Gossip Business: నువ్వు మాటలు చెప్పి బతుకుతావురా.. మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒకరు మాటకారి ఉంటారు. పని చేయడం చేతకాక పోయినప్పటికీ మాటలతోనే కోటలు కడుతుంటారు. మన పరిభాషలో అటువంటి వారిని కోతల రాయుడు అని పిలుస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. కోతలు కోయడాన్ని.. అక్కడి ముచ్చట్లు ఇక్కడ చెప్పడాన్ని.. సంగతులను అక్కడికి మోయడాన్ని ఓ మహిళ వ్యాపారంగా మార్చుకుంది.
పురాణాలలో నారదుడు తగువులు పెట్టేవాడు. జగడాలు పుట్టేలా చేసేవాడు. అక్కడ ముచ్చట్లు ఇక్కడికి.. ఇక్కడ ముచ్చట్లు అక్కడికి చేర్చేవాడు. తద్వారా మంట లేని చోట మంట పుట్టించి.. చలి కాచుకునేవాడు. కానీ నేటి ఆధునిక కాలంలో ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే వారందరికీ రాని ఆలోచన ఈ మహిళకు వచ్చింది. అసలు ఇలాంటి ఆలోచనతో డబ్బులు సంపాదించవచ్చని ఆమె నిరూపించింది.
కొలంబియా ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ముచ్చట్లు చెప్పడం అంటే ఇష్టం. ఇరుగుపొరుగు వారి సంగతులను.. తెర వెనుక వ్యవహారాలను తెలుసుకోవడం మరింత ఇష్టం. పైగా ఆ ముచ్చట్లను చాలా అందంగా ఆమె చెబుతుంది. వాస్తవికతకు కాస్త కాల్పానికతను జోడిస్తుంది. అయితే ఇదంతా చేసినందుకు ఆమె డబ్బులు తీసుకుంటుంది. ఇరుగు పొరుగు ముచ్చట్లు చుట్టుపక్కల వారికి చెప్పి ఆమె ఏకంగా రెండు గృహాలను కొనుగోలు చేసింది. బ్యాంకు బ్యాలెన్స్ దండిగానే ఉంది. ఆమె చెప్పే మాటలు వాస్తవానికి దూరంగా ఉన్నప్పటికీ.. అందులో కాస్త డ్రామా.. ఇతర అంశాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లే ఆమె చెప్పే మాటలను చాలామంది చెవులు రెక్కించి మరి వింటుంటారు.
మొదట్లో ఈ మాటలను ఆమె ఉచితంగానే చెప్పేది. కాకపోతే తన మాటకు.. తాను చెప్పే తీరుకు ఇంత స్థాయిలో పాపులారిటీ రావడంతో ఆమె.. ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అనుకుంది. అందువల్లే తన మాటలను అమ్ముకోవడం మొదలుపెట్టింది. గంటకు ఇంత చొప్పున చార్జ్ చేయడం ప్రారంభించింది. సీన్ కట్ చేస్తే 67 ఏళ్ల వయసులో రెండు గృహాలను.. భారీగా బ్యాంకు బ్యాలెన్స్ సొంతం చేసుకుంది. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల మీద ఆధారపడుతుంటారు. కానీ ఈమె తన మీదనే కుటుంబం ఆధారపడేలా చేసుకుంది. ఎంతైనా మాటలతో కోటలు కట్టడమే కాదు.. ఏకంగా కోట్లు సంపాదించింది. ఇలాంటి ఆలోచన రావడమే అద్భుతమైతే..దానిని ఆచరణల పెట్టి డబ్బులు సంపాదించడం మరింత అద్భుతం.