TDP Janasena BJP Alliance: ఏపీలో పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చింది. టిడిపి,జనసేన,బిజెపి కూటమి ఖరారైంది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సైతం పూర్తయింది. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు, పవన్ లు అగ్రనేతలతో సమావేశం అయ్యారు. పొత్తును ఫిక్స్ చేశారు. టిడిపి ఎన్డిఏ లోకి చేరడం లాంఛనంగా మిగిలింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాలు చంద్రబాబుకు సాదరంగా ఎన్డీఏలోకి స్వాగతం పలికారు. ఈనెల 16న జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీకి చంద్రబాబుతో పాటు పవన్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది.
పొత్తులో భాగంగా బిజెపికి ఆరు అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాలు ఖరారు అయ్యాయి. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజెపి పడింది. బిజెపిలో ఇప్పటికే ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. చాలామంది సీనియర్లు సైతం ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బిజెపి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రానుండడంతో ఎక్కువమంది ఎంపీలుగా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. కొందరు సీనియర్లు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించేందుకు చూస్తున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యేల కంటే ఎంపీ సీట్లకే బిజెపిలో గిరాకీ ఉంది.అయితే ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో బిజెపి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు సమాచారం.బిజెపి ముఖ్య నేత శివప్రకాష్ జి అమరావతికి ఆ జాబితాతో వస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు పవన్ లతో చర్చించి జాబితాను ఫైనలైజ్ చేయనున్నారు.
బిజెపికి ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. అందులో రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. తిరుపతి నుంచి కర్ణాటక మాజీ సిఎస్ రత్నప్రభ లేదా ఆమె కుమార్తె నిహారిక పోటీ చేయనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. నరసాపురం నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారని సమాచారం. అయితే దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, నరేంద్ర వర్మల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అరుకు స్థానం నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పాడేరు నుంచి ఉమామహేశ్వరరావు పేరు ఖరారు కానుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు. పి. గన్నవరం నుంచి అయ్యాజీ వేమ, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ లేదా తపన చౌదరి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వల్లూరు జయప్రకాష్, ధర్మవరం నుంచి వరదాపురం సూరి పేర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది. విశాఖ నుంచి పీవీఎన్ మాధవ్, కృష్ణాజిల్లా నుంచి మట్టా ప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లా నుంచి పాకా సత్యనారాయణ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు చెందిన మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు. మరి బిజెపి హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.