New Governor of Goa 2025: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు అశోక్ గజపతిరాజు. కీలక పదవులు చేపట్టారు. రాష్ట్ర మంత్రితో పాటు కేంద్ర మంత్రివర్గంలో సైతం సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా కూడా పనిచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. కుమార్తెను ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన అశోక్ గజపతిరాజు.. తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలకు పరిమితం అయ్యారు. ఇప్పుడు ఆయనకు గవర్నర్ పదవి వరించింది. గోవా గవర్నర్గా ఆయన నియమితులు అయ్యారు.
Also Read: ఎయిర్ పోర్టులో కుప్పకూలిన విమానం.. భయానక వీడియో వైరల్
పూసపాటి రాజవంశీయుడిగా..
విజయనగరం ( Vijayanagaram )అంటే ముందుగా గుర్తొచ్చేది పూసపాటి రాజవంశం. అటువంటి రాజవంశం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు అశోక్ గజపతిరాజు. 1978లో తొలిసారిగా జనతా పార్టీ తరపున పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి తో సమకాలీకులుగా ఉండేవారు. ఎన్టీఆర్ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున 1983, 1985, 1989, 1994,1999 ఎన్నికల్లో గెలిచారు. 2004లో మాత్రం తొలిసారిగా రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంతో ఓడిపోయారు. 2009లో ఎమ్మెల్యేగా తిరిగి గెలిచారు అశోక్ గజపతిరాజు. 2014లో మాత్రం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అశోక్ గజపతిరాజు మంత్రి అయ్యారు. ఒకసారి మాత్రం స్పీకర్ పదవి చేపట్టారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నారు. గవర్నర్గా ఆయన ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.
కొద్దిరోజులుగా ప్రచారం
వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల తరువాత టిడిపికి కేంద్రం గవర్నర్( governor) పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం నడిచింది. ఆ సమయంలోనే అశోక్ గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపించింది. మరో సీనియర్ యనమల రామకృష్ణుడు పేరు తెరపైకి వచ్చినా.. సీనియారిటీ పరంగా అశోక్ గజపతిరాజు వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు అశోక్ గజపతిరాజు. విజయనగరంలో సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్నా.. టిడిపి నాయకత్వం మాత్రం అశోక్ గజపతిరాజుకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఒక్క అవినీతి మచ్చలేని నాయకుడు అశోక్ గజపతిరాజు కావడం గమనార్హం. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, సింహాచలం దేవస్థానం చైర్మన్ గా, రామతీర్థం శ్రీరామ వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా.. అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు కొనసాగుతూ వచ్చారు.
Also Read: ఏపీకి మరో ఇంటర్నేషనల్ సంస్థ!
సామాన్య జీవనం..
తన రాజకీయ జీవితంలో చేయని పదవి అంటూ లేదు. ఎమ్మెల్యే అయ్యారు. ఎంపీ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రిగా వ్యవహరించారు. రాజ్యాంగబద్ధ పదవిగా ఉన్న అసెంబ్లీ స్పీకర్ పదవిని సైతం అనుభవించారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సామాన్య జీవితానికి అలవాటు పడిన వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు. అయితే ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అశోక్ గజపతిరాజు బాధితుడుగా మిగిలారు. అప్పట్లో ఆయనను చూసిన చాలామంది బాధపడ్డారు. సీఎం చంద్రబాబు సైతం అశోక్ గజపతిరాజుకు గౌరవప్రదమైన పదవీ విరమణ ఇవ్వాలని భావించారు. అందుకే గవర్నర్ గా అవకాసం ఇచ్చారు. మరి కొద్ది రోజుల్లో ఆయన గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.