Homeఅంతర్జాతీయంTANA Chaitanya Sravanthi : జనవరి 1న రవీంద్రభారతిలో ‘‘తానా’’ బహుజన కళామహోత్సవాలు

TANA Chaitanya Sravanthi : జనవరి 1న రవీంద్రభారతిలో ‘‘తానా’’ బహుజన కళామహోత్సవాలు

– ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రసిద్ధ బహుజన సంప్రదాయ, జానపద కళారూపాల ప్రదర్శన.
– డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు ‘‘బహుజన బంధు’’ అవార్డు ప్రధానం.
– బహుజన వర్గాల ‘‘పద్మశ్రీ’’ పురస్కార గ్రహీతలకు సత్కారం.
– ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుచే స్వీయరచన బహుజన శతకపద్య ఆలాపన.
– ముఖ్య అతిథులుగా పాల్గొననున్న రసమయి బాలకిషన్‌. బుర్రా వెంకటేశం ఐఏఎస్‌, లావు అంజయ్య చౌదరి తదితరులు.

TANA Chaitanya Sravanthi : వైవిధ్యం, వైశిష్ట్యం కల్గిన సంప్రదాయ బహుజన సాంస్కృతిక కళాప్రదర్శనలు నూతన సంవత్సరం తొలిరోజైన జనవరి 1న అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర, తారా ఆర్ట్స్‌ అకాడమి అధ్యక్షులు సంకె రాజేష్‌లు తెలిపారు. ఈ మేరకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడిరచారు. బహుజన కళా మహోత్సవాలు ` 2023 పేరిట నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ బహుజన కళాబృందాలు పాల్గొననున్నట్లు వారు తెలిపారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా ), ప్రపంచ సాహిత్య వేదిక, తానా చైతన్య స్రవంతి, తారా ఆర్ట్స్‌ అకాడమీల సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం జనవరి 1న ఉదయం 9గం॥ల నుండి రాత్రి 9గం॥ల వరకు 12 గంటల పాటుగా ఈ కార్యక్రమం కొనసాగనున్నట్లు వారు వివరించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రధాన ఆడిటోరియం వేదికగా ఈ కళామహోత్సవాలు నిర్వహింపబడతాయన్నారు. ‘‘తానా’’ తొలిసారిగా సామాజిక దృక్ఫథంతో అన్నివర్గాల కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ వైవిధ్యభరితమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు.

 

ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, ప్రముఖ బీసీ వర్గాల ప్రతినిధి డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు ‘‘బహుజన బంధు’’ పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు. ఆయన నేటి ఉభయ తెలుగు రాష్ట్రాలలో గడిచిన మూడు దశాబ్దాలుగా విశేషంగా బీసీ వర్గాల హక్కులు, ప్రయోజనాల సాధనకు నిరంతరం కృషిచేస్తూనే ఉన్నారన్నారు. అన్ని కోణాలలో పరిశీలించిన దరిమిలా ‘‘పురస్కారం జ్యూరి కమిటి’’ ఈ అవార్డును డాక్టర్‌ వకుళాభరణంకు ఇవ్వాలని సూచించినట్లు వారు పేర్కొన్నారు. బహుజన కళా మహోత్సవాలు జరిగే ఆదివారం రోజంతా అన్ని కళారూపాల ప్రదర్శనలు ఉంటాయన్నారు. అలాగే బహుజన వర్గాల నుండి వివిధ రంగాలలో ‘‘పద్మశ్రీ’’ పురస్కారాలు అందుకున్న ప్రముఖులు కిన్నెరమెట్ల మొగిలయ్య, చింతకింది మల్లేశం, ఆచార్య కొలకనూరి ఇనాక్‌, ఎడ్ల గోపాలరావు, డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు, డాక్టర్‌ సాయిబాబా గౌడ్‌, దళవాయి చలపతిరావులకు జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.

ఆదివారం ఉదయం జరిగే ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రావెంకటేశంలు పాల్గొంటారు. అదేరోజు సాయంకాలం జరిగే ముగింపు సభలో ప్రముఖ కవి, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్శరరావు, తన స్వీయ రచన అయిన బహుజన శతకంలోని పద్యాలను ఆలపిస్తారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఉస్మానియా వర్సిటి తెలుగుశాఖ విభాగాధిపతి డా. సూర్యధనుంజయ్‌, పార్థ డెంటల్‌కేర్‌ ఇండియా ఛైర్మన్‌ డా.పార్థసారధి, పోలాండ్‌ బుజ్జి, హ్యాపి నివాస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.రమేష్‌, ధ్యాన మహర్షి మెగ మురళి తదితరులు పాల్గొంటారని డా. ప్రసాద్‌ తోటకూర, రాజేష్‌ సంకెలు వివరించారు.

ఈ కార్యక్రమంలో హాజరయ్యే వారు.. పాల్గొనాలనుకునేవారు ఇతర వివరాల కోసం బహుజన కళోత్సావాల ఆహ్వాన సంఘం చైర్మన్ అయిన తానా ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు ప్రసాద్‌ తోటకూర ను ఫోన్‌ నంబర్ 8985668985 , బహుజన కళోత్సావాల ఆహ్వాన సంఘం కన్వీనర్‌ అయిన తారా ఆర్ట్స్‌ అకాడమి అధ్యక్షులు సంకె రాజేష్‌ ను ఫోన్‌ నంబర్ 8332881050 లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version