NRI News : ఇదేం వింతయ్యా.. సత్యనారాయణ స్వామి దేవుడు అమెరికా వెళ్లాడు.. ఆంగ్లంలోనే కథ చెప్పాడు…

అతడికి తెలుగుతోపాటు ఇంగ్లీష్ పై కూడా విపరీతమైన పట్టు ఉందని చెబుతున్నారు. అతడు చెబుతుంటే అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లు శ్రద్ధగా వింటున్నారని, ఏ దేశమేగినా మన సంస్కృతిని మర్చిపోలేదని అంటున్నారు.

Written By: NARESH, Updated On : August 3, 2024 10:16 pm

Sathyanarayana Swamy is a priest who performed Vratam in English in America

Follow us on

NRI News : మన సంస్కృతి, మన సాంప్రదాయానికి సంబంధించిన కథలు తెలుగులోనే ఉంటాయి. మన ఐతిహ్యాన్ని ప్రతిబింబించే వృత్తాంతాలు కూడా తెలుగులోనే ఉంటాయి. వాస్తవానికి ఇవన్నీ సంస్కృతంలో ఉండగా.. వేద పండితులు, భాషా రచయితలు తెలుగులోకి అనువదించారు. ఇంకా కొంతమంది కవులు తెలుగులో అనేక రకాలుగా మన సంస్కృతి, మన సాంప్రదాయం, పూజా విధానాలను రచించారు. అవి నేటికీ బహిరంగ మార్కెట్లో పుస్తకాల రూపంలో లభ్యమవుతున్నాయి. సోషల్ మీడియా కాలంలో వీడియోల రూపంలోనూ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన వెబ్ సైట్ లు వాటిని ఆడియోల రూపంలో అందిస్తున్నాయి. ఇవి ఎలాంటి రూపంలో ఉన్నప్పటికీ అంతిమంగా తెలుగు భాషలోనే అవి లభ్యమవుతున్నాయి. చరిత్రలో ఇంతవరకు మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, పండుగల సందర్భంగా నిర్వర్తించే పూజా విధానాలను ఇంగ్లీషులో చెప్పిన వారు లేరు. అయితే తొలిసారిగా అమెరికాలో సత్యనారాయణ స్వామి వ్రత వృత్తాంతాన్ని ఇంగ్లీషులో ఓ అర్చకుడు వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోవడం సగటు నెటిజన్ వంతవుతోంది.

సాధారణంగా మన తెలుగు ఇళ్లల్లో సత్యనారాయణ స్వామి వ్రతం సాంప్రదాయపద్ధంగా నిర్వహిస్తారు. అర్చకుడు రావడం.. ప్రత్యేకమైన టేకు కలపతో తయారుచేసిన మందిరంలో సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ప్రతిష్టింపజేసి.. కలపతో చేసిన మందిరానికి మామిడి తోరణాలు కట్టి, పూలతో అలంకరించి.. పలు రకాలైన పండ్లు, వస్త్రాలు, నైవేద్యం ఏర్పాటుచేసి వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి వ్రతాన్ని అర్చకుడు నిర్వహిస్తుంటాడు. వ్రత సంకల్పం నుంచి మొదలు పెడితే నేపథ్యం వరకు ప్రతి విషయాన్ని తెలుగులోనే చెబుతాడు. వ్రతంలో కూర్చున్న దంపతులకు సత్యనారాయణ స్వామి గొప్పతనాన్ని వివరించే కథలను చెబుతుంటాడు. ఈ వ్రతం మొత్తం దాదాపు మూడు గంటల పాటు సాగుతుంది. తెలుగు ఇళ్లల్లో గృహప్రవేశం లేదా వివాహం, ఇతర శుభకార్యాల సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తారు. కొందరైతే శ్రావణమాసం సమయంలో సత్యనారాయణ స్వామికి వ్రతం జరుపుతారు. కాస్త స్తోమత ఉన్నవాళ్లు అన్నవరంలో స్వామివారికి వ్రతం నిర్వహిస్తారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం అమెరికాలో స్థిరపడిన కొన్ని తెలుగు కుటుంబాలు శ్రావణమాస ఆగమనాన్ని పురస్కరించుకొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించాయి. ఈ వ్రత క్రతువును జరిపేందుకు ఓ అర్చకుడు అమెరికా వెళ్ళాడు. ఆయనతోపాటు మరి కొంతమందిని కూడా తీసుకెళ్లాడు. పూజల్లో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, వ్రత నేపథ్యాన్ని పూర్తిగా ఇంగ్లీషులో వివరించుకుంటూ నిర్వహించాడు. సత్యనారాయణ స్వామి గొప్పతనాన్ని, రాక్షసులను సంహరించిన విధానాన్ని పూర్తిగా ఇంగ్లీషులోనే వివరించాడు. ఆయన ఇంగ్లీషులో చెప్తుంటే ఆ తెలుగు కుటుంబాల్లో ఓ వ్యక్తి వీడియో తీశాడు. దీనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అంతే ఒకసారిగా ఈ వీడియో చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది. “సత్యనారాయణ స్వామి అమెరికా వెళ్ళాడు. స్వామి వారి వ్రత నేపథ్యాన్ని అర్చకుడు ఇంగ్లీషులో చెప్పాడు. చూస్తుంటే వింతల్లోకి వింతలాగా ఇది కనిపిస్తోందని” వీడియో చూసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటివి సర్వసాధారణమని.. కాకపోతే ఆ అర్చకుడు ఇంగ్లీషులోనూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అర్థమయ్యేలా చెప్పాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. అతడికి తెలుగుతోపాటు ఇంగ్లీష్ పై కూడా విపరీతమైన పట్టు ఉందని చెబుతున్నారు. అతడు చెబుతుంటే అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లు శ్రద్ధగా వింటున్నారని, ఏ దేశమేగినా మన సంస్కృతిని మర్చిపోలేదని అంటున్నారు.