Dollar Dream: డాలర్ డ్రీమ్ నెరవేర్చుకునేందుకు, అమెరికాలో చదవాలి, ఉద్యోగం చేయాలి, స్థిరపడాలనే కల నెరవేర్చకునేందుకు భారతీయులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దీంతో వెళ్లేవారు ఏటా పెరుగుతున్నారు. ఈ ఏడాది అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. మరోవైపు భారతీయుల వలసలు పెరుగుతున్నాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూఎస్ సీబీపీ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అడ్డదారిలో అమెరికాలో అడుగు పెట్టేందుకు చాలా మంది భారతీయులు కెనడా సరిహద్దును ఎంచుకుంటున్నట్లు తెలిపింది. కెనడా మీదుగా అక్రమంగా అమెరికాలోకి వెళ్లి అరెస్ట్ అవుతున్నారు. అక్రమంగా అమెరికాలోకి వెళ్లి అరెస్ట్ అవుతున్నవారిలో 22 శాతం మంది భారతీయులే ఉంటున్నారు.
యూఎస్ సీబీపీ గణాంకాలు ఇలా..
యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూఎస్ సీబీపీ లెక్కల ప్రకారం.. 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కెనడా మీదుగా అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించిన భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది.2022లో కెనడా మీదుగా అక్రమంగా అమెరికా వెల్లేందుకు యత్నించిన వారిలో 1,09,535 మంది ఉండగా అందులో భారతీయులు 16 శాతం ఉన్నారు. 2023–24 మధ్య అమెరికాలో కెనడా మీదుగా వెళ్లినవారు 1,89,402 మంది ఉండా ఇందులో భారతీయులు 30,010 మంది ఉన్నారు. 2024లో అమెరికాలో అక్రమంగా అడుగు పెట్టేవారు 1,98,929 మంది ఉంటారని అంచనా. వీరిలో భారతీయులు 43,764 మంది ఉంటారని తెలుస్తోంది.
కెనడా సరిహద్దే ఎందుకు?
అమెరికాలో అక్రమంగా ప్రవేశించేందుకు చాలా మంది భారతీయులు కెనడానే ఎందుకు ఎంచుకుంటున్నారంటే.. కెనడా వీసా ప్రక్రియ సులభంగా ఉంటుంది. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెస్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతుంది. అమెరికా వీసా రావాలంటే ఏడాది వేచి ఉండాలి. మరోవైపు అమెరికా – కెనడా సరిహద్దు చాలా పొడవుగా ఉంటుంది. అక్కడ రక్షణ తక్కువగా ఉంటుంది. అందుకే అడ్డదారిగా మార్చుకున్నారు.
పంజాబ్ నుంచే వలసలు ఎక్కువ..
కెనడా మీదుగా అమెరికాలోకి అక్రమంగా వెళ్తున్నవారిలో పంజాబీలే ఎక్కువగా ఉంటున్నారు. తర్వాత హరియాణా పౌరులు ఉంటున్నారు. ఆ తర్వాత గుజరాత్ వాసులు ఉన్నారు. విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కోసం పంజాబీ యువత ఎక్కువగా అమెరికా బాట పడుతోంది. విద్యార్థి వీసాలు రాకపోవడంతో అడ్డదారిని ఎంచుకుంటోంది. అయితే ఈ ప్రయత్నంలో చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. జైళ్లలో మగ్గుతున్నారు. కొందరు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.