Ongole: జీతం వచ్చిన రోజే డబ్బులు అడిగిన కొడుకు.. దానికి ఆ తండ్రి ఏం చేశాడంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో త్రిపురాంతకం అనే గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతడికి అధికారులు ఈవీఎంలు భద్రపరిచే గోదాం వద్ద పహారా సాగించే విధులు కేటాయించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 2, 2024 6:18 pm

Ongole

Follow us on

Ongole: రోజురోజుకు మనుషుల్లో క్షమాగుణం తగ్గిపోతోంది. కనీసం ఎదుటి మనిషి చెప్పే విషయాన్ని వినేంత ఓపిక కూడా లేకుండా పోతోంది. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, ఆవేశానికి గురై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటివల్ల దారుణమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం వంటి సంఘటనలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ఉదంతాలతో చాలా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇలా ఒక కానిస్టేబుల్ తన కొడుకు విషయంలో తొందరపాటుకు గురికావడం.. క్షణికావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడంతో కలకలం చెలరేగింది. చివరికి అది ఆ కుటుంబంలో అంతులేని శోకాన్ని నింపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో త్రిపురాంతకం అనే గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతడికి అధికారులు ఈవీఎంలు భద్రపరిచే గోదాం వద్ద పహారా సాగించే విధులు కేటాయించారు. ఇందులో భాగంగా అతడు శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన కొడుకు శశి కుమార్ (22) తో కలిసి గోదాం వద్దకు వచ్చాడు. వాస్తవానికి ఈవీఎంలు భద్రపరిచే గోదాం వద్దకు అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది తప్ప.. ఇతరులు ప్రవేశించకూడదు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ప్రసాద్ తన కుమారుడిని వెంట తీసుకెళ్లాడు.

అక్కడికి వెళ్లిన తర్వాత శశికుమార్ తన తండ్రితో మాట్లాడాడు.. ఒకటో తేదీ కావడంతో తనకు అవసరాలు ఉన్నాయని.. వేతనం తాలూకు డబ్బులలో తనకు కొంత ఇవ్వాలని తండ్రిని కోరాడు. దానికి డబ్బు ఇవ్వబోనని ప్రసాద్ స్పష్టం చేశాడు. అయినప్పటికీ శశి కుమార్ బెట్టు వీడలేదు. పైగా ప్రసాద్ ను గట్టిగా నిలదీశాడు. దీంతో విచక్షణ కోల్పోయిన ప్రసాద్ ఒక్కసారిగా తన వద్ద ఉన్న తుపాకీతో కుమారుడి ఛాతీ మీద ఎక్కుపెట్టి ఒక రౌండ్ గట్టిగా కాల్చాడు. దీంతో శశి కుమార్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. బుల్లెట్ల సౌండ్ విన్న తోటి ఆర్ కానిస్టేబుళ్లు అక్కడికి వచ్చారు. అప్పటికి కోపం చల్లారని ప్రసాద్.. మరో రౌండ్ కాల్పులు జరిపేందుకు ప్రయత్నిస్తుండగా.. వారు నిలువరించారు. అనంతరం అతడిని నియంత్రించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. శశి కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా, శశి కుమార్ దేనికోసం ప్రసాద్ ను డబ్బులు అడిగాడు? అతడు ఎందుకు కాదన్నాడు? అనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.