Karana Balaram Son: ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకు( CM Chandrababu) సమకాలీకులు చాలామంది ఉన్నారు. కొందరు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోగా వారి వారసులను బరిలో దించారు. అయితే ఇటువంటి నాయకులంతా ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఒకరిద్దరు సైతం ఇతర పార్టీల్లో కొనసాగుతున్నారు. కానీ తమ పిల్లలకు సరైన రాజకీయ భవిష్యత్తు ఇవ్వలేదన్న బెంగ వారిని వెంటాడుతోంది. అటువంటి వారిలో సీనియర్ నేత కరణం బలరాం ఒకరు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు బలరాం. 1978లో చంద్రబాబుతో పాటు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. కానీ బలరాం కు ఒక లోటు ఉంది. మంత్రి పదవి నిర్వర్తించలేకపోవడం ఆయనకు ఉన్న లోటు. ప్రస్తుతం తన కుమారుడు వెంకటేష్ కు సరైన రాజకీయ భవిష్యత్తు కల్పించాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కానీ క్రియాశీలకంగా లేరు. వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడికి మంచి అవకాశం చూపించాలన్న ప్రయత్నంలో ఆయన ఉన్నారు.
కొద్దిరోజులుగా సైలెంట్..
మొన్నటి ఎన్నికల్లో కరణం బలరాం( karanam Balaram) కుమారుడు వెంకటేష్ చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు కరణం బలరాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఓ వివాహ వేడుకలో చంద్రబాబును కలిశారు బలరాం. ఇద్దరూ కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. దీంతో బలరాం టిడిపిలోకి ఎంట్రీ ఇస్తారని తెగ ప్రచారం జరిగింది. ఆయన సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉండడంతో తిరిగి చేరిక ఖాయమని టాక్ నడిచింది. అయితే ఏడాది అవుతున్న బలరాం విషయంలో ఎటువంటి కదలిక లేదు. అయితే బలరాం ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: ఆ మంత్రిని పడగొట్టే పనిలో జగన్.. సీనియర్ కు బాధ్యతలు!
సుదీర్ఘ నేపథ్యం..
రాజకీయాల్లో కరణం బలరాం ది సుదీర్ఘ నేపథ్యం. ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. ప్రకాశం జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు. ప్రకాశం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. కానీ 2019 ఎన్నికల్లో గెలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఫిరాయించారు. అదే తన తప్పిదంగా బలరాం భావిస్తున్నారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉండి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదురుకావడంతో ఆ పార్టీలో చేరారు. అప్పటినుంచి అయిష్టగానే ఆయన కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. తెలుగుదేశం పార్టీని వీడడం తప్పుడు చర్యగా అభిప్రాయపడ్డారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీ వైపు ఆయన చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
కాంగ్రెస్ పార్టీ( Congress Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కరణం బలరాం. అప్పట్లో ఒంగోలు పర్యటనకు వచ్చిన ఇందిరా గాంధీ పై దాడికి ప్రయత్నం జరిగింది. ఆమెను కాపాడడం ద్వారా మరింత ప్రాచుర్యం పొందారు బలరాం. 1978లో కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించడంతో ఒంగోలు నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అదే సమయంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు సైతం తొలిసారిగా ఎమ్మెల్యేలు అయ్యారు. టిడిపి ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ పిలుపుమేరకు ఆ పార్టీలో చేరారు. వరుసగా ఆ పార్టీ నుంచి ఐదు సార్లు గెలిచారు. 1999లో ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి చాన్స్ ఇచ్చారు చంద్రబాబు. అయితే జగన్ ప్రభంజనంలో టిడిపి కొట్టుకుపోయింది. కానీ చీరాల నుంచి బలరాం గెలిచారు. కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. మొన్నటి ఎన్నికల్లో బలరాంకు బదులు కుమారుడు వెంకటేష్ పూర్తి చేసి ఓడిపోయారు.
Also Read: టిడిపిలోకి వైసీపీ సీనియర్?
కుమారుడి కోసమే
గత కొద్దిరోజులుగా కరణం బలరాం తో పాటు కుమారుడు వెంకటేష్ సైలెంట్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అంతంత మాత్రమే. తన పూర్వశ్రమం అయిన తెలుగుదేశం పార్టీ నుంచి కుమారుడు వెంకటేష్ భవిష్యత్తుపై మంచి భరోసా వస్తే పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి సంతనూతలపాడు నియోజకవర్గం రిజర్వేషన్ మారుతుందని.. అదే జరిగితే ఆ స్థానం నుంచి తన కుమారుడిని పోటీకి దించాలని బలరాం భావిస్తున్నారట. అందుకే పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారట. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.