీర్చుతుంది. అయితే రింకీదేవి పెంచుకుంటున్న కోళ్లల్లో ఒకటి చనిపోయింది. దీంతో ఆమెకు గుండె ఆగినంత పని అయింది. తట్టుకోలేక స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
చనిపోయిన కోడిని తీసుకెళ్లి రింకీదేవి సివాన్ ప్రాంతంలోని మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తన బిడ్డలతో సమానంగా చూసుకుంటున్న కోళ్లల్లో ఒక దానిని ఎవరో చంపేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన కోడికి ఇలాంటి గతి పెట్టడానికి కారణం తన బావ, మరో ఇద్దరు వ్యక్తులని ఆమె ఆరోపించింది. అంతేకాదు ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది.. దీంతో పోలీసులు కూడా ఆమె చెప్పినట్టుగానే కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా మొదలుపెట్టారు..రింకీ దేవికి, ఆమె బావకు గొడవలు ఉన్నాయని.. అందువల్లే కోడిని చంపేశారని.. తమకు అదే విధంగా ఫిర్యాదు చేసిందని పోలీసులు చెబుతున్నారు. అయితే రింకీదేవి పెంచుకుంటున్న కోడిని వారు కావాలని చంపారా? లేక ఈమె ఆరోపణలు చేస్తుందా? అనే విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇరుగుపొరుగు వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే రింకీదేవి, ఆమె బావకు గొడవలు ఉన్నాయని.. కాకపోతే వారు కోడిని చంపినట్టు బలమైన ఆధారాలు లభించలేదని పోలీసులు వివరిస్తున్నారు.
Also Read: Inspirational Women : 58 ఏళ్ళ వయసులో ఇంటర్ పాస్ అయింది..ఈ మహిళ తెగువకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే!
” రింకీ దేవి అనే మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఆమె చేతిలో చనిపోయిన కోడి ఒకటి ఉంది. మొదట్లో కానిస్టేబుళ్లు ఆమెను వారించారు. ఆ తర్వాత ఆమె తన సమస్యను చెప్పుకుంది. దీంతో కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఆమె చెప్పిన వివరాలను ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొని.. దానికి తగ్గట్టుగానే కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాం. చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడి వివరాలు సేకరించాం. తదనుగుణంగా వారిపై చర్యలు తీసుకుంటామని” పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత .. చనిపోయిన కోడిని రింకీదేవి తన వెంట తీసుకెళ్లింది. ఆ కోడిని పూడ్చి పెట్టారా? లేక వండుకొని తిన్నారా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలియ రాలేదు.