Earth: “అంతరిక్షంలో చోటు చేసుకున్న మహా విస్పోటనం ద్వారా.. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూ గ్రహం పుట్టిందని.. నవగ్రహాలలో.. మనుషులు జీవించేందుకు భూమి మాత్రమే అనుకూలమని..” చిన్నప్పట్నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం. అనేక నివేదికలు, శాస్త్రవేత్తల ప్రయోగాలు ఈ విషయాలను వెల్లడించాయి. మహా విస్ఫోటనం ద్వారా ఏర్పడిన ఈ భూమికి అంతం ఉందా? ఉంటే ఎప్పటిలోగా అది సాధ్యమవుతుంది? అనే ప్రశ్నలకు ఎప్పటికప్పుడు ఆసక్తికర సమాధానాలు లభిస్తూనే ఉన్నాయి. అయితే వాటిల్లో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియదు కానీ.. మీడియాలో, సోషల్ మీడియాలో అవి నానుతూనే ఉంటాయి. అయితే తాజాగా కొన్ని విషయాలు భూమి అంతానికి సంబంధించి సరికొత్త ఆందోళనలను కలిగిస్తున్నాయి.
డిసెంబర్ 21, 2012న భూమి అంతమవుతుందని పలు రకాల కథనాలు చర్చలో ఉండేవి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 2012 సమయంలో మాయన్ క్యాలెండర్ క్రీస్తుపూర్వం 3,114 లో మొదలైంది. దాని చివరి తేదీ 21 డిసెంబర్ 2022.. ఇదే భూమి అంతానికి సంకేతమని.. అదే చివరి రోజని పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి.. కొంతమంది ప్రజలు అది నిజమని కూడా నమ్మారు.
2000 సంవత్సరంలో భూమి అంతమవుతుందని రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఓ కంప్యూటర్ బగ్ కూడా పైపు కార్లకు బలం చేకూర్చింది. ఆ బగ్ ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లను మొత్తం నాశనం చేస్తుందని అందరూ ఆందోళన చెందారు.. అయితే అది జనవరి ఒకటి, 2000 సంవత్సరంలో వచ్చినందున చాలా మంది తమ కంప్యూటర్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వారంతా భయపడినట్టు ఏదీ జరగలేదు.
ఇంగ్లాండ్ లోని లీడ్స్ ప్రాంతంలో 1806లో ఒక కోడి ఉండేది. అది విస్తృతంగా గుడ్లను పెట్టేది. ఆ గుడ్లపై ఏసుక్రీస్తు వస్తున్నాడని చిన్న చిన్న అక్షరాలతో రాసి ఉండడం అప్పట్లో సంచలనానికి కారణమైంది. దీంతో ప్రపంచం మొత్తం అంతరించిపోతుందని, అందువల్లే ఏసుక్రీస్తు ఈ విధంగా సంకేతాలు పంపిస్తున్నాడని చాలామంది నమ్మారు. అయితే కొంతమంది దీని గురించి లోతుగా పరిశీలన చేయగా.. ఆ కోడి యజమాని ఇదంతా చేస్తున్నాడని తర్వాత తేలింది.
ప్రపంచంలోనే అత్యంత సుప్రసిద్ధ జ్యోతిష్యుడైన నోస్ట్రడామస్ కూడా ఒకానొక దశలో భూమి అంతమవుతుందని చెప్పాడు. 1555 లో భూమి కాలగర్భంలో కలుస్తుందని అంచనా వేశాడు.. కాల గతులు, చోటు చేసుకునే మార్పులపై లెస్ ప్రాఫిటిస్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. అయితే ఇందులో ప్రపంచం ముంపునకు గురవుతుందని, అంతర్దానమవుతుందని రాసినప్పటికీ.. వాస్తవంలో అలా జరగలేదు.
1000వ సంవత్సరంలో ఏసుక్రీస్తు వస్తాడని క్రైస్తవ మత బోధకులు ప్రచారం చేశారు.. ఆ సమయంలో ఈ భూమి మొత్తం అంతమవుతుందని ప్రకటించారు. కానీ అదంతా ఊహాగానమని తర్వాత తేలింది.
ఇలా ఎప్పటికప్పుడు ఏవేవో పుకార్లు.. ఊహగానాలు షికార్లు చేస్తూనే ఉన్నాయి. కానీ వీటికంటూ ఒక శాస్త్రీయ ఆధారం లేకపోవడం, ఇలాంటి విషయాలను మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.. అయితే ఈ భూమికి అంతం అనేది ఉందా? ఉంటే ఎప్పుడు జరుగుతుంది? అనే విషయాలపై ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ.. ఇంతవరకూ ఒక స్పష్టత అనేది మాత్రం రాలేదు.