Telugu newspapers : “పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు. వాటి వల్ల సమాజానికి ఇసుమంత కూడా ఉపయోగం ఉండదు. అవి సమాజాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటాయి. ప్రభుత్వం నుంచి ప్రకటనలు పొందుతూ వాటి యాజమాన్యాలు అంతకంతకు ఎదిగిపోతుంటాయి. అందుకనే పత్రికలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది” ఈ మాట అన్నది ఎవరో కాదు.. ప్రఖ్యాత కవి, దివంగత శ్రీరంగం శ్రీనివాసరావు. ఏళ్ల క్రితం ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం నిజమవుతున్నాయి. యాజమాన్యాలు పత్రికల పేరుతో వ్యాపారాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలను బెదిరిస్తున్నాయి. నచ్చని ప్రభుత్వాలపై అడ్డగోలుగా వార్తలు రాస్తున్నాయి. ఇందులో ఈ పత్రిక ఆపత్రికని కాదు.. అన్నింటి బతుకు అదే. తెలుగు నాట ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబు డప్పు కొడుతుంటాయి. సాక్షి జగన్మోహన్ రెడ్డి కరపత్రిక. నమస్తే తెలంగాణ కెసిఆర్ మానస పుత్రిక. నచ్చినవారిని ఎత్తుకోవడం, గిట్టని వారిపై బురద చల్లడం వంటి ప్రక్రియలను ప్రస్తుతం తెలుగు నాట మీడియా విజయవంతంగా కొనసాగిస్తోంది. అయితే ఈ పత్రికలకు ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఇవ్వడం దర్జాగా సాగిపోతోంది. అనుకూల ప్రభుత్వం ఉంటే చాలు పత్రికలు పండగ చేసుకుంటున్నాయి. ఏబిసి రేటింగ్, సర్కులేషన్ మన్నూ మశానం వంటి వాటిని ఎవరూ చూడటం లేదు. ఫలితంగా అధికారంలో ఉన్నవారు పబ్లిక్ అండ్ రిలేషన్ శాఖను పూర్తిగా తమ అనుకూల మీడియాకు యాడ్స్ బిస్కెట్ ఇచ్చే సంస్థగా మార్చేశారు. ఇందులో ఎవరూ సుద్ధ పూసలు కాదు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2014 -19 మధ్యలో ఆ రెండు పత్రికలు ఈనాడు, జ్యోతికి అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చారు. ఈనాడుకు ఏకంగా 122 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారు. మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి ఏకంగా 73 కోట్ల రూపాయల విలువైన యాడ్స్ ఇచ్చారు. రెండవ స్థానంలో ఉన్న సాక్షి పత్రికకు 31 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారు. అప్పట్లో ఈ విషయంపై సాక్షి గగ్గోలు పెట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పైగా సర్కులేషన్ పరంగా మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి ఈనాడు తర్వాత స్థాయిలో ప్రకటనలు ఇవ్వడం అప్పట్లో చర్చకు దారి తీసింది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రజ్యోతి సేవలో తరించింది. ఆంధ్రజ్యోతి పత్రిక కోసం పలు ప్రాంతాలలో భూముల కేటాయించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకోసమే ఆంధ్రజ్యోతి చంద్రబాబు చిడతలు వాయించడంలో ఆరి తేరింది.
ఇక 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో సాక్షి పత్రికకు ఏకంగా 371 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. ఈనాడుకు 3.5 సంవత్సరాలలో 243 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. అది ఆంధ్రజ్యోతిపై పూర్తిగా కక్షగట్టారు. మూడున్నర సంవత్సరాల పాటు ప్రభుత్వ ప్రకటనలను ఈనాడు దర్జాగా ప్రచురించింది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రకటనలను ప్రచురించడం మానివేసింది. అధికారికంగా సమాచార శాఖకు లేఖ రాసింది. దీంతో జగన్ ప్రభుత్వం చివరి ఏడాదిన్నర పాటు ఈనాడు పత్రికకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వలేదు.
