Bombay High Court: సినిమాలలో చూస్తుండగానే అద్భుతాలు జరుగుతుంటాయి. నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒకప్పుడు ఇటువంటివి అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, ప్రధాన మీడియా విస్తృతం రావడంతో ఇటువంటి సంఘటనలు వ్యాప్తిలోకి వస్తున్నాయి.
మనలో చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది. కాకపోతే ఎలా సంపాదించాలో తెలియక చాలామంది జీవితాలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి స్థాయిలోనే ఉండిపోతాయి. ఒకవేళ డబ్బు సంపాదించాలని ఏదైనా అక్రమ మార్గంలోకి వెళ్తే.. త్వరలోనే దొరికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొంతమందికి మాత్రం అదృష్టం వెంటనే తలుపు తడుతుంది. లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుంది. అంతకుమించి అనే స్థాయిలో డబ్బులు ప్రసాదిస్తుంది. అటువంటిదే ఈ సంఘటన కూడా.
ముంబై నగరానికి చెందిన గజానన్ అనే వ్యక్తి ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. 2021 అక్టోబర్ నెలలో కోటక్ సెక్యూరిటీస్ లో ట్రేడింగ్ కం డి మ్యాట్ ఎకౌంటు ఓపెన్ చేశాడు. 2022న అతని అకౌంట్లో కోటక్ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ సంస్థ పొరపాటున 40 కోట్లు అతని ఖాతాలో జమ చేసింది. ఈ విషయం తెలిసినప్పటికీ అతడు వెంటనే ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడిలో పెట్టాడు. ఉదయం లేచి చూసుకునేసరికి ఏకంగా కోటి 75 లక్షల రూపాయల లాభం వచ్చింది. మొత్తం కలిపి 41 కోట్ల 75 లక్షలు అతని ఖాతాలో ఉన్నాయి.
ఈ వ్యవహారం బాంబే హైకోర్టు దాకా వెళ్ళింది. బాంబే హైకోర్టు 2025 డిసెంబర్ 24న ఈ కేసు కు సంబంధించి తీర్పు ఇవ్వడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి. నాడు గజానన్ ఖాతాలో 40 కోట్లు జమ అయిన విషయాన్ని కోటక్ సెక్యూరిటీస్ వెంటనే గమనించింది. వెంటనే ఆ వ్యక్తిని సంప్రదించింది. అయితే గజానన్ వెంటనే సెక్యూరిటీస్ సంస్థకు అందించాడు. అయితే ఈ డబ్బులు పెట్టుబడిగా పెట్టి సంపాదించిన 1.75 కోట్ల లాభం కూడా తమకు ఇవ్వాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. దానికి గజానన్ ఒప్పుకోలేదు. ఫలితంగా ఇద్దరు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.
ఈ కేసు అత్యంత క్లిష్టమైనది కావడంతో బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రేడర్ సంపాదించిన 1.75 కోట్లు అతడికి దక్కుతాయని పేర్కొంది.. అతడు 1.75 కోట్లు సంపాదించిన వ్యవహారంలో ఎటువంటి మోసానికి పాల్పడలేదని.. అక్రమంగా వెనుక వేయలేదని.. కోటక్ సంస్థకు కూడా నష్టం జరగలేదని అభిప్రాయపడింది. లాభాన్ని తమకు ఇస్తే 50 లక్షల వరకు తిరిగి ఇస్తామని కోటక్ గజానన్ కు ఆఫర్ ఇచ్చింది. అయితే దానిని అతడు వద్దనుకున్నాడు. అయితే ఈ కేసులో తదుపరి విచారణ వరకు లాభం వచ్చిన కోటి 75 లక్షల గజానన్ వద్ద ఉంచాలని కోర్టు పేర్కొంది. అంతేకాదు ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది.