Peddireddy Ramachandra Reddy: వైసీపీలోని అతి శక్తివంతమైన నేతల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. జగన్ తర్వాత అతనే అన్నట్టు ఉంటుంది వ్యవహారం. పేరుకే నెంబర్ 2 గా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పేర్లు వినిపించినా.. పెద్దిరెడ్డి ముందు వారు నిలబడలేరన్నది వైసీపీలో వినిపించే మాట. కేవలం అధినేత జగన్ ప్రాపకం కోసం మిగతా నేతలంతా పాకులాడితే.. అదే జగన్ నుంచి గౌరవ మర్యాదలు అందుకునే స్థాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. మిగతా వారు వంగి వంగి నమస్కారాలు చేయాల్సిందే జగన్ కు. కానీ పెద్దిరెడ్డి విషయంలో మాత్రం జగన్ చాలా జాగ్రత్తగా ఉంటారు. గౌరవం ఇస్తారు. వైసిపి ఐదేళ్ల పాలనలో రాయలసీమనే శాసించారు పెద్దిరెడ్డి. చివరకు మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం రావాలన్నా పెద్దిరెడ్డి అనుమతి పొందాలన్న రేంజ్ లో పరిస్థితిని కల్పించారు.సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు చుక్కలు చూపించారు.హిందూపురంలో బావమరిది బాలకృష్ణను, కుప్పంలో బావ చంద్రబాబును ఓడిస్తానని ప్రతిన బూనారు. కానీ ఓడించలేకపోయారు. అయితే రాష్ట్రంలో వైసిపి దారుణంగా ఓడిపోయినా.. రాయలసీమలో తుడుచుపెట్టుకుపోయినా.. తాను గెలవడమే కాదు.. పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు గెలిచారు. అంతలా ఉంటుంది పెద్దిరెడ్డి హవా. కానీ ఇప్పుడు అదే పెద్దిరెడ్డికి కష్టాలు వెంటాడుతున్నాయి. కేసుల రూపంలో టిడిపి కూటమి ప్రభుత్వం వెంటపడుతోంది. పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.ఒకవైపు కేసులు,మరోవైపు అవినీతి ఆరోపణలు.. ఇలా ముప్పేట దాడి జరుగుతోంది. కానీ పెద్దిరెడ్డి నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రకటనలు రావడం లేదు.
* మరో వివాదం
తాజాగా పెద్దిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన సతీమణి స్వర్ణలతకు అసైన్డ్ పట్టా కింద ఐదు ఎకరాల చెరువు భూమి పొందినట్లు బయటకు వచ్చింది. వాస్తవానికి ప్రభుత్వ భూములతో పాటు అసైన్డ్ భూములను దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి పట్టాలు కింద ఇస్తారు. ఇలాంటి భూమి 20 ఏళ్ల అనుభవములో ఉన్నట్లయితే క్రయవిక్రయాలకు వీలుగా ఫ్రీ హోల్డ్ చేస్తూ వైసిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమైన ఉదంతం తర్వాత 20 ఏళ్లు అనుభవం లేని భూమిని సైతం ఫ్రీ హోల్డ్ లో పెట్టినట్లుగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తాజాగా చెబుతున్నారు.
* వెలుగులోకి ఆసక్తికర అంశాలు
మదనపల్లె ఘటన నేపథ్యంలో రెవెన్యూ శాఖ విచారణ ప్రారంభించింది. ఇందులో ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. పెద్దిరెడ్డి సతీమణి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి. ఆమె పేరు మీద ఐదు ఎకరాల ఆస్తి ఉంది. రికార్డుల ప్రకారం ఆ భూమిని చెరువుగా చూపిస్తోంది. తాజాగా ఫ్రీ హోల్డ్ చేసినట్లు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం తర్వాత అందరి వేళ్ళు పెద్దిరెడ్డి వైపే చూపించాయి.ఇప్పుడు కుటుంబ సభ్యుల పేరుమీద నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులు బయటకు వస్తుండడం, ఫ్రీ హోల్డ్ లో పెట్టినట్లు చూపిస్తుండడంతో ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది.
* వ్యూహాత్మక మౌనం
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైలెంట్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు రాకమునుపే ఆయన విదేశాలకు చెక్కేశారని ప్రచారం జరిగింది. సొంత నియోజకవర్గం పుంగనూరులో పర్యటనను స్థానికులు అడ్డుకున్నారు. అడ్డంకులు సృష్టించారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి సైతం అదే పరిస్థితి ఎదురయింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.