సాక్షికి ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి చంద్రబాబు ఇటీవల స్పందించారు. ఎవడబ్బ సొమ్మని సాక్షికి ఆస్థాయిలో యాడ్స్ ఇచ్చారని ప్రశ్నించారు. వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రెండు పత్రికలకు ఏ స్థాయిలో యాడ్స్ ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అదే విషయాన్ని ప్రస్తుతం వైసీపీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. అంటే ఇక్కడ వైసిపి నాయకులు సుద్దపూసలని కాదు. వారు కూడా తమ సాక్షికి ప్రభుత్వ సొమ్మును పప్పు బెల్లం లాగా పంచిపెట్టారు. ప్రభుత్వం పత్రికలకు యాడ్స్ ఇవ్వడాన్ని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ.. అందులో పని చేస్తున్న ఉద్యోగులకు నేటికీ అత్తెసరు జీతాలే ఉన్నాయి.
ఈనాడులో కాస్త ఉత్తమంగానే ఉన్నప్పటికీ.. అందులో రకరకాలుగా శ్రమదోపిడి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉషోదయలోకి ఏ ఉద్యోగిని తీసుకోలేదు. పైగా కేంద్ర కార్మిక చట్టాలు పాటించకుండా కొత్త కొత్త మ్యాన్ పవర్ ఏజెన్సీ లను సృష్టించింది ఈనాడు. అందులో భాగమే ఈనాడు డిజిటల్. ఈ విభాగంలో పని చేసే వారికి కార్మిక చట్టాలు పెద్దగా వర్తించవు.. ఇక ఆంధ్రజ్యోతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందులో జీతాల సరళి అత్యంత అధ్వానంగా ఉంటుందని అందులో పనిచేసి మానేసిన ఉద్యోగులు అంటుంటారు. ఇప్పటికీ పిఎఫ్ డబ్బులు కూడా సక్రమంగా ఎవరని, యాజమాన్యం కోటాలో సరిగా జమ చేయరని విమర్శిస్తుంటారు. అంతటి కోవిడ్ కాలంలోనూ ఉద్యోగి జీతం నుంచి వసూలు చేసే వెల్ఫేర్ ఫండ్ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. ఆ సమయంలో చాలామంది ఉద్యోగులను బలవంతంగా బయటికి పంపించారని ఆరోపణలు ఉన్నాయి.. ఇక సాక్షిలో పరిస్థితి కూడా వేతనాల విషయంలో అలానే ఉంది. ప్రస్తుతం అధికారంలో లేకపోవడంతో ఇంక్రిమెంట్ వాయిదా పడింది. అలాగాని అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఉద్యోగులకు గొప్ప ఇంక్రిమెంట్లు వేసిన దాఖలాలు లేవు.
నమస్తే తెలంగాణ గురించి పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడే నమస్తే తెలంగాణలో పనిచేసిన ఉద్యోగులు ఆందోళన చేశారు. తన వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో పెంచుతామని హామీ ఇచ్చిన యాజమాన్యం.. ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. ప్రస్తుతం అధికారం లేకపోవడంతో చాలామంది ఉద్యోగులను బయటికి పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక మిగతా పత్రికల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
స్థూలంగా చెప్పాలంటే పత్రికల వల్ల ప్రస్తుతం సమాజానికి పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ.. రాజకీయ పార్టీలు కొన్ని పత్రికలను నడిపిస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. అందులో ప్రచురితమయ్యే వార్తలకు క్రెడిబుల్టీ ఎంత ఉంటుందో.. ఇలాంటి పత్రికలకు ప్రభుత్వం నుంచి అంటే ప్రజల సొమ్మును యాడ్స్ రూపంలో ఇవ్వడం నిజంగా మతి లేని నిర్ణయం. యాడ్స్ కేటాయింపు విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే బాగుంటుంది. లేకుంటే ప్రజల సొమ్ము పత్రికలకు హారతి కర్పూరం అవుతుంది.
ఎవడబ్బ సొమ్మని సాక్షి కి ప్రకటనలు ఇచ్చారు – సీఎం బాబు
2014-19 మధ్య ….
ఎవరబ్బ సొమ్మని ఈనాడు జ్యోతి కి ప్రకటనలు ఇచ్చారు మీరు ?ఈనాడుకు ప్రభుత్వ ప్రకటనలు -122 కోట్లు
3వ స్థానంలో ఉన్న జ్యోతి కి ప్రభుత్వ ప్రకటనలు – 73 కోట్లు
2వ స్థానం లో ఉన్న సాక్షి కి ప్రభుత్వ ప్రకటనలు – 31… pic.twitter.com/cPbF2rjoWK— Anitha Reddy (@Anithareddyatp) August 3, 2024