Himachal Nurse Kamala Devi: ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలామందికి నిర్లక్ష్యం ఉంటుంది.. పనిచేసినా చేయకపోయినా ఫస్ట్ తారీఖు జీతం వస్తుందనే భరోసాతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. తమకు కేటాయించిన శాఖలో పనిచేయకుండా కాలాన్ని వెళ్లదీస్తూ ఉంటారు.. అనేక సందర్భాలలో పనిచేయడానికి లంచాలు కూడా వసూలు చేస్తూ ఉంటారు. అటువంటి ఉద్యోగులు ఈమెను చూసి నేర్చుకోవాలి. నేర్చుకోవడం మాత్రమే కాదు పాటించాలి కూడా..
Also Read: ఆ వైసీపీ సీనియర్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
అది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం.. మండి జిల్లాలోని హురాంగ్ గ్రామం. ఈ గ్రామంలో ఇటీవల కాలంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. పైగా ఈ గ్రామం కొండలపైన, గుట్టల పైన ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా పేదలు నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఇక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చిన్న పిల్లలకు టీకాలు వేయడం ఇబ్బందికరంగా మారింది. పైగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏవైనా అంటూ వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా వారికి ఉంది. ఇలాంటి సమయంలో వారికి టీకాలు వేయాలని.. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని ఓ ఆరోగ్య కార్యకర్త ప్రాణాలకు తెగించింది. తనలో ఉన్న అమ్మతనాన్ని బయటకి తీసుకొచ్చింది. ప్రాణాలకు తెగించి ఏకంగా ఇంజక్షన్లు వేయడానికి ముందుకు వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ఉప్పొంగే వరద.. భీకరమైన కొండ రాళ్లు.. కాలు జారిందా ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే.. అలాంటి చోట ఆరోగ్య కార్యకర్త చిన్నారులకు టీకాలు వేయాలని సంకల్పంతో ముందుకు వెళ్ళింది. ఆమె సంకల్పం ముందు ఇవన్నీ కూడా చిన్న పోయాయి. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భీకరంగా ప్రవహిస్తున్న వాగును సైతం ఆమె లెక్కచేయకుండా ముందుకు వెళ్ళింది. బండ రాళ్లపై దూకుతూ ముందుకు సాగింది. హురాంగ్ గ్రామంలో చిన్నారులకు టీకాలు వేసింది. ఇంతకు టీకాలు వేసిన ఆ ఆరోగ్య కార్యకర్త పేరు కమలాదేవి. ఆమెకు ప్రతినెలా వచ్చే వేతనం మహా అయితే 12వేలకు మించదు. అయినప్పటికీ ఆమె తన ప్రాణాలకు తెగించి చిన్నారులకు టీకాలు వేసింది. ఉద్యోగ నిర్వహణలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వీక్షణలు సొంతం చేసుకుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా కమలాదేవి మన్ననలు పొందుతున్నది. ఇటువంటి ఆరోగ్య కార్యకర్తలను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని.. వారికి పురస్కారాలు అందించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కోరుతున్నారు.