YCP: వైసిపి దారుణ పరాజయం మూటగట్టుకుంది. ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. 2019లో అంతులేని మెజారిటీ ఇచ్చిన అదే ప్రజలు.. వైసీపీని పాతాళానికి తొక్కేశారు. తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది వైసిపి. ఆ ఓటమి బాధ నుంచి బయటపడి పోస్టుమార్టం చేసుకోవడం ఆ పార్టీ ముందున్న కర్తవ్యం. కానీ ఆ పని మానుకొని.. ఓటమికి సాకులు వెతుక్కోవడం మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే. గెలిచినప్పుడు క్రెడిట్ తమ ఖాతాలో వేసుకొని.. ఓడినప్పుడు ప్రజలను నిందించడం ఆ పార్టీకి తగదు. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన జగన్.. ఇన్ని పథకాలు ఏమయ్యాయి? లక్షల కోట్లు పంచాం. అయినా ప్రజలు విశ్వసించలేదు. అంటూ వ్యాఖ్యానించడం మాత్రం సహేతుకం కాదు. గుణపాఠాలు నేర్చుకోకుండా ఎన్నికల నిర్వహణపై మాట్లాడడం, అనుమానాలు వ్యక్తం చేయడం వైసిపి నేతలకు తగదు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయం పొందింది. కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. వైసీపీ 151 స్థానాల్లో గెలుపొందింది. అయితే నాడు తెలుగుదేశం పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ అనుమానించింది. అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అది తమ సంపూర్ణ విజయం గా అభివర్ణించింది. నాటి టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత తమను గెలిపించిందన్నది అప్పట్లో వైసిపి నేతల వాదన. అయితే నాటి వాదనను ఇప్పుడు వైసీపీ నేతలు అంగీకరించడం లేదు. టిడిపి మాదిరిగానే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానాలువ్యక్తం చేస్తున్నారు. తమలో ఉన్న బేలతనాన్ని బయటపెడుతున్నారు. గతంలో తెలుగుదేశం ఆరోపించినప్పుడు ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకుంటారా? అన్నది వైసీపీ నేతలకు కూడా తెలుసు. కేవలం ఓటమికి సాకులు వెతుక్కోవడం తప్ప.. మరొకటి ఇందులో కనిపించడం లేదు.
రెండు కోట్ల 80 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించామని జగన్ చెబుతున్నారు. అయినా సరే ప్రజలు తమను ఓడించారని బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ ముందు ఉన్న కర్తవ్యం ఆవేదన వ్యక్తపరచడం కాదు. ధైర్యం కూడదీసుకోవాలి. ప్రజల ముందుకు వెళ్లాలి. ఎందుకు ఓడించారో అడగాలి. ప్రభుత్వ పాలన బాగున్నా ఎమ్మెల్యేలు వేధించారా? కింది స్థాయిలో నేతలు అరాచకాలకు పాల్పడ్డారా? మరి ఏ ఇతర అంశాలు ప్రభావితం చేశాయా? అన్నదానిపై పోస్టుమార్టం చేయాలి. కానీ ఆ పని చేయకుండా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని.. పెద్దపెద్ద వాళ్లు కూటమి కట్టారని.. అందుకే ఓడిపోయామని బాధపడితే మాత్రం ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక లక్ష్యం పార్టీ శ్రేణులకు స్తైర్యాన్ని ఇవ్వడం. అలా చేయకుంటే వారు నైరాశ్యంలోకి వెళ్లిపోవడం ఖాయం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. ఐదేళ్లుగా చంద్రబాబు పడిన బాధలు జగన్ కు కూడా తెలుసు. చంద్రబాబు ఏ స్థాయిలో ధైర్యాన్ని ప్రదర్శించారు కూడా తెలుసు. ఓటమి నుంచి బయటపడి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన తీరు, ప్రభుత్వంపై పోరాడిన తీరు ప్రజా మన్ననలు పొందింది. అదే మాదిరిగా జగన్ వ్యవహరించడం తప్ప.. మరో మార్గం లేదు. దుష్ప్రచారం చేస్తే అది వైసీపీ మెడకు చుట్టుకుంటుంది అన్న వాస్తవాన్ని గ్రహించాలి. లేకుంటే ఆ పార్టీకి కష్టమే.