Chandrababu
Chandrababu: అతి కష్టం మీద బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరింది. గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత తనపార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలోకి పంపించారు. ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ కోసం శతవిధాలా ప్రయత్నాలు చేశారు. కానీ బిజెపి నుంచి ఆ స్థాయిలో స్పందన లేదు. కనీసం టిడిపి వైపు బిజెపి తొంగి చూడలేదన్న సంకేతాలు కూడా వచ్చాయి. బిజెపిలో చేరిన ప్రో టిడిపి నేతల ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీనికి కొందరు బిజెపి నాయకుల వైఖరే కారణం. ఇప్పుడు బిజెపితో పొత్తు కుదిరిన వేళ చంద్రబాబు అప్పట్లో అడ్డుకున్న నాయకుల పని పట్టాలని నిర్ణయించుకున్నారు.
గత ఎన్నికల సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఎన్నికల్లో బిజెపి ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ కన్నా లక్ష్మీనారాయణ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సోము వీర్రాజు వచ్చారు. ఆయన రాష్ట్రంలో వైసిపి తో పాటు టిడిపిని టార్గెట్ చేసుకున్నారు. ఆయన చేసిన ప్రతి విమర్శలోనూ చంద్రబాబు పేరు ఉండేది. చంద్రబాబు బీజేపీతో కలవాలన్న ప్రయత్నాన్ని నిలువరించడంలో సోము వీర్రాజు ముందుండేవారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తి లేదని తేల్చేసే వారు. అటు బిజెపి సీనియర్ నేత జివిఎల్ నరసింహం సైతం టిడిపికి వ్యతిరేకంగా ఉండేవారు. పొత్తును అడ్డగించిన నేతల్లో ఈయన ఒకరు. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రయత్నాలను బలంగా అడ్డుకునేవారు. చివరి వరకు పొత్తు వద్దని బిజెపి హై కమాండ్ కు విజ్ఞప్తి చేసేవారు. తుది వరకు లాబీయింగ్ సైతం చేశారు.
ప్రస్తుతం బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరింది. ఆరు అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంటు సీట్లు కేటాయించేందుకు టిడిపి అంగీకరించింది. అయితే ఈ సీట్లలో పోటీకి సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహం, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నా.. చంద్రబాబు అడ్డు తగిలే అవకాశం ఉంది. ఒకవేళ బిజెపి అగ్ర నేతల ప్రాపకంతో సీట్లు దక్కించుకున్నా.. వారిని తప్పకుండా ఓడించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బిజెపికి గ్రౌండ్ లెవెల్ లో బలం అంతంత మాత్రమే. అందుకే టిడిపి, జనసేన పై కచ్చితంగా ఆధారపడాలి. అదే జరిగితే ఆ రెండు పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు అండ్ కో అప్పట్లో పొత్తుకు అడ్డు తగిలిన వారిని పక్కకు తప్పించనున్నట్లు తెలుస్తోంది. బిజెపిలో ఉన్న ప్రో వైసిపి నేతలకు ఛాన్స్ లేదని సమాచారం. అదే సమయంలో బిజెపిలోని ప్రో టిడిపి నేతలకు టిక్కెట్లు ఖరారు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజమండ్రి నుంచి పురందేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, ఏలూరు నుంచి సుజనా చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మొత్తానికైతే టిడిపికి అడ్డు తగిలిన ఆనేతలను.. ఇప్పుడు చంద్రబాబు పక్కకు తప్పించనున్నారని తెలుస్తోంది.