Maharaja Jai Singh: ‘రోల్స్ రాయిస్’ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని గురించి దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. రోల్స్ రాయిస్ కార్లను అత్యాధునిక ఫీచర్లతో రూపొందిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోల్స్ రాయిస్ కంపెనీ మీద ఓ భారతీయ రాజు పగ తీర్చుకున్నారట. అది కూడా వీధులను శుభ్రం చేయించి… ఇంతకీ ఆ భారతీయ రాజు ఎవరు? ఆ కంపెనీ మీద పగ ఎందుకు పెట్టుకున్నారు? తెలుసుకోవాలనుకుంటున్నారా?
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ( 1914 -1918) రోల్స్ రాయిస్ కంపెనీ సుమారు ఇరవై వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేస్తే.. అందులో ఇరవై శాతం భారతదేశానికే దిగుమతి చేయబడేవట. ఆ కాలంలో ఇండియాలో దాదాపు 230 మంది మహారాజులు ఉన్నారని తెలుస్తోంది. దేశంలో సగటున రెండు వేల రోల్స్ రాయిస్ ఉన్నాయన్న మాట. అంతేకాదు ఆ రోజుల్లో ఇండియన్ కింగ్స్ కు, రోల్స్ రాయిస్ కు మధ్య అనుబంధం కూడా చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు.
రాజస్థాన్ లోని అల్వార్ కు చెందిన ప్రముఖ మహారాజు జైసింగ్ ఒకేసారి మూడు రోల్స్ రాయిస్ లను కొనుగోలు చేసేవారు. ఈ క్రమంలోనే 1920 సంవత్సరంలో అల్వార్ మహారాజు జైసింగ్ లండన్ లోని మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నారు. సాధారణ వస్త్రధారణలో ఉన్న ఆయన రోల్స్ రాయిస్ షోరూమ్ లోకి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ఓ బ్రిటీష్ సేల్స్ మాన్ మహారాజా జై సింగ్ ను చూసి చూడనట్లు వ్యవహారించాడు. దీన్ని అవమానంగా భావించిన మహారాజు వెంటనే తన హోటల్ గదికి వెళ్లిపోయారు.
తరువాత జై సింగ్ తన సేవకులతో షోరూమ్ కు కాల్ చేయించి.. అల్వార్ నగర రాజువారి కార్లలో కొన్నింటిని తాను కొనుగోలు చేయబోతున్నట్లుగా తెలిపారు. దీంతో రాజు రాకను పురస్కరించుకుని షోరూమ్ లోని సేల్స్ మెన్స్ అందరూ బారులు తీరడంతో పాటు రెడ్ కార్పెట్ పరిచారు. అప్పుడు రాజు షోరూమ్ ను సందర్శించి.. అక్కడ ఉన్న ఆరు కార్లు ఉంటే అన్నింటినీ ఒకేసారి కొనుగోలు చేశారు. డెలివరీ ఛార్జీలతో సహా పూర్తి మొత్తాన్ని చెల్లించారు.
ఆరు రోల్స్ రాయిస్ దేశంలో దిగుమతి అయ్యాక.. ఆ కార్లను నగరంలోని వీధులను ఊడ్చేందుకు ఉపయోగించాలని మున్సిపాలిటీని ఆదేశించారు. అతి తక్కువ సమయంలోనే ఈ వార్త యావత్ ప్రపంచం అంతా వ్యాపించింది. ఈ క్రమంలోనే వరల్డ్ నంబర్ వన్ కార్ల తయారీ సంస్థగా ఉన్న రోల్స్ రాయిస్ సైతం షాక్ అయింది. అంతేకాదు రాజు చర్యలతో కంపెనీకి అప్పటివరకు ఉన్న గుడ్ విల్, ఆదాయం ఒక్కసారిగా పతనం అయ్యాయి.
చివరకు.. రోల్స్ రాయిస్ తమ ప్రవర్తనకు క్షమాపణ చెబుతూ మహారాజా జై సింగ్ కు టెలిగ్రామ్ పంపింది. దాంతో పాటుగా మరో ఆరు సరికొత్త కార్లను ఉచితంగా అందించింది. దీంతో రోల్స్ రాయిస్ కంపెనీ క్షమాపణలు అంగీకరించిన రాజు జైసింగ్ చెత్తను సేకరించడానికి ఆ కార్లను వినియోగించడం మానేయాలని మున్సిపాలిటీకి సూచించారు.
అయితే ఈ కథ ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.. అంతేకాదు..భారత రాజు దెబ్బకు.. రోల్స్ రాయిస్ అబ్బా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతుండటం విశేషం.