Sajjanar video goes viral: సోషల్ మీడియా వినియోగం పెరుగుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్.. అపరిమితమైన డాటా ఉండడంతో చాలామంది సోషల్ మీడియాలో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ అనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అలా రీల్స్ చేయడం ద్వారా సెలబ్రిటీలను కావచ్చు అనే ఒక భ్రమ చాలామందిలో ఉంది. ముఖ్యంగా యువతలో ఇది ఎక్కువగా ఉంది. తాము రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలని చాలామంది భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రీల్స్ చేస్తున్నారు. అయితే ఈ రీల్స్ చేసే విధానంలో యువత అనుసరిస్తున్న విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి. కొంతమంది యువకులైతే ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనికిమాలిన పనులు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
ఇటీవల మహారాష్ట్రలో రీల్స్ చేస్తూ ఓ యువతి లోయలో పడి చనిపోయింది.. మరో యువతి కర్ణాటకలో రీల్స్ చేస్తూ జలపాతం లో పడి తీవ్రంగా గాయపడింది. ఆ మధ్య ముంబైలో యువకుడు లోకల్ ట్రైన్ లో రీల్స్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు.. ఎన్నో ఘోరాలు. అయినప్పటికీ యువత మారడం లేదు. మారే అవకాశం కూడా కనిపించడం లేదు.
తాజాగా టీజీ ఆర్టీసీ ఎండి సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ యువకుడు రైలు పట్టాల కింద పడుకున్నాడు. ఆ రైలు వెళుతున్నంత సేపు అతడు అలానే ఉన్నాడు. రైలు వెళ్లిపోయిన తర్వాత ప్రపంచాన్ని జయించినట్టు విజయ సంకేతం చూపించాడు. వాస్తవానికి అతడు రైలు పట్టాల మీద పడుకుంది రీల్స్ కోసమట. ఇలాంటి రీల్స్ చేసి అతడు ఓవర్ నైట్ లో సెలబ్రిటీ కావాలట. ఇదే విషయాన్ని సజ్జనార్ వెల్లడించారు..
Also Read: ‘చెత్త’ వివాదం.. ఇళ్లు పీకి పందిరి వేసిన మహిళలు.. లోకల్ ఫైట్ వైరల్!
“పిల్లలకు సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో స్టార్ అయిపోవాలని భావన పెరిగిపోయింది. అందువల్లే రీల్స్ పిచ్చితో ఇలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు సమాజానికి మంచివి కావు. కుటుంబాలకు మంచివి కాదు. ముఖ్యంగా రీల్స్ చేసే వారికి అసలు మంచివి కావు. ఇటువంటి వాటిని ప్రారంభంలోనే తొక్కిపెట్టాలి. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు ఇవ్వడం మానేయాలి. అప్పుడే ఇలాంటి దారుణాలకు చెక్ పెట్టొచ్చని” సజ్జనార్ తన ట్వీట్ లో వెల్లడించారు..
సజ్జనార్ ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా తన ఆవేదనను సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేశారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోయి ఆత్మహత్య చేసుకున్న వారి ఉదంతాలను బయటి ప్రపంచానికి పరిచయం చేశారు. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఆయన ఉదహరించారు. తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ కు మోసం చేస్తున్న సెలబ్రిటీలను బయటపెట్టింది సజ్జనారే. ఆ తర్వాతే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. వారిపై తెలంగాణ పోలీస్ శాఖ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడం లేదు.
చిన్నతనం నుంచే రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురైతుండటం అత్యంత బాధాకరం.
సోషల్ మీడియా మత్తులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు.
ఇలాంటి సోషల్ మీడియా వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే.. ఎంతో మంది పిల్లలు, యువకుల భవిష్యత్… pic.twitter.com/9fARKsua25
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 7, 2025