Viral Video: జంతువుల నుంచి మనుషులు పుట్టారు గాని.. జంతువుల నుంచి చాలా నేర్చుకోవాలి.. వీడియో వైరల్

Viral Video: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ అడవిలో మూడు రకాల సింహాలు ఉన్నాయి. నలుపు, ముదురు బంగారు, తెలుపు రంగులతో అవి కనువిందు చేస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 3, 2024 3:31 pm

Big cats need spooning too

Follow us on

Viral Video: కోతుల నుంచి మనుషులు పుట్టారు. అనేక పరిణామ క్రమాల తర్వాత బుద్ధి జీవులుగా ఎదిగారు. ఈ భూమ్మీద ఉన్న సమస్త జంతువుల కంటే గొప్పగా అభివృద్ధి చెందారు. కానీ, “రాను రాను రాజు గుర్రం.. “(ఇక్కడ గాడిదలు క్షమించాలి) అయింది అనే సామెత తీరుగా మనిషి వ్యవహార శైలి మారిపోతుంది.. అభివృద్ధి కోసం చెట్లను నరుకుతున్నాడు.. అంతకంతకు విస్తరించాలనే కోరికతో స్వార్థపరుడిగా వ్యవహరిస్తున్నాడు. చివరికి తన సుఖం కోసం, తన లాభం కోసం తోటి మనుషులను మోసం చేసేందుకు, అంతం చేసేందుకు, తుదకు నాశనం చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.. అంతేనా కులం, మతం, ధనం, వర్గం, వర్ణం పేరుతో విభేదాలు సృష్టించుకుంటూ.. మనుషులు కాస్త..”మనీ”షులుగా మారుతున్నారు. ఇలాంటి క్రమంలోనే జంతువులు మనుషులకు పాఠాలు చెబుతున్నాయి. అయితే వాటికి నోరు ఉండదు కాబట్టి.. వాటిచేతలు, హావభావాలతో కనువిప్పు కలిగిస్తున్నాయి.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ అడవిలో మూడు రకాల సింహాలు ఉన్నాయి. నలుపు, ముదురు బంగారు, తెలుపు రంగులతో అవి కనువిందు చేస్తున్నాయి. ముందుగా నలుపు రంగు సింహం అడవిలో ఉండగా.. ముదురు బంగారు వర్ణం సింహం వచ్చింది. నలుగురంగు సింహం మీద పడుకుంది. ఆ తర్వాత తెలుపు రంగు సింహం కూడా వాటి మధ్యలో చేరింది. ఇలా మూడు సింహాలు చాలాసేపు సయ్యాటలాడాయి. ఒకదాన్ని ఒకటి కవ్వించుకున్నాయి. ఆ తర్వాత మూడు కలిసి అడవిలోకి వెళ్లాయి. అక్కడ కూడా ఓ చెట్టు కింద సేద తీరాయి. ఇలా చదువుతుంటే మీకు పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు. ఇంతోటి దానికి ఈ స్థాయి వర్ణన అవసరమా అనిపించవచ్చు.. కానీ ఇక్కడే తెలుసుకోవాల్సిన నీతి చాలా ఉంది.

మనుషుల్లో వర్ణం బట్టి గౌరవాలుంటాయి. వర్గాన్ని బట్టి మర్యాదలుంటాయి. కులాన్ని బట్టి సత్కారాలు లభిస్తాయి. హోదాను బట్టి నమస్కారాలుంటాయి. కానీ ఇవేవీ జంతువుల్లో ఉండవు. నలుపు రంగు సింహమైనా, తెలుపు రంగు సింహమైనా ఒక్కటే విధంగా ఉంటుంది. కాకపోతే అడవుల్లో వాటికి వాటికి మధ్య హద్దులు ఉంటాయి. ఒకదాని హద్దులోకి మరొకటి వెళ్లదు. పైగా ఒకదానికొకటి తారసపడినప్పుడు దూరంగా వెళ్తాయి. అరుదుగా మాత్రమే పోట్లాడుకుంటాయి. అంతేతప్ప తమ జాతి విస్తరణ కోసం, తమ జాతి మనుగడ కోసం ఆకారణంగా ఇతర జంతువుల మీద పడవు. ఆకలైనప్పుడు మాత్రమే వేటాడుతాయి. అది వాటి సహజ లక్షణం కూడా. కానీ ఇలాంటి సందర్భంలోనే మనుషులు ఎలా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకుంటే.. తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే జంతువుల నుంచి మనుషులు పుట్టారు. కానీ ఆ జంతువుల నుంచే నేర్చుకునే స్థాయికి దిగజారారు.