Tamil Nadu: మనదేశంలో దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. వెనుకటి కాలం నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. ఇక ఇటీవల కాలంలో మొక్కులు చెల్లించుకోవడం అనేది పెరిగిపోయింది. గ్రామదేవతలకు జాతరలు జరిగే సమయంలో మొక్కులు చెల్లించుకుంటారు. ఇక మిగతా సందర్భాలలో కూడా దేవతలకు మొక్కుబడులు సమర్పించుకుంటారు. వారి వారి మొక్కుల ఆధారంగా మొక్కుబడులు ఉంటాయి.. కొంతమంది గొర్రెపోతులు, కోడిపుంజులను బలి ఇస్తారు. మరికొందరేమో గ్రామదేవతలకు చీరే సారులను కానుకలుగా ఇస్తుంటారు. జంతువులను బలి ఇవని క్షేత్రాలలో నైవేద్యాలు వంటివి పెట్టి మొక్కులు తీర్చుకుంటారు.. మొక్కుబడులు ఎలా ఉన్నప్పటికీ.. మొక్కలు తీసుకునే విధానం మాత్రం దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది.
మనదేశంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చి చూస్తే దక్షిణాది రాష్ట్రాలలో గ్రామ దేవతలు అధికంగా ఉంటారు. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ మొక్కుల సంస్కృతి అధికంగా ఉంటుంది. గ్రామదేవతలకు జాతరలు.. ఇతర కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవార్లకు నైవేద్యాలు పెడుతూ ప్రసన్నం చేసుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన మొక్కును వెరైటీగా తీర్చుకున్నాడు. తీర్చుకోవడం మాత్రమే కాదు భక్తులకు మటన్ బిర్యానీ కూడా పెట్టాడు. ఇప్పుడు ఏకంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.
తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా పెన్నాగరం తాలూకా ఏరియూర్ కు సమీపంలోని అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ వృత్తిరీత్యా లారీ డ్రైవర్. ఇతడి భార్య పేరు హంస. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. సరిగా ఆరు సంవత్సరాల క్రితం తంగరాజ్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్ని ఆసుపత్రులలో చూపించినప్పటికీ అతని వ్యాధి నయం కాలేదు. దీంతో బంధువులు చెప్పగా పెన్నాగరం వెళ్ళాడు. అక్కడికి సమీపంలోని బి అగ్రహారం గ్రామంలో ముత్తు మారియమ్మన్ ఆలయానికి వెళ్ళాడు. అక్కడ పూజలు చేసుకున్నాడు. తనకు ఆరోగ్యం మెరుగైతే మేకలను బలి ఇస్తానని మొక్కుకున్నాడు. అతడు కోరుకున్నట్టుగానే ఆరోగ్యం మెరుగయింది. దీంతో తంగరాజ్ ఆలయానికి వచ్చి 151 మేకలను అమ్మవారికి బలి ఇచ్చాడు. ఆ తర్వాత వాటి ద్వారా మటన్ బిర్యానీ వండి భక్తులకు విందు ఇచ్చాడు. 151 మేకల కోసం తంగరాజ్ ఏకంగా 10 లక్షల వరకు ఖర్చు చేశాడు. వాస్తవానికి ఈ ఆలయ చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడూ మేకలను బలి ఇవ్వలేదు. తంగరాజ్ దాదాపు 2000 మందికి మాంసంతో విందు ఇవ్వడం విశేషం.