Thailand: గజరాజును అత్యంత పవిత్రంగా భావించే దేశం థాయ్‌లాండ్. ఆ దేశంలోనే ఇప్పుడు ఓ అద్భుతం జరిగింది. అరుదుగా సంభవించే కవలలకు ఓ ఏనుగు జన్మనిచ్చింది. కవలలు పుట్టడమే అరుదు.. ఇక 36 ఏళ్ల వయసున్న ఏనుగు ఒక ఆడ, ఒక మగ గున్నలకు జన్మనివవ్వడం అత్యంత అరుదైన ఘటన అని అక్కడి వెటర్నరీ వైద్యులు వెల్లడించారు.
అయూథలా ఏనుగుల ప్యాలెస్‌లో..
థాయ్‌లాండ్‌లోని అయూథలా ప్రావిన్స్‌లోని అయూథలా ఏనుగుల ప్యాలెస్‌లో ఇటీవల ఈ ఘటన జరిగింది. 36 ఏళ్ల ఛామ్‌చూరి శుక్రవారం(జూన్ 14న) ఒక మగ గున్నకు జన్మనిచ్చింది. ప్రసవం సాఫీగా జరిగిందని అనుకుని గున్న ఏనుగును నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా ఛామ్‌చూరీ మళ్లీ నొప్పులు పడడం అక్కడి మావడటి, సిబ్బందిని ఆశ్చర్యపర్చింది. అతి కష్టం మీద మరో ఆడ గున్నకు జన్మనిచ్చింది. రెండు గున్నలకు జన్మనివ్వడంతో ఏనుగు బాగా డీలాపడింది. దీంతో ఆడ గున్న ఏనుగుపై పడిపోతుందని భావించిన మావటి వెంటనే దాని కిందకు దూరి గున్నను బయటకు లాగాడు. ఈ క్రమంలోనే తల్లి ఏనుగు కింద పడడంతో మావటి కాలు విరిగింది.
కవలల జననం ఒక్క శాతమే..
ఏనుగులకు కవలలు పుట్టడం చాలా అరుదు. కేవలం ఒక్క శాతం మాత్రమే చాన్స్ ఉంటంది. ఇక ఆడ, మగ ఒకేసారి జననం అత్యంత అరుదైన విషయం అని వెటర్నరీ డాక్టర్ లార్డ్‌థోంగ్‌టేర్ మీపాన్ తెలిపారు. డాక్టర్ మీపాన్‌కు కూడా కవల పిల్లలు ఉన్నారు. ఇక ఏనుగుకు కవల గున్నలు పుట్టాయన్న వార్త తెలియడంతో దానిని చూసేందుకు జనం క్యూ కట్టారు. 60 కేజీల మగ, 55 కేజీల ఆడ గున్నలతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతున్నారు.