Chandanki Village Gujarat: తీగల కు కాయలు ఎప్పుడూ బరువు కావు. కానీ కాయలు కచ్చితంగా తీగలను బరువనే అనుకుంటాయి. కాయలు ఎంత బరువుగా ఉన్నా సరే తీగలు మోస్తూనే ఉంటాయి. ఆ బరువును మోసేటప్పుడు అవి ఆనందాన్ని అనుభవిస్తుంటాయి. సంతోషాన్ని నింపుకుంటాయి. కానీ కాయలు అలా భావించవు. అలాంటి అనుభూతులను నింపుకోవు. ఇదే ఉపోద్ఘాతాన్ని మనుషుల జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఎంతమంది నైనా సరే తల్లిదండ్రులు ప్రేమిస్తారు. వారిని సాకుతారు. అదే పిల్లలు తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి అలా ఉండలేరు. అలా ఉంచుకోనూ లేరు. ఇది కేవలం ఓ రాష్ట్రానికో, ఓ జిల్లాకో, మండలానికో, గ్రామానికో పరిమితమైంది కాదు.. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉంది.
మనదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. కాకపోతే అక్కడి సర్పంచ్ తీసుకున్న నిర్ణయం ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఎంతో ఆసరాగా ఉంది. గుజరాత్ రాష్ట్రంలో చందంకి అనే గ్రామం ఉంది. గ్రామంలో ఉన్న యువకులు మొత్తం చదువులు, ఉపాధి నిమిత్తం నగరాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆ గ్రామంలో కేవలం వృద్ధ తల్లిదండ్రులు మాత్రమే మిగిలిపోయారు. మొత్తంగా ఆ గ్రామంలో 500 మంది నివసిస్తున్నారు. అయితే ఇందులో వృద్ధులే ఎక్కువ శాతం ఉన్నారు. ఆ వృద్ధులు ఆహారం వండుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. పైగా వారికి వయసు కూడా సహకరించకపోవడంతో నరకం చూస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులు పడుతున్న బాధలు చూడలేక ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు..
చందంకి గ్రామ సర్పంచ్ గా పూనం బాయ్ పటేల్ కొనసాగుతున్నారు. ఈ గ్రామంలో ఉన్న వృద్ధ తల్లిదండ్రుల కోసం సర్పంచ్ కమ్యూనిటీ డైనింగ్ అనే సంస్కృతిని తీసుకువచ్చారు. దీని ప్రకారం ప్రతి ఒక్కరి నుంచి 2000 వరకు విరాళంగా సేకరిస్తారు. ప్రొఫెషనల్ కుక్ లతో వంటలు వండిస్తారు. అలాగని ఆ వంటలు నాసిరకంగా ఉండవు. మెండైన పోషకాలతో నిండి ఉంటాయి. ఆ పోషకాహారాన్ని వృద్ధులైన తల్లిదండ్రులకు వడ్డిస్తారు. పైగా ఆ గ్రామంలో ఉన్న వృద్ధులు మొత్తం ఒకే చోట ఆహారం తింటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అక్కడే చేస్తారు. టీ, కాఫీలు కూడా వృద్ధులకు అందిస్తుంటారు.
కొన్ని సందర్భాలలో సాయంత్రం పూట స్నాక్స్ కూడా అందిస్తుంటారు.. ఏదైనా వేడుకలు జరిగినప్పుడు ప్రత్యేకమైన ఆహార పదార్థాలు వడ్డిస్తుంటారు. వృద్ధులైన తల్లిదండ్రుల కోసం బలవర్ధకమైన ఆహారాన్ని అందించడానికి ఆ గ్రామ సర్పంచ్ ఈ ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇచ్చిన ₹2000 కేవలం ఆహార పదార్థాలు, ఇతర వాటికి మాత్రమే సరిపోతున్నాయి. ఆహారం తయారుచేసే వంటవాళ్లకు సర్పంచ్ డబ్బులు ఇస్తుండడం విశేషం. అయితే చందంకి గ్రామ సంప్రదాయాన్ని దేశం మొత్తం విస్తరిస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.