Adam Samsuddin Raisa Manal Success Story: ఉద్యోగం ఎంతటిదైనా బానిసత్వమే. వ్యాపారం ఏ పాటిదైనా స్వతంత్రమే. అందువల్లే చాలామంది నేటి కాలంలో ఉద్యోగాలను వదిలిపెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఐటి విభాగంలో పనిచేస్తున్నవారు కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించగానే.. రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. తనమీద తమ ప్రయోగాలు చేసుకుంటూ విజయవంతమవుతున్నారు. అయితే ఈ కథనంలో ఈ దంపతులను వారు పని చేస్తున్న కంపెనీలు తొలగించలేదు. వారికే ఉద్యోగం అంటే బోర్ కొట్టింది. కార్పొరేట్ జీవితమంటే విసుగు అనిపించింది. అందుకే వ్యాపారం లోకి వచ్చారు. విజయవంతమయ్యారు.
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
కేరళ రాష్ట్రానికి చెందిన ఆడం సంసుద్దీన్, రైసా మనాల్ భార్యాభర్తలు. వీరిద్దరూ ఉన్నత చదువులు చదివారు. పేరుపొందిన కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు చేస్తున్నారు. వేతనాలు కూడా లక్షల్లోనే ఉన్నాయి. ఇబ్బందిలేని జీవితం.. పైగా కార్పొరేట్ లైఫ్ స్టైల్.. కొద్దిరోజుల వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఇదంతా కూడా వారికి ఇబ్బందిగా అనిపించింది. జీవితం మొనాటని లాగా వెళ్ళిపోతుందని.. ప్రయోగాలు చేయాలని వారికి అనిపించింది. అంతే.. మరో మాటకు తావు లేకుండా వారు తమ ఉద్యోగాలను వదిలిపెట్టారు. పుట్టగొడుగుల వ్యాపారం లోకి ప్రవేశించారు.
పుట్టగొడుగుల వ్యాపారం లోకి ప్రవేశించే ముందు వారి చేతిలో ఉంది కేవలం 10 లక్షలు మాత్రమే. ఏదైతే అది అయింది అనుకొని.. పది లక్షలతో వ్యాపార మొదలుపెట్టారు. 2022లో తన పుట్టగొడుగుల వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదట్లో పుట్టగొడుగులు సరిగా వచ్చేవి కాదు. దీనికి తోడు నష్టాలు.. మ్యాన్ పవర్ కూడా అంతగా దొరికేది కాదు. ఇవన్నీ కూడా వారికి ఇబ్బందిగా అనిపించాయి. ఒక కనక దశలో ఆ కేంద్రాన్ని మొత్తం మూసివేయాలని అనుకున్నారు. కాని చివరి ప్రయత్నంగా ఏదైనా చేద్దామని అనుకున్నారు. తన పుట్టగొడుగుల్లో సేంద్రియ విధానాన్ని మరింతగా కొనసాగించారు. ఆ ఉత్పత్తులను విపరీతంగా ప్రమోట్ చేసుకున్నారు. అది క్లిక్ అయింది. ఫలితంగా వారికి తిరుగులేకుండా పోయింది. గ్రో దీ ఫంగై పేరుతో ఏర్పాటుచేసిన వారి సంస్థ అంతకంతకు ఎదగడం మొదలుపెట్టింది.
2023లో వారు ఐదు కోట్ల విలువైన పుట్టగొడుగులు విక్రయిస్తే.. 2025 ఆగస్టు నాటికి 26 కోట్ల విలువైన పుట్టగొడుగులను విక్రయించే స్థాయికి వారి వ్యాపారం ఎదిగింది. వారు తమ పుట్టగొడుగులకు ముష్పెల్లెట్స్ అని పేరు పెట్టారు. వీటి తయారీలో రైతులను కూడా భాగస్వామ్యం చేశారు. సుమారు 500 మంది రైతులు వీరి సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్యాకేజింగ్.. కస్టమర్ సర్వీస్.. ఇలా అన్ని విభాగాలను పటిష్టంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి వ్యాపారానికి అడ్డు అనేది లేకుండా పోయింది. 699 పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించిన కిట్ కూడా అందజేస్తున్నారు. ఇది వారి వ్యాపారాన్ని మరో స్థాయిలోకి తీసుకెళ్ళింది. కేవలం పుట్టగొడుగులు విక్రయించడం మాత్రమే కాకుండా.. వాటిని తయారు చేసే కిట్ కూడా అమ్మడం వీరి ప్రత్యేకత.
నేటి కాలంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి కోసం అనేక రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. కంపెనీలు కూడా ఘోరంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మొహమాటం లేకుండా ఇంటికి పంపిస్తున్నాయి. అలాంటి వారికి ఈ దంపతులు ఎంతో ఆదర్శం. ఎందుకంటే స్వయంకృషిని మించిన మార్గం మరొకటి లేదు.