Rain Dance Viral Video: సాధారణంగా వర్షం పడితే ఏం చేస్తాం.. ఇంట్లో నుంచి బయటకు రాం… బయట ఉంటే తడవకుండా తలదాచుకుంటాం.. కానీ డ్యాన్స్ ప్రోగ్రాం లో అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుండగా..కుండపోత వర్షం పడింది. అయినా కూడా ఆ కార్యక్రమాన్ని ఆపివేయకుండా నిరంతరంగా నృత్యం చేశారు. వీరు చేసిన ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఏమని కామెంట్లు చేశారంటే?
చెన్నైలోని రాజరత్నం స్టేడియంలో ఓ ప్రైవేట్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థినులు భరతనాట్యం ప్రదర్శనను ప్రారంభించారు. అయితే ప్రదర్శన మొదలైన కొద్దిసేపటికే భారీ వర్షం మొదలైంది.
వర్షం మొదలవడంతో కార్యక్రమాన్ని నిలిపివేస్తారని అందరూ భావించారు. కానీ విద్యార్థినులు మాత్రం వెనక్కి తగ్గలేదు. సంగీతానికి అనుగుణంగా సుమారు 45 నిమిషాల పాటు తమ ప్రదర్శనను తమ నృత్యాన్ని కొనసాగించారు. వర్షం తీవ్రత పెరిగినా అడుగుల్లో మాత్రం తడబాటు కనిపించకుండా సమన్వయంతో ప్రదర్శన కొనసాగించారు. వర్షపు నీటిలోనే సంప్రదాయ భరతనాట్యం చేయడం అక్కడున్న ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘వర్షం వచ్చినా కళ ఆగలేదు’..అని కొందరు కామెంట్లు పెట్టారు. అలాగే ‘అంకితభావానికి ఇదే నిదర్శనం’ అంటూ మరికొందరు స్పందించారు. వర్షం ఎంత కురిసినా.. తమ నృత్యంపై ఉన్న ప్రేమను ఆపలేమంటూ ఈ అమ్మాయిలు చూపించిన దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.