AP SKOCH Award: జగన్ సర్కార్ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. సుపరిపాలన అందించి జాతీయస్థాయిలో గుర్తింపు సాధించింది.’ కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2023′ లో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. 2022 రిపోర్టులో నాలుగో స్థానంలో ఉన్న ఏపీ.. ఏడాది తిరిగేసరికి ఒక స్థానాన్ని మెరుగుపరుచుకోవడం విశేషం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక రాష్ట్రం కావడం గమనార్హం.మొదటి స్థానంలో ఒడిస్సా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్,మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో గుజరాత్ నిలిచినట్లు స్కోచ్ రిపోర్టు వెల్లడించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు. పల్లె చెంతకి పాలన తీసుకొచ్చేందుకు గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు,వెల్నెస్ కేంద్రాలు నిర్మించిన విషయం తెలిసిందే.పౌర సేవలు,సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించారు. నేరుగా రేషన్ ను ఇంటి వద్దకే తీసుకెళ్లి అందిస్తున్నారు. సామాజిక పింఛన్లను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారు. పెద్ద ఎత్తున గృహ నిర్మాణం చేపట్టారు. స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ సర్వేలో కూడా ఇదే తేలింది. వైసిపి గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేసినట్లు స్పష్టమైంది. అందుకే ఏపీ మూడో స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ అరుదైన గుర్తింపు దక్కడం విశేషం. జగన్ చేపడుతున్న విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయస్థాయిలో ఏపీకి ఈ గుర్తింపు లభించిందని వైసీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లడం వంటి అంశాలతోనే ఈ ఘనత సాధ్యమైనట్లు తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికల ముంగిట స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఏపీ ముందంజలో ఉండడం విశేషం. ఇది ఎన్నికల్లో కలిసి వచ్చే అంశం అవుతుందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి.