Life Change : ఇటీవల కొందరు ప్రముఖులు చెబుతున్న ప్రకారం.. సుఖం కంటే కష్టాన్ని కోరుకోవాలి అని అంటున్నారు. అయితే ఈ మాటలు విన్న కొంతమంది యూత్ ఆశ్చర్యపోతున్నారు. కష్టానికి కోరుకోవడం ఏంటి? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. కానీ కష్టంగా ఉండాలని ఎందుకు అనుకుంటారు? అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అసలు సుఖం అంటే ఏమిటి? కష్టమంటే ఏమిటి? కష్టం ఎప్పుడు కలుగుతుంది? సుఖం ఎప్పుడు ఉంటుంది? అనే వివరాల్లోకి వెళ్దాం.
ప్రస్తుత కాలంలో కొంతమంది యూత్ తమ కెరీర్ పై దృష్టి పెడుతున్నారు. భవిష్యత్తులో ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలన్న లక్ష్యాన్ని పెట్టుకొని అందుకోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. మరి కొంతమంది మాత్రం తమ జీవితాన్ని ఈజీగా గడిపేస్తున్నారు. అంటే తల్లిదండ్రులపై ఆధారపడి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇలాంటి గోల్ లేకుండా.. తాత్కాలికంగా ఉన్న సుఖాలను కోరుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
కొందరు పెద్దలు చెబుతున్న ప్రకారం ఇప్పుడు కష్టపడితే.. భవిష్యత్తులో సుఖపడతారు.. అని అంటారు. వారు చెప్పింది అక్షరాల నిజమని కొందరు నిరూపించారు కూడా. ఇప్పుడు కష్టం అంటే.. ఇష్టం లేకున్నా చదువుకోవడం.. క్రమ పద్ధతిలో ఉండడం.. ఆహారాన్ని నియంత్రించుకోవడం.. స్నేహితులతో ఎక్కువగా ఉండకుండా కేవలం చదువు పైనే ఫోకస్ పెట్టుకోవడం.. స్కూలు లేదా కళాశాలలో ఇచ్చిన హోంవర్క్ ను బలవంతంగా నైనా పూర్తి చేయడం.. అవసరానికి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోయినా కొన్ని అవసరాలను దూరం చేసుకోవడం వంటివి ఉంటాయి. వీటిని దూరం చేసుకున్న వాళ్లు.. కేవలం చదువు పైనే ఫోకస్ పెట్టిన వాళ్ళు.. డిసిప్లిన్ కోసం ఆరాటపడే వాళ్ళు.. ఇప్పుడు కష్టపడినా.. భవిష్యత్తులో వీరికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.
Also Read: రియల్ కుంభకోణం.. స్టార్ హీరో మహేష్ బాబుకు మరో నోటీసులు.. టాలీవుడ్ లో కలకలం!
ఆహారాన్ని ఇప్పుడు నియంత్రించుకున్న వారు.. భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. డిసిప్లిన్ కోసం ఇప్పుడు క్రమ పద్ధతిలో ఉన్నవారు.. పెద్దయ్యాక క్రమశిక్షణతో ఉంటూ సమాజంలో గుర్తింపును పొందుతారు. అలాగే చదువుపై ఫోకస్ పెట్టిన వాళ్ళు ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు సాధించి హాయిగా ఉండగలుగుతారు.
అలా కాకుండా కొందరు తాత్కాలికంగా సుఖాన్ని కోరుకుంటూ ఉన్నారు. తాత్కాలిక సుఖమంటే.. ఇష్టం వచ్చినట్లు ఆహారం తినడం.. మద్యం సేవించడం.. స్నేహితులతో కలిసి సమయాన్ని వృధా చేయడం.. చదువుకోకుండా అవాయిడ్ చేస్తూ జులాయిగా తిరగడం వంటివి చేస్తున్నారు. ఇలా చేస్తే తాత్కాలికంగా వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా వారు ఇష్టపూర్వకంగా ఉండగలుగుతారు. కానీ భవిష్యత్తులో అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. మద్యం సేవించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. స్నేహితులతో కలిసి ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు.. కానీ పెద్దయ్యాక ఎవరు ఉండరు.. ఆపదలో ఆదుకోవడానికి ఎవరు ముందుకు రారు.. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. మరి అలాంటి వారి కోసం ముందే సంసిద్ధమై ఉండాలి కదా..
ఇలా తాత్కాలికంగా సుఖాన్ని కోరుకోకుండా.. కష్టం వైపే వెళుతూ.. ప్రణాళిక బద్దంగా చదువుతూ.. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ.. దానికోసం కష్టపడుతూ ఉండాలి. అప్పుడే అనుకున్న విజయం సాధించే అవకాశం ఉంటుంది.