Buy Dresses and Footwear: ప్రస్తుతం పండగల సీజన్ కొనసాగుతోంది. త్వరలో దసరా, దీపావళి రాబోతుంది. ఈ సందర్భంగా కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని చాలామంది ఉత్సాహంగా ఉంటారు. అయితే కొన్ని రోజుల వరకు కొత్త వస్తువులు కొనుగోలు చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా టీవీ, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పుడు అస్సలు కొనొద్దు. అయితే మరికొన్ని వస్తువులను మాత్రం ఇప్పుడే కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంతకీ ఏ వస్తువులను ఇప్పుడు కొనాలి? వీటిని తర్వాత కొనుగోలు చేయాలి? అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవి..
పండుగల సందర్భంగా కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు. కానీ ఆ వస్తువులను సెప్టెంబర్ 22 తర్వాతనే కొనుగోలు చేయాలి. ఎందుకంటే సెప్టెంబర్ 22 నుంచి వస్తువుల ధరలు చాలావరకు తగ్గుతాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్టిని పూర్తిగా రద్దు చేసింది. దీంతో కొత్తగా పాలసీలు తీసుకోవాలని అనుకునేవారు సెప్టెంబర్ 22 తర్వాత తీసుకుంటే కొంతవరకు పాలసీ ప్రీమియం తగ్గే అవకాశం ఉంది.
అలాగే సెప్టెంబర్ 22 నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులపై ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీ, ఏసీ వంటి వాటిపై ఇప్పటివరకు జీఎస్టీ 28% ఉండేది. ఇప్పుడు దీనిని 18% కు తగ్గించారు. అలాగే కారు కొనుగోలు చేసే వారికి కూడా శుభవార్త అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 22 తర్వాత కారు కొనుగోలు చేసే వారికి భారీగా జీఎస్టీ తగ్గింపు ఉంటుంది. దీనిపై కూడా 28% నుంచి 18% కు తగ్గించారు. అలాగే 350 కంటే తక్కువగా ఉండే సీసీ బైక్ ల ధరలు తగ్గుతున్నాయి. వీటిపై కూడా 28% నుంచి 18% వరకు జీఎస్టీని తగ్గించారు.
నిత్యవసర వస్తువులపై కూడా భారీగా జీఎస్టీ తగ్గింది. ఇప్పటివరకు వీటిపై 18% ఉండగా ప్రస్తుతం 5 శాతానికి తగ్గించారు. అలాగే దుస్తులు, చెప్పులు వంటివి కూడా రూ.2500 కంటే తక్కువగా ఉంటే 5% జిఎస్టి మాత్రమే వర్తిస్తుంది. ఇక ఇల్లు నిర్మించుకునే వారికి కూడా శుభవార్త అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 22 తర్వాత ఇల్లు నిర్మించుకునే వారికి సిమెంటు, స్టీల్ వంటి ధరలు కూడా అదుపులోకి వస్తాయి. వీటిపై కూడా 12% జిఎస్టి ఉండగా 5% జిఎస్టి కి తగ్గించారు.
అయితే కొన్ని ఖరీదైన వస్తువులు సెప్టెంబర్ 22 కంటే ముందే కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే వీటిపై జిఎస్టి పెంచుతున్నారు. దుస్తులు, ఫుట్ wear వంటివి రూ.2500 కంటే ఎక్కువగా ధర ఉండే వాటిపై జిఎస్టి ప్రస్తుతం 12% ఉంది. అయితే వీటిపై సెప్టెంబర్ 22 తర్వాత 18% కు పెరుగుతుంది. అలాగే 350 కంటే ఎక్కువగా సీసీ ఉండే బైక్ లు కూడా ఇప్పుడే కొనడం మంచిది. సెప్టెంబర్ రెండు 22 తర్వాత వీటిపై జిఎస్టి 31% నుంచి 40% కు పెరగనుంది.