Chandrababu And Jagan: చంద్రబాబుకు, జగన్ కు తేడా అదే!

కొద్దిరోజుల కిందట ఏబీ వెంకటేశ్వరరావు అనే సీనియర్ ఐపీఎస్ అధికారి పదవీ విరమణ పొందిన సంగతి తెలిసిందే . ఉదయం 10 గంటలకు విధుల్లో చేరిన ఆయన.. సాయంత్రానికి పదవీ విరమణ పొందారు.

Written By: Dharma, Updated On : June 28, 2024 11:56 am

Chandrababu And Jagan(2)

Follow us on

Chandrababu And Jagan: ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అధికారులు అనుకూలంగా పనిచేస్తారు. ఆ ప్రభుత్వానికి సలాం కొడతారు. ఇది సహజంగా వస్తున్న పరిణామమే. అయితే ఇలాంటి అధికారులు ప్రభుత్వం మారినప్పుడు మాత్రం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు. అయితే గత ఐదేళ్లుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఇద్దరు అధికారుల పదవీ విరమణ వేళ.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వానికి భిన్నంగా ఉండడంతో హాట్ టాపిక్ అయ్యింది.

కొద్దిరోజుల కిందట ఏబీ వెంకటేశ్వరరావు అనే సీనియర్ ఐపీఎస్ అధికారి పదవీ విరమణ పొందిన సంగతి తెలిసిందే . ఉదయం 10 గంటలకు విధుల్లో చేరిన ఆయన.. సాయంత్రానికి పదవీ విరమణ పొందారు. గంటల వ్యవధిలోనే ఉద్యోగంలో చేరారు.. అదే గంటల వ్యవధిలో రిటైర్మెంట్ తీసుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా జగన్ సర్కార్ ఆయన్ను వెంటాడింది. రకరకాలుగా వేధించింది. అదే స్థాయిలో కారణాలు చూపుతూ సస్పెన్షన్ వేటు వేసింది. చివరకు న్యాయస్థానం ఆదేశాలను సైతం పాటించలేదు. కోర్టు ఆదేశాలతో పాటు కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో చివరి రోజు పోస్టింగ్ ఇచ్చింది. అదే రోజు ఆయన బాధతో రిటైర్ అయ్యారు.

అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించారు చంద్రబాబు. వైసిపి ప్రభుత్వ హయాంలో జగన్ కు అత్యంత విధేయులుగా పనిచేశారు సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్ రెడ్డి, పూనం మాల కొండయ్య. టిడిపి సర్కార్ అధికారంలోకి రాగానే పక్కన పెట్టింది. వీరిద్దరిని జిఏడీలో రిపోర్టు చేయించింది. ఈ నెలాఖరున వీరిద్దరికీ రిటైర్మెంట్ ఉండడంతో వారు అడక్కుండానే పోస్టింగ్ ఇచ్చింది. మాజీ సిఎస్ జవహర్ రెడ్డికి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇవ్వగా.. సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్య కు అవకాశం ఇచ్చింది. రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఏబీ వెంకటేశ్వరరావుకు అప్రాధాన్య ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా జగన్ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది.. ఇప్పుడు మాత్రం జవహర్ రెడ్డి తో పాటు పూనం మాలకొండయ్య కు చంద్రబాబు కీలకమైన పోస్టింగులు ఇవ్వడం విశేషం.