New Animal Species: ఈ భూమి ఎన్నో అద్భుతాలకు నెలవు. మరెన్నో జాతులకు ఆయువు. ఇప్పటివరకు మనకు తెలిసిన జాతులు కొన్ని మాత్రమే. వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని కాలగర్భంలో కలిసిపోగా… మరికొన్ని మనుగడ కోసం ప్రయత్నిస్తున్నాయి. మిగతావి వెలుగులోకి (బయట ప్రపంచానికి) రాకుండానే జీవనం సాగిస్తున్నాయి. అలాంటి జీవజాతుల కోసం శాస్త్రవేత్తలు 20 సంవత్సరాల పాటు ప్రయోగాలు చేశారు. అందులో 8 కొత్త జాతులను ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఇంతకీ అవి ఏంటంటే..
తపునూలి ఒరాంగుటాన్
దీనిని 2017లో ఇండోనేషియాలోని సమత్రా దీవిలో కనుగొన్నారు. ఈ జంతువు కోతి జాతికి చెందినది. ఆ దీవిలో కేవలం ఎనిమిది వందల వరకు మాత్రమే తపునూలి ఒరాంగుటాన్లు ఉన్నాయి.
స్కై వాకర్ హులాక్ గిబ్బన్
కోతి జాతికి చెందిన ఈ జంతువులను 2017లో చైనా, మయన్మార్ ప్రాంతంలో కనుగొన్నారు. ముఖం, చేతులపై ప్రత్యేక రంగులను కలిగి ఉండడం ఈ జంతువుల ప్రధాన లక్షణం. వీటికి శాస్త్రవేత్తలు స్టార్ వార్స్ అని పేరు పెట్టారు.
రూబీ సీ డ్రాగన్
ఇవి సముద్ర గుర్రాల మాదిరి ఉంటాయి. 2015లో వీటిని కనుగొన్నారు. ఇవి ఎర్రటి రంగులో ఉంటాయి. దూరం నుంచి చూస్తే సముద్రపు ఆకుల లాగా కనిపిస్తాయి.
వాఖీ గొర్రెలు
వీటిని 2015లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోని మారుమూల ప్రాంతాలలో గుర్తించారు.. వీటి ఒంట్లో అధికంగా కొవ్వు ఉంటుంది. పైగా ఇవి కొమ్ములు లేకుండా, ప్రత్యేక తోకలను కలిగి ఉంటాయి.
ఆంగోలాన్ స్పైడర్ మంకీ
దీనిని 2012లో ఉత్తర అంగోలా ప్రాంతంలో కనుగొన్నారు. స్పైడర్ మంకీ జాతిలో ఇది పూర్తి భిన్నమైనది. ఉదా, బూడిద, నలుపు రంగు కలబోతతో కనిపిస్తుంది.
ఒలింగిటో
దీనిని 2013లో కొలంబియా, ఈక్వేడార్ ప్రాంతంలోని క్లౌడ్ అడవుల్లో కనుగొన్నారు. ఇవి రక్కున్ జాతికి చెందినవి. ఇవి చూసేందుకు చిన్నపాటి ముంగిసల లాగా కనిపిస్తాయి.
గాంబియన్ ముంగిస
దీనిని 2011లో ఆగ్నేయ సెనెగల్, గాంబియా ప్రాంతంలో గుర్తించారు. ఇది సన్నని ముంగుస్ జాతికి చెందినవి. చిన్న చిన్న కీటకాలను, పురుగులను తింటూ జీవిస్తుంటాయి.
కంబోడియన్ డాల్ఫిన్
2005లో కంబోడియాలోని మేకాంగ్ నదిలో దీనిని గుర్తించారు. వాస్తవానికి డాల్ఫిన్లు ఉప్పునీటి సముద్రంలో జీవిస్తుంటాయి. ఈ డాల్ఫిన్లు మాత్రం నదీ జలాలలో జీవనం సాగిస్తుంటాయి. ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి.