YSRCP MLA in liquor scam: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. ఓ ముగ్గురు ఇటీవల బెయిల్ పై బయటకు వెళ్లారు. మిగతా రిమాండ్ లో ఉన్న నేతలు సైతం డిఫాల్ట్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా 90 రోజులు రిమాండ్ దాటితే డిఫాల్ట్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకే ఆ పనిలో ఉన్నారు అరెస్ట్ అయిన నేతలు. మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం లోతైన విచారణ చేపడుతోంది. లిక్కర్ స్కామ్ లో కొత్త వ్యక్తుల ప్రమేయాన్ని బయటపెడుతోంది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రస్తావన తీసుకొచ్చింది. ఇటీవల కోర్టులో మూడో చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రకాశం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రస్తావన తీసుకురావడం గమనార్హం.
చెవిరెడ్డి కీలక పాత్ర..
ఈ కేసులో ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అప్పట్లో మద్యం కుంభకోణం లో వసూలు చేసిన నగదును.. ఎన్నికల్లో అభ్యర్థులకు పంచేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అనుమానిస్తూ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఆయన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిధిలోని పలువురు వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం మద్యం ముడుపుల సొమ్మును చేర్చారని తాజాగా ప్రస్తావించింది ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జ్ షీట్లో. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు బయట పెట్టింది సిట్. మద్యం ముడుపుల మొత్తాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో బాలాజీ కుమార్ యాదవ్ అందించారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు.. దర్శి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డికి పలుమార్లు ఫోన్ చేశారు బాలాజీ కుమార్ యాదవ్. ఇదే విషయాన్ని తాజాగా చార్జ్ షీట్ లో పేర్కొంది ప్రత్యేక దర్యాప్తు బృందం.
వైసీపీ అభ్యర్థులకు ముడుపుల సొమ్ము..
అయితే రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మద్యం ముడుపులకు సంబంధించిన మొత్తాన్ని వైసిపి అభ్యర్థులకు తరలించినట్లు స్పష్టం అవుతోంది. అయితే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. కేవలం ఆయన పేరు మాత్రమే ప్రస్తావించింది సిట్. దీంతో ఆయనకు సైతం విచారించే అవకాశం ఉంది. అయితే అప్పట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బృందం ఎవరెవరితో మాట్లాడిన విషయం ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో ఇది ఆగుతుందా? మరింత మందిని విచారించే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా తీసుకున్న మాదిరిగా మద్యం కుంభకోణం లేదు. రోజురోజుకు ఇందులో నిందితులు పెరుగుతుండడం గుర్తించాల్సిన అంశం.