Nagababu AP Cabinet: ఏపీ క్యాబినెట్ ( AP cabinet)విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అన్న ఎదురుచూపులు అందరిలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న మంత్రులలో కొంతమందిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే భారీ మార్పులు చేపట్టడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటుతోంది. మరో ఏడాది దాటితేనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిపితే మేలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇటీవల క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం నడుస్తోంది. మీరు మారండి.. లేకుంటే కొత్తవారు మంత్రులుగా వస్తారంటూ నేరుగా చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి మంత్రివర్గ విస్తరణ పై తెగ చర్చ జరుగుతోంది.
Also Read: ఏపీకి అవార్డుల పంట.. హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు!*
* ఎడతెగని జాప్యం..
ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. అది మెగా బ్రదర్ నాగబాబుకు( Mega brother Naga babu ) ఖాయమని ప్రచారం జరిగింది. కానీ ఏపీ క్యాబినెట్లో నాగబాబును తీసుకోవడం చాలా జాప్యం జరుగుతోంది. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై నెలలు దాటుతోంది. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అయితే నాగబాబు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డు తగులుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అన్నదమ్ములిద్దరూ ఏపీ క్యాబినెట్లో ఉంటే అనవసర విమర్శలు వస్తాయని పవన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాగబాబు ఒక్కరి కోసమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడితే అనవసరంగా ఇబ్బందులు వస్తాయని సీఎం చంద్రబాబు సైతం భయపడుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎటు తేల్చుకోలేక సీఎం పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది.
* ఏపీ క్యాబినెట్లో బిజెపికి పదవి
మరోవైపు ఏపీ క్యాబినెట్లో బిజెపికి( Bhartiya Janata Party) మరో మంత్రి పదవి కేటాయించాలని కేంద్ర పెద్దలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాబినెట్లో బిజెపి నుంచి సత్య కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నారు. ఆయనతో పాటు మరొకరికి అవకాశం ఇవ్వాలని బిజెపి పెద్దలు కోరుకుంటున్నట్లు సమాచారం. అందుకు బదులుగా ఏపీకి కేంద్రంలో ఒక మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ బంపర్ ఆఫర్ ఏపీలో కూటమిలోని ఏ పార్టీకి దక్కుతుందా అని చర్చ ప్రారంభం అయింది. అయితే జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లేకపోవడంతో.. ఆ పార్టీకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* జనసేన నుంచి ఆయనకే..
అయితే జనసేన( janasena ) నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అయితే వారిద్దరినీ కాదని నాగబాబును కేంద్ర మంత్రివర్గంలోకి పంపిస్తారని ప్రచారం సాగుతోంది. పార్టీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. కేంద్రంతో సమన్వయం చేసుకునేందుకు నాగబాబు మంత్రిగా ఉంటే బాగుంటుందని పవన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి పదవి చేపట్టాలంటే రాజ్యసభ పదవి తప్పనిసరి. ఈ లెక్కన నాగబాబు మరో ఏడాది వెయిట్ చేయక తప్పదు. వచ్చే ఏడాది ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. అప్పటివరకు నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకపోతే మాత్రం.. ఆయన కేంద్ర క్యాబినెట్ లో చేరడం ఖాయమని తెలుస్తోంది.