Australia: ఆస్ట్రేలియాలో మరో దారుణం.. హైదరాబాద్‌ మహిళ హత్య.. ఏం జరిగిందంటే?

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం బక్‌లేలో హైదరాబాద్‌ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన వివాహిత చైతన్య మదగాని అలియాస్‌ శ్వేత శనివారం హత్యకు గురైంది. దుండగులు చైతన్యను చంపేసి ఆమె మృతదేహాన్ని చెత్త డబ్బాలో పడేశారు.

Written By: Raj Shekar, Updated On : March 10, 2024 2:51 pm

Australia

Follow us on

Australia: ఆస్ట్రేలియాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యురాలు ఉజ్వల అనుకోని ప్రమాదంలో మృతిచెందిన ఘటన మరువక ముందే.. మరో దారుణం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగుల పనిగా భావిస్తున్నారు.

ఏం జరిగిందంటే..
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం బక్‌లేలో హైదరాబాద్‌ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన వివాహిత చైతన్య మదగాని అలియాస్‌ శ్వేత శనివారం హత్యకు గురైంది. దుండగులు చైతన్యను చంపేసి ఆమె మృతదేహాన్ని చెత్త డబ్బాలో పడేశారు. హత్యకు సంబంధించిన సెకండ్‌ క్రైమ్‌ సీన్‌ను పాయింట్‌ కుక్‌లోని మిర్కావేలో ఉన్న చైతన్య ఇంట్లో పోలీసులు రీక్రియేట్‌ చేశారు. హత్య చేసినవాళ్లు చైతన్యకు తెలిసిన వారే అని పోలీసులు చెబుతున్నారు. హత్య తర్వాత దుండగులు దేశం నుంచి పారిపోయినట్లు కూడా గుర్తించారు. అయితే హత్య చేసినవారికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదని వెల్లడించారు.

హత్యపై అనుమానాలు..
ఇదిలా ఉండగా శ్వేతకు భర్త అశోక్‌రాజ్‌ వరికొప్పుల, మూడేళ్ల కొడుకు ఉన్నారు. వీరిద్దరూ ఇటీవలే ఇండియాకు వచ్చారు. ఇంతలో ఈ ఘటన జరగడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మరోవైపు హత్యపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసింది హైదరాబాద్‌కు చెందిన వారే అయి ఉంటారని భావిస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తులో వివరాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న దాబా హోటల్‌లో ఆమెను చంపినట్లు గుర్తించారు. హత్య వెనుక భర్త హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

వరుస మరణాలు..
మొన్నటి వరకు అమెరికాలో భారతీయుల వరస మరణాలు జరుగగా తాజాగా ఆస్ట్రేలియాలో అదే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన వైద్యురాలు ఉజ్వల ట్రెకింగ్‌కు వెళ్లి లోయలోపడి చనిపోయారు. ఆ విషాద ఘటన మరువక ముందే మరో ఘోరం విక్టోరియా రాష్ట్రంలో జరిగింది. చైతన్య హత్యకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో మహిళల హత్యపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్వేత హత్యతో కలిసి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 18 మంది మహిళలు హత్యకు గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది.