Passing Celebration: ఏం చేస్తావో తెలియదు. ఎలా చదువుతావో తెలియదు. పదిమంది మన పరువు పోకూడదు. ఎదురింటి వెంకటలక్ష్మి కొడుకు కంటే.. పక్కింటి సుబ్బారావు అబ్బాయి కంటే.. వెనకాల ఉన్న అబ్బాయి కంటే.. మార్కులు ఎక్కువ రావాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలి. అవసరమైతే రాత్రిపూట ఎక్కువసేపు చదువు. ఉదయం కూడా వెంటనే లేచి చదువు. ఇదిగో ఇలా ఉంటాయి సగటు తల్లిదండ్రుల ఆలోచనలు.. పిల్లల మీద తమ ఆకాంక్షలు.
పిల్లల మీద ఈ స్థాయిలో ఒత్తిడి పెట్టడంతో వారు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. కేవలం మార్కులు సాధించే యంత్రాలుగానే తమను చూస్తుంటారని బాధ పడిపోతుంటారు. కొన్ని సందర్భాలలో ఒత్తిడి తట్టుకోలేక కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆ సమయంలో పిల్లలు తీసుకున్న ఆ నిర్ణయాలు తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుచుతూ ఉంటాయి. ఫలితాల సమయంలో అనుకున్న మార్కులు రాకపోతే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. తమలోపామే కుమిలిపోతారు. దీనికి తల్లిదండ్రుల ఒత్తిడి తోడు కావడంతో విద్యార్థులు మరింత ఇబ్బంది పడతారు.
సమాజం మార్కుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో.. ఈ తల్లిదండ్రులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నారు. మహారాష్ట్ర చెందిన వీరు.. తమ పిల్లల విషయంలో కొత్త వొరవడి సృష్టించారు. 10 ఫలితాలలో తమ కొడుకుకు 55% మార్కులు రావడంతో కేక్ కట్ చేశారు. బంధువులను పిలిచి వేడుకలు జరిపారు. తమ కొడుకు సాధించిన మార్కులు గర్వకారణమని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కొడుకులో పట్టుదల చూశామని.. పాస్ కావాలి అని అతడి తపన తమను కదిలించిందని.. అందువల్లే అతడు ఉత్తీర్ణత సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ స్థాయిలో వేడుకలు జరుగుతున్నట్టు ఆ తల్లిదండ్రులు చెప్పారు.
విద్యార్థిచేత కేక్ కట్ చేసి.. బంధువులను పిలిచి ఆ కుటుంబం వేడుక జరిపింది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. ఇప్పటికే 16 మిలియన్ల మంది ఈ వీడియోని వీక్షించారు. ఇంకా వీక్షించేవారు పెరిగిపోతున్నారు. పిల్లల మీద ఒత్తిడి పెంచకూడదు. వారిని ఇబ్బంది పెట్టకూడదు. మార్కులు సాధించే యంత్రాలుగా చూడకూడదు. ఈ విధానాలను ఆ తల్లిదండ్రులు పాటించారు కాబట్టే.. వారి కుమారుడు పాస్ అయ్యాడు. అదే కాదు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. దీనంతటికీ కారణం ఆ తల్లిదండ్రులే.
