Musalamma temple hundi theft: దేవుడు సర్వాంతర్యామి. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా సరే మసి కావాల్సిందే. శూన్యంలో కలసిపోవాల్సిందే. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు.. అసాంఘిక పనులు చేసేవారు.. అడ్డగోలుగా వ్యవహరించేవారు కచ్చితంగా దేవుడికి భయపడతారు. ఈ కథనంలో ఓ వ్యక్తి తప్పు చేశారు. చేసిన తప్పును తెలుసుకొని దేవుడు ముందు తలవంచాడు. క్షమించమని వేడుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో చోటు చేసుకుంది.
నెల క్రితం ఏం జరిగిందంటే
అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రంలో సరిగ్గా నెల క్రితం అమ్మవారి హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. అందులో ఉన్న నగదును.. ఇతర వస్తువులను తీసుకున్నారు. హుండీని ఎత్తుకుపోయిన ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ సంఘటనకు పాల్పడింది ఎవరో చెప్పలేకపోయారు. అప్పటినుంచి ఈ సంఘటన గ్రామంలో చర్చకు దారి తీసింది. పోలీసులకు కూడా దొంగలు ఎవరో తెలియకపోవడంతో ఈ కేసు ఒక మిస్టరీగా మారింది. గ్రామంలో అప్పుడప్పుడూ ఈ సంఘటన గురించి చర్చ జరగడం.. దొంగలు ఎవరు అనే విషయంపై గ్రామస్తులు మాట్లాడుకోవడం.. ఇలా సాగిపోతోంది అక్కడి వ్యవహారం. ఇదంతా జరుగుతుండగానే అనూహ్యంగా దొంగ ఎవరో తేలింది. ఊహించని పరిణామం ద్వారా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
హుండీని ఎత్తుకెళ్లిన నాటి నుంచి..
ఈ హుండీని ఎత్తుకెళ్లిన నాటి నుంచి ఆ దొంగ ఇంట్లో చిన్నపిల్లల ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. పైగా ఎత్తుకెళ్లిన సొమ్ములో ఒక లేఖను కూడా ఆ దొంగ పెట్టాడు.. హుండీలో సొమ్ము లక్ష వరకు లభించింది.. పోలీసుల సమక్షంలో ఆ హుండీలో ఉన్న నగదును లెక్కించారు. ఆ హుండీలో ఒక లేఖ కూడా లభ్యమైంది..”దొంగతనం చేసిన తర్వాత మా పిల్లల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. అందుకే డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నాం. దేవుడి సొమ్ము తీసుకోవడం భావ్యం కాదు. అందుకే తిరిగి ఇచ్చేస్తున్నాం” అంటూ ఆ లేఖలో దొంగ పేర్కొన్నాడు.
గ్రామంలో చర్చ
ఆ దొంగ లేఖ ను చదివిన తర్వాత గ్రామస్తులు రకరకాలుగా స్పందిస్తున్నారు. పలు విధాలుగా చర్చించుకుంటున్నారు..” దొంగకు బుద్ధొచ్చింది. దేవుడు సొమ్ము తీసుకోకూడదు. అలా డబ్బు తీసుకున్నాడు కాబట్టే దేవుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇప్పటికైనా దొంగలు తమ తీరును మార్చుకోవాలి. ముఖ్యంగా దేవుళ్ళ గుడిలో దొంగతనాలు చేసేవారు ఈ సంఘటనను గుణపాఠం చూడాలి. లేనిపక్షంలో ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. సాధ్యమైనంతవరకు దొంగతనాలు చేయకూడదు. దేవుళ్ళ సొమ్ము తస్కరించకూడదని” గ్రామస్తులు పేర్కొంటున్నారు. అయితే ఆ హుండీలో గతంలో లక్ష కంటే తక్కువగానే నగదు ఉండేదని.. దొంగకు తత్వం అర్థమై లక్ష వరకు నగదు పెట్టి క్షమాపణ లేఖ రాశాడని గ్రామస్తులు అంటున్నారు.