NTR Jayanti Celebrations Los Angeles: తెలుగుజాతి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయి: రామ్మోహన్ నాయుడు
లాస్ ఏంజెల్స్ (అమెరికా): ఎన్ఆర్ఐ టీడీపీ లాస్ ఏంజెల్స్ ఆధ్వర్యంలో మినీ మహానాడు–2026తో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆరెంజ్ సిటీలోని తండూరి రెస్టారెంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ప్రవాస తెలుగు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా హాజరై ప్రసంగించారు. తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోందని అన్నారు.

రాష్ట్రంలో భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించామని, త్వరలో మలేషియా, హాంగ్‌కాంగ్, గల్ఫ్ దేశాలకు కూడా డైరెక్ట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

గత ఎన్నికల్లో కూటమి విజయానికి ఎన్ఆర్ఐల సహకారం ఎంతో కీలకమైందని, 2029 ఎన్నికల్లో కూడా వారి మద్దతుతో ఘన విజయం సాధిస్తామని రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్ఆర్ఐలకు తాను వారధిగా ఉంటానని హామీ ఇచ్చారు.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎన్ఆర్ఐల సహకారంతో విజయం సాధించామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారి మద్దతు కొనసాగించాలని కోరారు. పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
కార్యక్రమంలో మహానాడు తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన తెలుగు జాతికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
లాస్ ఏంజెల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట్టి, శ్రీధర్ సాతులూరి, వంశీ గరికపాటి, విష్ణు యలమంచి, ప్రతాప్ మెతరమిట్ట, సురేష్ అయినంపూడి, సురేష్ అంబటి, చందు గుత్తికొండ, శ్రీకాంత్ అత్తోటి, కిషోర్ గరికపాటి, వెంకట్ సుంకర తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
